2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి దేశ ప్రజలను అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. పేదోడి పొట్టకొట్టి కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేస్తున్నది. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి వాటిని ప్రైవేట్‌పరం చేస్తున్నది. చమురు ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపింది. గ్యాస్ ధర భారీగా పెరగడంతో వంటింట్లో మహిళలు కన్నీళ్లు పెడుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పండించే పంటసరైన గిట్టుబాటు ధర లేదు. కుల, మత విద్వేషాల మధ్య సామాన్య ప్రజలు బలైపోతున్నారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాల్లేక నిరుద్యోగ సమస్య పెను సవాల్‌గా మారింది. ఫలితంగా దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
దేశంలో ప్రత్యామ్నాయంగా ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టిసారించారు. కేసీఆర్ ఆలోచనా విధానంతో తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీ తదితర విపక్ష పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఏకీభవిస్తున్నారు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు అధికారం చేపట్టాలనే సంకేతాలు ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు తమ రాష్ర్టాలకే పరిమితం కాకుండా దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజా పోరాటాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు అన్నివిధాలా అర్హుడే అన్న భావన ప్రజల్లో ఉన్నది. కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పాత్ర కీలకం కానున్నది.
బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో దేశ సంపద కేవలం పదిమంది కార్పొరేట్ కుబేరుల చేతుల్లోకి చేరింది. రాష్ర్టాల హక్కులను కాలరాసి దేశ సంపదను దోచుకుంటున్నారు. దీంతో దేశంలో బీజేపీ ప్రభుత్వంపై సామాన్య ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు విసిగిపోయారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెసేయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే అధికా రం ఇవ్వాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నది.
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గమనిస్తే బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 62, మధ్యప్రదేశ్‌లో 28, గుజరాత్లో 26, కర్ణాటకలో 25, రాజస్థాన్‌లో 24, మహారాష్ట్రలో 23, పశ్చిమ బెంగాల్లో 18, బీహార్‌లో 17, జార్ఖండ్‌లో 11, అసోంలో 9 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. అయితే పశ్చిమబెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించి 43.63 ఓటు బ్యాంకు ను సాధించింది. అదే సమయంలో 2021అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ 213 స్థానాల్లో గెలుపొంది 48.51 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అంటే తన ఓటు బ్యాంకును 4.88 శాతం మేర పెంచుకోవడం ద్వారా కాషాయ జెండాను చతికిల పడేలా చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని స్పష్టమైంది.
మరోవైపు ఏండ్లతరబడి మహారాష్ట్రలో బీజేపీ శివసేనతో దోస్తీ కొనసాగించింది. కానీ మొన్నటిసారి ఎన్నికల్లో బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్, ఎన్సీపీతో జతకలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే వారి భాగస్వామ్యాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని కూలగొట్టారు. దీంతో సామాన్య ప్రజలు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. దాని ఫలితంగా ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉన్నది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ బీజేపీకి వీడ్కోలు పలికి ఆర్జేడీతో జతకట్టి మళ్లీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగారు. దాంతో బీహార్‌లో బీజేపీకి నిలువ నీడ లేకుండాపోయింది.
మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ ప్రధాని దేవెగౌడ కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం కేసీఆర్‌ను కలిసి తమ మద్దతును ప్రకటించారు. కర్ణాటకలో జనతాదళ్‌కు ఎక్కువ శాతం ఓటుబ్యాంకు ఉన్నది. ఇది రానున్నరోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నది. యూపీకి చెందిన ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ సైతం కేసీఆర్ వెంట కలిసి నడిపేందుకు సిద్ధం అంటున్నారు. ఈశాన్య రాష్ర్టాల పార్టీలు సైతం తమ రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలపైన గొంతెత్తాలని భావిస్తున్నాయి.
అందుకే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అడుగడుగునా ఎండగడుతున్నారు. ప్రజలకు సైతం బీజేపీ ఒంటెత్తు పోకడలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. బీజేపీకి కర్రు కాల్చి వాతపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అందుకు, తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రజలు సంకేతాలు ఇస్తున్నారు. దేశ నేతగా కేసీఆర్‌కు అన్ని అర్హతలున్నాయి. ఎందుకంటే తెలంగాణలో అమలవుతున్న పరిపాలన విధానం దేశానికి ఓ మార్గనిర్దేశాన్ని చూపింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలకందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణలో అమలవుతున్న పథకాలకు అవార్డులు ప్రకటిస్తున్నది. అనేక రాష్ర్టాలు తెలంగాణ పరిపాలన విధానాలను అమలుచేసేందుకు సిద్ధమవుతున్నాయి. పరిపాలన విషయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన కేసీఆర్ దేశ స్థితిగతులను మార్చే సత్తా ఉన్న నేతేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం కేసీఆర్ జెండా ఎజెండా కింద కలిసి పనిచేసేందుకు అనేక మంది నేతలు ముందుకు వస్తున్నారు. కాబట్టి దేశ ప్రజల భవిషత్తును దృష్టిలో పెట్టుకొని రానున్న రోజు ల్లో దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక భూమిక పోషించాలని ఆకాంక్షిద్దాం.
(వ్యాసకర్త: మర్రి యాదవ రెడ్డి ,73372 22461, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్)