సమాచార హక్కు చట్టం 75 ఏండ్ల స్వతంత్ర భారత దేశ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. ప్రభుత్వాల్లో జవాబుదారీతనాన్ని పెంచింది. ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించింది.ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితిని కల్పించింది. అవినీతికి అడ్డుకట్ట వేసింది. పారదర్శకతను పెంపొందించింది. ప్రభుత్వం స్వచ్ఛందంగా సమాచారం వెల్లడించడానికి దోహదం చేసింది.
సమాచార హక్కు చట్టం అక్టోబర్ 12, 2005న దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. సుపరిపాలన, పారదర్శక పాలన అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేసింది. జాతీయ సలహా మండలి సూచనల మేరకు సమగ్రంగా ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర సమాచార కమిషన్, రాష్ర్టాల స్థాయిలో రాష్ట్ర సమాచార కమిషన్లు ఏర్పడ్డాయి. ఈ 17 ఏండ్లలో సమాచార హక్కును ప్రజలు, సామాజిక కార్యకర్తలు విస్తృతంగా వినియోగించుకున్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లోని లోపాలను సహ చట్టం ద్వారా ప్రశ్నించారు. దీని వల్ల ప్రభుత్వాల పరిపాలనలో పారదర్శకత పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం సహ చట్టం స్ఫూర్తిగా పని చేస్తున్నది. పారదర్శకంగా, నిష్పాక్షికంగా, స్వచ్ఛందంగా ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని గతంలో శాసన సభ సాక్షిగా ప్రకటించి ఆ వాగ్దానాన్ని అమలు చేస్తున్నది.
సహ చట్టంపై ప్రజల్లో అవగాహన పెరిగినా, ఇంకా కొందరికి సహ చట్టం ద్వారా సమాచారం ఎలా అడగాలో తెలియడం లేదు. కానీ ఇది చాలా సులభమని ప్రజలు తెలుసుకోవాలి. తెల్ల కాగితంపై ఇంగ్లీషు లేదా హిందీ లేదా స్థానిక ప్రాంతీయ భాషలో దరఖాస్తు రాసి ప్రజా సమాచార అధికారికి సమర్పించవచ్చు. ఇంగ్లీషు లేదా హిందీ లేదా స్థానిక ప్రాంతీయ భాషలో తమకు కావాల్సిన సమాచారం ఇవ్వమని సదరు అధికారిని కోరవచ్చు. సమాచారం ఎందుకు కోరుతున్నామో కారణం పేర్కొనాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించిన బోర్డు ఉంటుంది. అందులో ప్రజా సమాచార అధికారి పేరు, ఫోన్ నెంబర్ ఉంటాయి. గ్రామ పంచాయితీ స్థాయిలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఉచితంగా సమాచారాన్ని పొందవచ్చు. మిగిలినవారు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రూ.10 రుసుముగా చెల్లించి సమాచారం పొందవచ్చు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7(1)ప్రకారం దరఖాస్తు చేసిన 30 రోజుల లోపు సమాచారం ఇవ్వాలి. ఎవరైనా ప్రభుత్వ అధికారి సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తే మొదటి అప్పిలేట్ అధికారికి సెక్షన్ 19(1)కింద దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ కూడా సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే సెక్షన్ 19(3), 18(1) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్కు అప్పీల్ చేయవచ్చు.
తెలంగాణలో రెవెన్యూ శాఖకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ఎక్కువగా అడుగుతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజలకు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవాలను వెలికి తీయడానికి ఉపయోగించుకోవాలి. సత్యం కోసం, స్వేచ్ఛ కోసం, నీతి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా ప్రయోజనం కోసం, సంక్షేమ అభివృద్ధి ఫలాల కోసం ఈ చట్టాన్ని ఉపయోగించాలి. ఈ చట్టం ద్వారా అనేక ప్రభుత్వ పథకాలు, విధానాలు, కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియడం వల్ల కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో పరిపాలన మెరుగుపడింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడం వల్ల స్థానికులకు ఎంతో మేలు కలుగుతున్నది.
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ సహ చట్టం స్ఫూర్తిని వంద శాతం చిత్త శుద్ధితో అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ 13.09.2017న ఏర్పడింది. ఆనాటి నుంచి నేటి వరకు కమిషన్కు మొత్తం 38 వేల అప్పీళ్లు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 32 వేల అప్పీళ్లు పరిష్కారమయ్యాయి.
దరఖాస్తుదారులకు వీలైనంత త్వరగా సమాచారాన్ని అందించడంలో రాష్ట్ర సమాచార కమిషన్ దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తనకు వచ్చిన అప్పీళ్లను కమిషన్ 3-6 నెలల లోపు పరిష్కరిస్తున్నది. సమాచార హక్కు చట్టం గురించి ప్రచారం చేయడాన్ని కూడా రాష్ట్ర కమిషన్ బాధ్యతగా నిర్వహిస్తున్నది. క్షేత్ర స్థాయిలో సమాచారం హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. కరోనా వల్ల గతం లో లాక్ డౌన్ విధించినప్పుడు రా ష్ట్ర కమిషన్ కొంత కాలం టెలిఫోన్ ద్వారా దరఖాస్తులను విచారించి వారికి కావాల్సిన సమాచారాన్ని అందజేసింది. మానవీయ కో ణంలో దరఖాస్తులను పరిశీలించి అత్యవసరమైన వారికి వేగంగా సమాచారాన్ని అందిస్తున్నది.
(వ్యాసకర్త: డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్ , 99088 17986 రాష్ట్ర సమాచార కమిషనర్)