కాంగ్రెస్‌పై ఆశలు ఆవిరైపోయి, జాతీయత, దేశభక్తి అని చెప్పుకొనే బీజేపీకి
అవకాశం ఇస్తే.. నమ్మి నానబోస్తే-పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది
దేశ ప్రజల పరిస్థితి. దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుపు
తుందనుకుంటే అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నది. ఎనిమిదేండ్లుగా చేసిందేమీ లేకపోగా ప్రశ్నిస్తున్న పార్టీలు, శక్తుల మీద దాడులకు పాల్పడుతున్నది.
మోదీ రెండవ సారి అధికారం చేపట్టిన తర్వాత మొత్తం దేశమే తన జాగీరన్న ట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారం చట్ట సవరణలు చేయ టం, ప్రజానుకూల చట్టాలను రద్దు చేయటం పనిగా పెట్టుకున్నారు. నిత్యం దేశభక్తి జపం చేసే బీజేపీ దేశాన్నే అంగట్లో సరకుగా చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తోంది. జాతీయ పార్టీలతో పాటు, పలు ప్రాంతీయ పార్టీలు సైతం మోదీ పాలనా విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొనే రాజకీయ నిజాయితీ లేక విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలతో దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
కాంగ్రెస్ హయాంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ సీబీఐ సంస్థను ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అంటూ ఎద్దేవా చేస్తుండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క సీబీఐనే కాదు, ఈడీ, ఆదాయపు పన్ను శాఖను కూడా కీలు బొమ్మలుగా మార్చుకొని ప్రశ్నిస్తున్న వారి మీదికి ఎగదోస్తున్నది. విడ్డూరం ఏమంటే బీజేపీ పాలనలో ఉన్న 16 రాష్ర్టాల్లో సీబీఐ, ఈడీ ఒక్క దాడి కూడా చేయలేదు. అంటే ఆ రాష్ర్టాల్లో ఆయా దర్యాప్తు సంస్థల ఆఫీసులు మూతపడ్డాయా? లేక ఆర్థిక నేరాలు, పన్ను ఎగవేతదారులు లేరా? నిజానికి ఎక్కువగా పన్ను ఎగవేతదారులంతా బీజేపీ పాలి త రాష్ర్టాలకు చెందిన వారే కావటం గమనార్హం.
విపక్ష పాలిత రాష్ర్టాల్లో మాత్రమే దర్యాప్తు సంస్థలకు అవినీతిపరులు, అక్రమార్జనాపరులు కనిపిస్తున్నారు. కేంద్రం నుంచి సమాచారం అందడం ఆల స్యం… దర్యాప్తు అధికారులు గుంపులు గుంపులుగా వెళ్లి దాడులు చేస్తున్నారు. అనుమానితులందరినీ అరెస్టులు చేస్తున్నారు. ఇదంతా ప్రశ్నించే గొంతులను నయానా, భయానా లొంగ దీసుకొనే చర్యలు తప్ప మరేమీ కాదు. బీహార్ గత ఐదారేండ్లుగా సీబీఐ, ఈడీ దాడులన్న మాట మర్చిపోయింది. ఎప్పుడైతే నితీశ్ కుమార్ బీజేపీని వదిలేసి తేజస్వి యాదవ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ క్షణమే సీబీఐ, ఈడీలు ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకున్నాయి. బీహార్ లోనూ దాడులు మొదలయ్యాయి. దీంతో బీజేపీ గూటిలో తల దాచుకుంటే ఎంతటి నేరగాళ్లకయినా రక్షణ ఉంటుందని భావించిన రాజకీయ నాయకులు, వ్యాపారులు ఆ పార్టీ కండువా కప్పుకుంటున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక రాబోతున్న సమయంలో తెలంగాణపై బీజేపీ కన్ను పడింది. అందుకే ఏదో పేరుతో రాష్ట్రంలో ఈడీ, సీబీఐ దాడులతో హంగామా చేయటానికి ప్రయత్నిస్తున్నది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు, రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనే శక్తి లేనప్పుడే బీజేపీ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి దాని పుట్టుక, ఎదుగుదలే సాక్ష్యం. రామ జన్మభూమి, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం మొదలు నేటి జ్ఞానవాపీ వివాదం దాకా బీజేపీ గతం అంతా విద్వేష చరిత్రే. మత పరంగా మనుషులను విభజించి ఓట్లు రాల్చుకోవటం బీజేపీకి పరిపాటి అయ్యింది. ఎన్నికలు దగ్గర పడినప్పుడే అలజడులు,అల్లర్లు, మత ఘర్షణలు సృష్టిస్తూ బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తూ ఉంటుంది.
వేల ఏండ్ల చరిత్ర, సంస్కృతీ, సాంప్రదాయాలు కలిగిన దేశం మనది. భిన్నత్వంలో ఏకత్వం కలిగి జాతుల పూదోటగా సామరస్య సౌరభాలు వెదజల్లుతున్న భారత దేశం సుసంపన్నమైన మానవతా విలువలకు ప్రతినిధి. అలాంటి మానవీయ సమాజంలో విద్వేషమే విధానంగా, ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగటం దారుణం. పశ్చిమ బెంగాల్ మొదలు దేశవ్యాప్తంగా బీజేపీ కనుసైగల్లో దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులన్నీ కక్షపూరిత మైనవే. ఈ పరిణామాలను దేశ ప్రజలు నిశితంగా గమనించా లి. బీజేపీ సృష్టించే భావోద్వేగాల నినాదాల మాయలో పడిపోకుండా ఏ నినా దం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నా యో పరిశీలించాలి. దేశ సమైక్యతను దెబ్బతీస్తున్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలి.
-కళ్లెం నవీన్‌రెడ్డి
99636 91692