సింహ గర్జన ఈసారి నిజామాబాద్ వేదికగా వినిపించింది. అది దేశమం తా ప్రతిధ్వనించింది. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడటం ఖాయమనీ, దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా
కరెంటు అందజేస్తామనీ సోమవారం నిజామాబాద్లో ప్రజల హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే ప్రతిపాదనకూ ప్రజలు హర్షాతిరేకంతో ఆమోదం తెలిపారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ‘బీజేపీ ముక్త్ భారత్’ అంటూ నిజామాబాద్ నుంచే తన ప్రయాణం సాగిస్తున్నానని చెప్పడంతో, హస్తిన స్వాధీనానికి కేసీఆర్ జంగ్ సైరన్ పూరించారనేది స్పష్టమైపోయింది.
కరీంనగర్ సింహగర్జన మాదిరిగానే, నేటి నిజామాబాద్ సభ చరిత్రాత్మకమైనదిగా నిలిచిపోతుంది. నాటి కరీంనగర్ సభ హఠాత్తుగా జరిగింది కాదు. తెలంగాణ సాధనకు వ్యూహరచన కోసం కేసీఆర్ ఎంతో మేధోమథనం జరిపారు. స్పష్టమైన పంథాతో ఉద్యమాన్ని నడిపించి గమ్యాన్ని ముద్దాడారు. ఉద్యమం పొడుగునా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, ప్రత్యర్థులను చిత్తు చేస్తూ తెలంగాణ ప్రజల తరతరాల స్వప్నమైన స్వరాష్ర్టాన్ని సాధించారు. ఇప్పుడు కూడా ప్రత్యామ్నాయమంటే ఒక కూటమి దిగిపోయి మరో కూటమి రావడం కాదనీ, ప్రజల సామాజిక-ఆర్థిక స్థితిగతులలో పరివర్తన తేవాలని కేసీఆర్ సిద్ధాంతీకరించారు. దేశ రాజకీయాలలో వినూత్నమైన ఈ ఆలోచన విప్లవాత్మక మార్పునకు దోహదపడుతుంది. ఒక నాయకుడి స్థానంలో మరొకరిని ప్రధానిని చేస్తామనడం తమ నినాదం కాకూడదనీ, స్పష్టమైన ప్రగతిశీల అజెండాతో ప్రజల ముందుకు వెళ్లాలని కూడా ఆయన మొదట్లోనే వెల్లడించారు. ఆ క్రమంలో వచ్చిందే దేశంలో రైతులకు ఉచిత కరెంటు ప్రకటన.
ఇతర రాజకీయ నాయకులు చేసేవి కేవలం ఎన్నికల వాగ్దానాలు. మోదీ- అమిత్ షా పరిభాషలో చెప్పాలంటే ‘జుమ్లా’! కానీ కేసీఆర్ హామీ ఇచ్చారంటే ఆచరించి చూపుతారు. అందుకే కేసీఆర్ మాటలకు విశ్వసనీయత ఉంటుంది. స్వరాష్ర్టాన్ని సాధించడం మొదలుకొని బంగారు తెలంగాణ సాధనకు వేస్తున్న అడుగులే ఇందుకు నిదర్శనం. దేశం నలుమూలల నుంచి రైతు సంఘాల నాయకులు వచ్చి వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి అబ్బురపడ్డారు. తమ రాష్ర్టాల్లో ఇటువంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు. అధికార బలం, అంగబలం, అర్థబలం లేకుండా మీడియా అధర్మ యుద్ధాన్ని తట్టుకొని నిలిచి తెలంగాణ సాధించిన ధీశాలి కేసీఆర్. తెలంగాణ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ముఖ్యమంత్రికి దేశవ్యాప్తంగా ప్రజలను మెప్పించి, ప్రతిపక్షాలను ఏకం చేసి, ఎర్రకోటపై జెండా ఎగురవేయడం కష్టమైందేమీ కాదు.