దేశ రాజకీయాల్లో అడుగు పెడదామా? మోసాల మోదీని గద్దె దింపుదామా? అని జన నేత కేసీఆర్ సూటిగా ప్రశ్నించగానే లక్షల గొంతులు ఏకకంఠమై ఆయనకు మద్దతు తెలిపాయి. బీజేపీ ముక్త్ భారత్ రణ నినాదమై మారుమోగుతున్న తీరు అద్భుత స్పందనను ఆవిష్కరించింది. సమాజానికి ఉషోదయం అందించడానికి ఎలాంటి త్యాగాలకైనా వెరవకుండా ఉండే చైతన్యం తెలంగాణ ప్రజల సొంతం. అదే చారిత్రక స్ఫూర్తిని నేడు కేసీఆర్ బహిరంగ సభల్లో వ్యక్తపరుస్తున్నారు.
వివిధ జిల్లాల సమీకృత పరిపాలనా భవనాల ప్రారంభోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగ సభలు దేశానికి కొత్త పొద్దును వాగ్దానం చేసే చారిత్రక వేదికలుగా నిలుస్తున్నాయి. వివిధ రంగాల నిపుణులు, సామాన్యులు, రైతులు… ఇలా సకల జనుల సంఘీభావాన్ని సంపాదించుకుని సర్కార్ను నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్.
అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అన్ని మతాలను గౌరవిస్తూ, మందిరం, మసీదు, చర్చిని సమానంగా గుండె ల్లో పెట్టుకుంది. ఎనిమిదేండ్ల క్రితం సీమాంధ్ర పాలకుల హయాంలో దీపం వెలుగులకు కూడా నోచుకోని గ్రామ దేవతలకు నేడు బ్రహ్మోత్సవా లు జరుగుతున్నాయి. దసరా, దీపావళి, సంక్రాం తి, ఉగాది, బోనాల పండుగలే కాదు బొడ్రాయి పండుగలు కూడా గ్రామాల్లో ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా పరిపాలన సాగిస్తుంటే, ఓట్ల కోసం దశాబ్దాల పాటు అయోధ్య రాముడి ఆలయ నిర్మాణాన్ని సాగదీసిన హీన చరిత్ర బీజేపీది. అదే ఇక్కడ స్వల్ప కాలంలోనే తెలంగాణ ఇలవేల్పు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇ లా ఎనిమిదేండ్లలో సాధించిన అభివృద్ధిని, సాధించిన పునర్ వైభవాన్ని విశ్లేషించుకుంటూ ముచ్చటిస్తే అదొక వొడవని ముచ్చట. దృష్టి సారించకుండా విస్మరించిన రంగం అంటూ తెలంగాణలో ఉందా? ప్రభుత్వ రంగంలో లక్షన్నర ఉద్యోగాల భర్తీ, మరో లక్ష ఉద్యోగాల భర్తీకి కొనసాగుతున్న ప్రక్రియ, ప్రైవేట్ రంగంలో 16 లక్షల కొలువుల సృష్టి జరిగిన సత్యాన్ని ఎవరైనా కాదనగలరా?
క్యూబా క్యాస్ట్రో వెంట నడిచినట్టు, తెలంగాణ ఇప్పటికే ఏకోన్ముఖంగా కేసీఆర్ అడుగులను అనుసరించేందుకు సిద్ధపడ్డది. దేశాన్ని దారి తప్పిస్తున్న దుర్నీతిని ఎదిరించడంలో ఆయనకు సైన్యంలా తోడుగా ఉంటుంది. పేదల పొట్ట కొట్టి, గుప్పెడు మంది పెద్దలకు పెడుతున్న మోసాల మోదీ సర్కార్ను గద్దె దింపేందుకు తెలంగాణను కేసీఆర్ దివిటీలా వెలిగించారు. ఆ చైతన్యంతోనే దేశ రాజకీయాల్లో అడుగుపెడదామా? అని కేసీఆర్ ప్రశ్నించగానే పెట్టి తీరుదామని యువతరం బదులిస్తున్నది. మోదీని గద్దెదింపుదామా? అని అడగగానే దింపేద్దామని జనం నినదిస్తున్నారు. వాస్తవాలను అర్థం చేసుకోవడంలో, అండగా నిలవటంలో సామాన్యులు నిక్కచ్చిగానే ఉంటారు. బుద్ధి జీవులు, జ్ఞానవంతులు నిజానిజాలను వెలికి తీసి ప్రజల ముందు ఉంచాలి. సీఎం కేసీఆర్ పదే పదే కోరినట్లు, విజ్ఞానవంతులు విలువైన దేశాన్ని సంరక్షించుకోవడానికి కలిసి రావాలి.
నెహ్రూ, సుందరయ్య, వాజపేయీ లాంటి భిన్న భావజాలల నేతలు విలువైన చర్చలతో శోభిల్లిన పార్లమెంట్ నేడు మోదీ, అమిత్ షాల కనుసన్నల్లో భీతిల్లడం బాధాకరం కాదా? లోహియా, జేపీ, చంద్రశేఖర్, మోరార్జీ దేశాయ్, వి.పి.సింగ్, జోతిబసు, కరుణానిధి, కాన్షీరాం, ఎన్టీఆర్ లాంటి ఎందరో మహా నేతల సంచారంతో కళకళలాడిన దేశ రాజధాని ఢిల్లీ, నేడు ఈడీ, సీబీఐల హడావిడితో కుట్రల కేంద్రంగా కళావిహీనంగా మారిపోవడం దౌర్భాగ్యం కాదా? దేశంలోని ఆలోచనపరులందరూ దృష్టి సారించకపోతే కుట్రలు, కూల్చివేతలకు విశాల దేశం బలి పశువులా మారుతుంది.
కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు దోచి పెట్టడంతో పాటు పన్నులు, పెట్రోల్, డీజీల్ ధర పెంపు, రైతాంగ వ్యతిరేక విధానాలు, రూపాయి పతనం లాంటి మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, మాయలను సామాన్య జనానికి సూటిగా, స్పష్టంగా అర్థమయ్యేలా కేసీఆర్ చెప్పారు. అందుకే దుఃఖ పడుతున్న దేశానికి ధైర్యమిచ్చి, దన్నుగా పోరాడటానికి, దండుగా కదిలి వస్తున్నారు తెలంగాణ ప్రజలు. డబుల్ ఇంజిన్ సర్కార్లు డబ్బుల ఇంజిన్ సర్కార్లుగా మారి జనం ధనాన్ని తోడేసుకుంటున్న అన్యాయాన్ని వాళ్లు నిలదీసి తీరుతారు.
మన రాష్ట్రంలో కూడా తెలంగాణ విలీనమా? విద్రోహమా? విమోచనమా? అధికారికమా? జన ఉత్సవమా? అనే అంశాలపై చర్చ కంటే కూడా బీజేపీ దరిద్రపు పాలన నుంచి దేశానికి విముక్తి అవసరమా? లేదా? అనే చర్చే సాగుతూ ఉండాలి. ఆ దిశగా జనం ఏకమయ్యారు. బుద్ధిజీవులే కూడబలుక్కొని కదలాలి.
ఏం పిల్లడో… ఎల్దమొస్తవా…. దేశం కోసం ధర్మ యుద్ధానికి/ ఏం పిల్లడో… ఎల్దమొస్తవా…. ఢిల్లీ కోటపై రైతు రాజ్యమట/ చీకటి లేని వెలుగుల దేశమట.. ఏం పిల్లడో… ఎల్దమొస్తవా…
(వ్యాసకర్త : డాక్టర్ ఆంజనేయ గౌడ్ , 98853 52242, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)