సమాజపు పొరల్లో అట్టడుగున ఉండి, గత ప్రభుత్వాల ఉపేక్షకు గురైన బంజారా, ఆదివాసీ గిరిజనుల పట్ల ముఖ్య మంత్రి కేసీఆర్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ అభివృద్ధి ఫలాలై జీవితాల్లో ప్రతిఫలిస్తున్నాయి. ఈ ఎనిమిదేండ్లలోనే గిరిజనులు ఎన్నో రంగాల్లో ఆశించినస్థాయి పురోభివృద్ధి సాధించారు. కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి పథకాల నమూనా దేశానికి దిక్సూచిలా మారింది. హైదరాబాదులో బంజారా, ఆదివాసీ గిరిజనుల కోసం నిర్మించిన ఆత్మగౌరవ భవనాలను సీఎం కేసీఆర్ ఈ నెల 17న ప్రారంభించడం చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనున్నది.
ఆంధ్ర వలస పాలనలో గిరిజనులు అనేకరకాలుగా జీవన విధ్వంసానికి గురయ్యారు. 1984లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదివాసుల ప్రాంతాల్లో 11 లక్షల 60 వేల ఎకరాల భూముల పరాయీకరణ జరిగింది. గిర్గ్లాని కమిషన్, శంకరన్ కమిటీ నివేదిక ఈ విధ్వంసాన్ని వెల్లడించాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల వేల మంది బంజారాలు నిర్వాసితులయ్యారు. వారి మిగిలిన భూములు వలసవాదుల చేతుల్లోకి పోయాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లోని కోట్లాది రూపాయల విలువైన భూములు బంజారాలు కోల్పోయారు. హైదరాబాద్ అభివృద్ధి క్రమంలో అమాయకులైన బంజారాల భూములను అతిచౌకగా కొందరు కాజేశారు. ప్రభుత్వ రక్షణ లేక, ఏ ఉపాధి దొరకక అవస్థలపాలయ్యారు బంజారా లు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌తోపాటు హైదరాబాద్ చుట్టుప్రక్కల తండాల్లోని ప్రజల జీవితాలు విధ్వంసానికి గురయ్యాయి.
మారుమూల తండాల్లోని గిరిజనులు ప్రభుత్వ తోడ్పాటు అందక తమ కన్న పిల్లలను అమ్ముకుంటూ దేశంలోని ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసలు పోవలసివచ్చింది. తండాల్లో సారా వ్యసనం వల్ల మగవారు ముఖ్యంగా 25-35 ఏండ్ల యువత అకాల మరణం చెందారు. ఆదివాసీ గూడేలలో కలరా వంటి వ్యాధులు వ్యాపించి, పోషకాహారం లోపం వల్ల అనేకమంది చనిపోయేవారు. వారికి ఎటువంటి వైద్య సహాయం అందకపోయేది. తండాలూ, గూడేలకు ప్రాథమిక వసతులైన వైద్యం, విద్య, రోడ్డు, రవాణావ్యవస్థ, పరిపాలనకు సంబంధించిన సౌకర్యం అందుబాటులో లేకుండేది. ఆదివాసీల, బంజారాల సంస్కృతి అంటే ఇతరులు హేళనగా చూసేవారు. చదువుకున్న ఆదివాసీ, బంజారా యువకులు తమ సమాజం కోసం మాట్లాడితే నక్సలైట్ల ముద్రవేసి ఎన్కౌంటర్లు చేసిన దుర్మార్గాలు ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు సాగించాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాల మూలంగా గిరిజనుల జీవితాల్లో వెలుగు ప్రసరించింది. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను గుర్తించడం మొదలైంది. దేశంలోనే మొదటగా సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. కొమురంభీం జయంతిని కూడా అధికారికంగా నిర్వహించింది. దాదాపు 3,500 తండాలు, గూడేలను గ్రామ పంచాయితీలుగా ప్రభు త్వం మార్చింది. దీంతో స్వయంపాలన వల్ల లక్షలమంది గిరిజనుల జీవితాల్లో మౌలిక మార్పు వచ్చింది. విద్య, వైద్యం, సంక్షేమం, రవాణా మెరుగైన జీవనవిధానం, సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల జీవితాలు మార్పు చెందాయి.
సారా నిషేధం వల్ల సారా మరణాలు తగ్గి చిన్నపిల్లల అమ్మకాలు ఆగిపోయాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు రావడం వల్ల లక్షల మంది గిరిజనులు తమ ప్రాంతాల్లో, తండాల్లో, గూడేలలోకి వచ్చి అభి వృద్ధి చెందుతున్నారు. పోషకాహార లోపం, వ్యాధులు లేకపోగా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల భూములు పరాయికరణ జరగడం లేదు. నీటి వసతి, రోడ్ల వల్ల వ్యవసాయ భూముల విలువలు భారీగా పెరిగాయి. అనేక ప్రాంతాల్లో సాగునీరు, 24 గంటల కరెంటు వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో అనేక వేల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు వస్తున్నాయి. బంజారాలకు జిల్లా కలెక్టర్లుగా, డిపార్టుమెంట్ హెచ్ఓడీలుగా, విశ్వవిద్యాలయ వీసీలుగా ఉన్నత పదవులు లభిస్తున్నాయి.
బంజారాలకు, ఆదివాసీలకు స్వాభిమాన భవనాలు నిర్మించడం వల్ల, వారికంటూ ఒక వేదిక ఏర్పడుతున్నది. సంస్కృతీ పరిరక్షణ, సామాజిక వికాసంతో పాటు సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఈ వేదికలు ఉపయోగపడతాయి.
(వ్యాసకర్త: మాలోతు భిక్షపతి నాయక్ , 98661 33603, రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ వికాస సమితి)