రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఏ ఉప ఎన్నికకైనా సహేతుక కారణాలుండేవి. సాధారణంగా ప్రజాప్రతినిధి చనిపోతేనో, రాజీనామా చేస్తేనో ఉపఎన్నిక అవసరం ఏర్పడేది. కానీ ఇప్పటి మునుగోడు ఉప ఎన్నికకు సకారణమేదీ లేదు. అభివృద్ధి కోసమే రాజీనామా చేశానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెబుతున్నా రు! నిజంగా అభివృద్ధి కోసమే ఈ ఉపఎన్నిక జరుగుతున్నదా? ఎవరి ప్రయోజనాల కోసం ఈ బై ఎలక్షన్?
రాష్ర్టాల హక్కులు, అధికారాలను సైతం కాలరాస్తూ ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తున్నారు. కుదిరితే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తాను అధికారంలోకి రావటం, లేదంటే ఆయా ప్రభుత్వాలను కూల్చేయటం తప్ప ప్రజా తీర్పునకు అవకాశమే ఉండకూడదన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఈ అప్రజాస్వామిక అనైతిక చర్యలకు మునుగోడు ఉప ఎన్నిక ఓ గుణపాఠం కావాలి.
బీజేపీ కేంద్ర నాయకత్వం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన కుట్ర వల్ల వచ్చిన ఉప ఎన్నిక ఇది. తెలంగాణలో ఆ పార్టీకి ప్రజాబలం లేదు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ మొదలైన దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీ ఉనికి నామమాత్రం. అయి నా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ఆరాటపడుతున్నది. అందుకోసం నీతిమాలిన కుతంత్రాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలోంచి చూస్తేనే మునుగోడు ఉప ఎన్నిక వెనుక మతలబేంటో అర్థం అవుతుంది.
తమ సిద్ధాంతాలతో ఏ సంబంధం లేకపోయినా ఓట్లు కొనగలినవారైతే చాలు. ఏ పార్టీవారైనా సరే.. వారి లొసుగులు పసిగట్టి నయాన్నో భయాన్నో లొంగదీసుకోవడం, ఫిరాయింపులకో రాజీనామాలకో పురమాయించడం బీజేపీ విధానమై పోయింది. తద్వారా రాజకీయ ప్రయోజనాలను సాధించడం వారికో కార్యక్రమంగా మారిన సంగతి అనేక రాష్ర్టాల్లో చూస్తు న్నాం. ఇప్పుడు ఆ విధానాల ద్వారానే ఈ దక్షిణ తెలంగాణలో బోణీ కొట్టి, రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ కలగంటున్నది. ఈ కుతంత్రాల ఫలితమే నేటి మునుగోడు ఉప ఎన్నిక.
బీజేపీ తీసుకొచ్చిన ఒక అనవసరపు ఎన్నిక ఇది. దీనికి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ పావుగా ఎంచుకున్నది. ఆయనేమో మునుగోడు అభివృద్ధి కోస మే రాజీనామా చేశానంటూ చెప్పుకొంటున్నారు! ఇది ‘తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డికోసం’ అన్న చందంగా ఉన్నది. ఇప్పుడు ఎంత డబ్బయినా ఖర్చు పెట్టి బీజేపీని గెలిపించేందుకు ఆయన తహతహలాడుతున్నారు. దీని వెనుక ఉన్న స్వామి కార్యమేమిటో, స్వకార్యమేమిటో తెలుసుకోలేనంత అమాయకులు కాదు మునుగోడు ప్రజలు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నానంటూ రాజగోపాల్రెడ్డి ప్రకటించటం విడ్డూరం.
ఎందుకంటే మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడా ఏ అభివృద్ధి జరిగింది లేదు. పైగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలనే ప్రైవేటుపరం చేశారు. జనం మీద పన్నుల పేర విపరీతమైన భారాలు మోపింది బీజేపీ. పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100 దాటడంతో జనం మళ్లీ కట్టెల పొయ్యే దిక్కనుకునే రోజులు తెచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి ఈ దేశం అప్పు రూ.55 లక్షల కోట్లు. ఇప్పుడు వీరి నిర్వాకంతో రూ.145 లక్షల కోట్లకు చేరింది. పైగా ఈ ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ర్టానికి ఒరగబెట్టిందేమీ లేదు. విభజ న చట్టంలోని ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. బయ్యారం స్టీల్ ప్లాంటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, నవోదయ పాఠశాలలు, హైదరాబాద్లో ట్రిపుల్ ఐటీ తదితర హామీలన్నింటినీ తుంగలో తొక్కారు.
ఇలాంటి చర్యలను ప్రశ్నించిన విపక్ష పార్టీలపై ఈడీతో దాడులు చేయించి, సీబీఐని ఉసిగొల్పి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. చివరికి ‘ఇక్క డ గెలిస్తే, టీఆర్ఎస్ సర్కారు ఇలా గాల్లో కూలిపోతది..’ అంటూ ఇటీవల మునుగోడులో అమిత్షా చెప్పారంటే, ఆ పార్టీ అజెండా ఏమిటో అర్థమవుతున్నది. అందువల్ల ఇలాంటి కుయుక్తులకు మనం చెక్ పెట్టాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, కులాలు, మతాల పేరిట సమాజాన్ని, ప్రజలను చీల్చే చర్యలకు గోరీ కట్టాలి.
తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఒక్కటై సాయుధ రైతాంగ పోరాటం నడిపిన రణస్థలి. ఈ మహోన్నత పోరాటంతో ఏ సంబంధమూ లేని బీజేపీ నేడు ఈ చారిత్రక పోరాటానికి సైతం వక్రభాష్యం చెపుతూ విమోచన దినమంటూ హడావుడి చేస్తున్నది. ఇక్కడ మత విద్వేషాలకు తావులేదని చాటి చెప్పాలి. మునుగోడు ద్వారా తెలంగాణలో పాగా వేయాలనే బీజేపీ ఆటలను సాగనివ్వబోమని తేల్చి చెప్పాలి. ఇది తెలంగాణ క్షేమాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరి కర్తవ్యం కావాలి. ఈ కర్తవ్య సాధనలో భాగంగానే బీజేపీని ఓడించేందుకు వామపక్షాలు సీపీఐ(ఎం), సీపీఐ టీఆర్ఎస్కు మద్దతు పలికాయి.
(వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత)
ప్రజా సమస్యలను తొక్కి పెట్టి, మతం పేరుతో దేశంలో విద్వేష రాజకీయాలకు తెరలేపుతూ బీజేపీ సాధించేది ఎవరి అభివృద్ది? ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఒకే పార్టీ అంటూ దేశాన్ని నియంతృత్వం దిశగా నడిపిస్తున్నది. ప్రజాస్వామ్య విలువలనూ, రాజ్యాంగ నియమాలను ధ్వంసం చేస్తున్నది. ఎనిమిదేండ్లుగా బీజేపీ చేస్తున్నది ఇదే..
-జూలకంటి రంగారెడ్డి