గతం తాలూకు గాయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టడమే విజ్ఞుడైన నాయకుడి కర్తవ్యం. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ బాధ్యత నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నారు. చరిత్రలో కొన్ని కఠిన వాస్తవాలను మరచిపోలేం. రాజకీయ పార్టీలు సైతం చరిత్ర చేసిన గాయాలకు మందు పూస్తున్నట్టు నటిస్తూ వాటిని ఇంకా తిరగదోడతాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ లేనంతగా ఈసారి ‘సెప్టెంబర్ 17’ మీద శ్రద్ధ చూపించడం ఇలాంటిదే. నిజంగానే బీజేపీకి తెలంగాణ పట్ల చిత్త శుద్ధి ఉంటే 8 ఏండ్ల క్రితమే వారనుకున్న విధంగా ఈ రోజున విమోచన దినం
జరపవచ్చు కదా? కానీ తెలంగాణలో పాగా వేయడం కోసం ఇంత కంటే మంచి సందర్భం దొరకదని ఆ పార్టీ భావించడమే నేటి హడావిడికి కారణం.
కానీ చరిత్రను పరిశీలించకుండా మనం దేన్నీ విశ్వసించకూడదు. ఏ నినాదానికి ప్రభావితం కాకూడదు. ఇంతకు ఇది విలీనమా? విమోచనా? లేక విద్రోహమా?… విలీనం అయితే ఎవరితో ఎవరి విలీనం? హైదరాబాద్ రాజ్య ప్రజలు భారత్‌లో కలవడానికి నాడు మానసికంగా సన్నద్ధులయ్యారా? విమోచన విస్తృతార్థం ఏంటి? ఎవరు ఎవరి నుంచి విమోచన పొందారు?… ఈ అంశాలన్నింటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎంతో ప్రాధాన్యత లభించింది. మౌంట్ బాటన్ చేసిన మూడు సూచనల్లో ఒకదాని ప్రకారం ఆనాటి నిజాం హైదరాబాద్‌ను స్వతంత్య్ర రాజ్యంగానే కొనసాగించాలనుకున్నారు. అందుకోసం 1947 అక్టోబర్ నెలలో నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందానికి అంగీకరించారు. కానీ అందుకు కొన్ని నెలల ముందు 1947 జూన్‌లో జాయిన్ ఇండియా నినాదంతో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ సభ నిర్వహించే ప్రయత్నం చేసి అరెస్టయ్యారు. నిజానికి ఈ సభకు అసలు సభికులే కరువయ్యారు. హైదరాబాద్ సంస్థానంలో అధిక జనాభా గల హిందూ సమాజం నుంచి సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ నిజాంకు వ్యతిరేకంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో రాష్ట్ర కాంగ్రెస్ విఫలమైంది.
హైదరాబాద్ యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆ తర్వాతి ఏడాది(1948) జూలై నుంచే హైదరాబాద్ ప్రభుత్వంపై భారత్ ప్రభుత్వం ఒత్తిడి మొదలుపెట్టింది. కమ్యూనిస్టులు, రజాకార్లను అణచడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని, వారిని అణచేందుకు స్వయంగా సైన్యం రంగంలోకి దిగక తప్పదని భారత్ ప్రకటించింది. ఈ విషయమై ఐరాసకు నిజాం ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 16,1948న జరిగిన ఐరాస భద్రతా సమితి సమావేశంలో చైనా, రష్యా తప్ప మిగిలిన సభ్య దేశాలన్నీ హైదరాబాద్ మీద భారత్ చేసిన దాడిని ఖండించాయి. కానీ మరుసటి రోజే పోలీస్ చర్య ముగిసి హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైపోయింది.
హైదరాబాద్ రాజ్యంలో ప్రజా ఉద్యమాలు నడిపిన స్టేట్ కాంగ్రెస్ గాని, తెలంగాణ సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్టులు గాని ఇప్పటికీ ఈ విలీన, విమోచనాంశాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించ లేదు. అసలు ఇంత హడావుడిగా హైదరాబాద్ రాజ్యంపై దాడికి పని చేసిన చోదక శక్తి ఏమిటి? అప్పటికే ఉవ్వెత్తున లేచిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచి వేసేందుకే ఈ దాడి అన్నది కమ్యూనిస్టుల వాదన. ఈ వాదనకు మూలాలు నాటి భారత వైస్రాయి రాజగోపాలచారి సలహాదారు వి.పి.మీనన్ రచించిన ‘ది స్టోరి ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్’లో ఉన్నాయి. రజాకార్ల బూచిని చూపెట్టి కమ్యూనిస్టుల పోరాటాలకు చరమ గీతం పలకడమే భారత్ లక్ష్యంగా కనిపిస్తుంది. తన ఆర్థిక, భౌగోళిక స్వావలంబన కోసమే రెండున్నర శతాబ్దాల బృహత్ చరిత్ర గల విశాల హైదరాబాద్ రాజ్యాన్ని భారత్ ఆక్రమించిందనే వాదన ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన పాలకుడిని లొంగ దీసుకుంటే దేశ ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఢిల్లీ పెద్దలు భావించి ఉండవచ్చు.
అసలు విమోచన అనే పదానికి ఉన్న అంతర్లీన అర్థం ఏంటి? పెనంలోంచి పొయ్యిలో పడిన చందంగా అది ఉండకూడదుగా? మా నిజాం రాజు తరతరాల బూజు అని భావించిన తెలంగాణ ఆయన నుంచి స్వాతంత్రం కోరుకుని ఉండవచ్చు. నిజాం నిరంకుశుడని కమ్యూనిస్టులు చేసిన వాదనలో వాస్తవాలు తక్కువగా ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. సమకాలీన రచయితలు గాని, గ్రంథాలు కాని ఎక్కడ కూడా విమోచన అనే పదం వాడకపోవడం విశేషం. సంస్థానాల రాజ్యాలు అనేకం నయాన్నో, భయాన్నో భారత యూనియన్‌లో కలిసిపోయాయి. నాటి సంస్థానాల అంతర్గత విషయాలను లోతుగా అధ్యయనం చేస్తే, ఆ రాజ్యాలలో పాలకులు నిరంకుశులైనప్పటికీ, ఆయా రాజ్యాలు భారత్‌లో విలీనం కావడానికి వారి నిరంకుశత్వం మాత్రం కారణం కాదని తెలుస్తుంది.
హైదరాబాద్ సంస్థానం మీద జరిగిన పోలీసు చర్యలో ఎవరి పాత్ర ఎంత? ప్రజాస్వామ్య వ్యవస్థకు కాకుండా సైనికాధికారికి ముఖ్యమంత్రి హోదా ఇవ్వడంలో కేంద్రం ఆంతర్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులేమిటో అందరూ ఆలోచించాలి. హైదరాబాద్ భారత్‌లో విలీనమయ్యాక మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ ప్రముఖ్‌గా నియమితులయ్యారు. కానీ ఆయన ఒక్కసారి కూడా విలీన, విమోచనాంశాలపై స్పందించలేదు. బహుశా గతం తాలుకూ గాయాలకు ఆయన మళ్లీ ప్రాణం పోయదలుచుకోలేదేమో. ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా అదే విధమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ తెలంగాణకు అసలైన స్వాతంత్య్రం వచ్చింది జూన్ 2, 2014 నాడు కాబట్టి ఆ రోజుకే టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణలో రాజకీయ ప్రాబల్యం కోసం బీజేపీ చేస్తున్న ‘సెప్టెంబర్ 17 హడావిడి’ పట్ల తెలంగాణ ప్రజానీకం పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం విశేషం. ప్రస్తుతం తెలంగాణ సమాజానికి కావాల్సింది సాంత్వనే కాని, పాత గాయాల జ్ఞాపకాలు కాదు.
( వ్యాసకర్త: జయప్రకాశ్ అంకం , హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్)