‘అందుకో దండాలూ బాబా అంబేద్కరా.. అంబరాన ఉన్నట్టి సుక్కలు కురువంగో..’ అంటూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహాశయునికి తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తూ నూతన సచివాలయానికి ఆయన పేరును పెట్టింది. అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, తన ప్రగతి సుపరిపాలనకు సచివాలయమనే గుడి కట్టి, ఈ పరిపాలనా కోవెలకు ప్రథమంగా అంబేద్కర్ మహాశయుని పేరును పెట్టుకొని ఆ మహనీయుని సేవలను మనసారా తలుచుకుంటున్నది. భారత దేశ సబ్బండవర్గాల ఆకాంక్షలను ఆవాహనం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సెక్రటేరియట్‌కు డాక్టర్ బి.అర్.అంబేద్కర్ పేరు పెట్టడంతో యావత్ ప్రపంచం సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది.
దేశానికి స్వాతంత్య్రం రావడం ఎంత ముఖ్యమో, ఆ స్వాతంత్య్ర ఫలాలు మారుమూల ఉన్న పల్లెకు, పల్లె చివర ఉన్న గూడేలకు చేరడం కూడా అంతే ముఖ్యమని పరితపించి, అందుకు తగ్గట్టు కార్యాచరణను రాజ్యాంగం ద్వారా దిశానిర్దేశం చేసిన భరతమాత ముద్దుబిడ్డ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సమస్త జనులకు సమానావకాశాలు దక్కడమే అసలైన భారతీయత అనే విశ్వాసంతో రాజ్యాంగ రచన చేసిన సామాజిక దార్శనికుడు అంబేద్కర్. భిన్న జీవనసంస్కృతుల భారత సమాజంలో మనిషికి సామాజిక ఆత్మగౌరవం ఎంత ముఖ్యమో, విభిన్న నైసర్గిక స్వరూపం కలిగిన రాష్ర్టాల సమూహమైన దేశంలో ప్రాంతీయ అస్తిత్వ గౌరవం కూడా అంతే ముఖ్యమని గుర్తించిన మహనీయుడు అంబేద్కర్. లౌకికవాద, సామ్యవాద, సమాఖ్యవాద తాత్విక పునాదిని రాజ్యాంగంలో రూపొందించిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నిజంగా భారత రత్నమే.
వివక్ష కారణంగా ఏ హృదయమైతే తల్లడిల్లిపోతదో, ఏ మనసైతే అసమానతలతో అమానవీయ చర్యలకు గురైతదో, ఏ మనుషులైతే లింగవివక్షకు నలిగిపోతరో, ఏ ప్రాంతమైతే ఆధిపత్య ధోరణులకు బలైతదో, ఏ వర్గమైతే ఆధిపత్యంతో తల్లడిల్లుతదో, ఏ సమాజమైతే కులం, మతం, వర్ణాల పేరుతో బహుజన విభజనకు గురై కునారిల్లిపోతదో ఆ హృదయాలు, ఆ మనుషులు, ఆ సమాజాలు, ఆ ప్రాంతాలు, ఆ వర్గాలన్నీ నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న మహోన్నత నిర్ణయానికి పులకరించిపోతున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో కొలువైన తెలంగాణ సచివాలయ కోవెల తమ ఆకాంక్షలకు ప్రతిరూపమై పాలనను అందిస్తదనే ఆనందంతో సీఎం కేసీఆర్‌కు తమ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు ప్రకటిస్తున్నాయి. సామాజిక ఉద్యమకారునికి సమున్నత గౌరవం ప్రకటించిన ముఖ్యమంత్రిని వేనోళ్ల కొనియాడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాతకు అపూర్వ గౌరవం దక్కిందని, దళితుల ఆత్మగౌరవం ఆకాశాన్నంటిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
తాము ఇక ఓట్లకు మాత్రమే పరిమితం కామని, తమ జాతులు, తమ కులాలు, తమ పేర్లు, తమ ప్రతీకలేవీ కూడా దూరంగా విసిరివేయబడబోవనే ఇంక్లూజివ్ భరోసాను ఒక్క నిర్ణయంతో నింపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రణమిల్లుతున్నాయి. దళిత జనబాంధవునికి తెలంగాణ ప్రభుత్వం నిజమైన నివాళి అర్పించిందని పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా దళిత, బహుజన, మైనారిటీ సంఘాలు, సంస్థలు, సబ్బండ కులాలు, వర్ణాలు, మహిళాలోకం అగ్రవర్ణ పేదలు.. ఇలా ఒక్కరేమిటి ఈ రాజ్యాంగాన్నే తమ జీవన వికాస మూలగ్రంథంగా, రాజ్యాంగ దార్శనికతే తమ జీవితాన్ని నడిపే పవిత్రగ్రంథంగా, తమ జీవితాలను గుణాత్మకంగా తీర్చిదిద్దే, తమ భావితరాలకు బంగారు భవిష్యత్తును తయారుచేసే భారత రాజ్యాంగమే ప్రపంచ అత్యున్నత ప్రమాణంగా భావిస్తున్న ప్రతి భారతపౌరుడు గర్వించేటువంటి నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకున్నారని ఆనంద తాండవం చేస్తున్న హృదయాలతో తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాయి.
దేశ చరిత్రలో మొదటిసారిగా ఒక రాష్ట్ర పరిపాలనా సౌధానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టడం జయహో అంటూ హర్షధ్వానాలు ప్రకటిస్తున్నవి. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఒక తెలంగాణే కాదు, యావత్ దేశమే గర్విస్తున్నది. ప్రపంచం అంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వైపు ఆశ్చర్యంతో తిరిగిచూస్తున్నది. దళితుల జన బాంధవునికి నిజమైన నివాళి దక్కిందని, తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టిన తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళిత బహుజన సంఘాలు జై భీమ్‌లు ప్రకటిస్తున్నాయి. ఏ మహానుభావుని రాజ్యాంగ దార్శనికత తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిందో.. ఆ మహానుభావుని పేరు పెట్టుకున్న తెలంగాణ సమాజం రుణం తీర్చుకున్నది. అంబేద్కర్ మహాశయునికి ఈ దేశ పాలకులు తీర్చుకోవాల్సిన రుణం మిగిలే ఉన్నది.
-రమేష్ హజారి