మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఒక్క సంక్షేమ పథకానికి రూపకల్పన చేయలేదు. దేశ జనాభాకు జీవనాధారమైన వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న రైతులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడానికి బదులు నష్టం చేకూర్చే విధానాలను అనుసరిస్తున్నది.
గత ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. పంట ల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు ఏ విధంగా నమ్ముతారు?
బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ ధర ఉన్నప్పుడు, ప్రభుత్వం తాను ప్రకటించిన మద్దతు ధర ప్రకా రం పంట ఉత్పత్తులను కొని రైతుకు అండగా ఉండాలి. పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’తో రైతులకు మేలు జరగలేదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రం రూ.24,350 కోట్ల లాభం జరిగింది. ఇప్పటికైనా ఏ కారణం చేతనైనా పంట నష్టం జరిగినప్పుడు 30 రోజులలోపు విధిగా సంబంధిత రైతుకు నష్ట పరిహారం అందే విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలి.
‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా ఇతర ఆదాయంలేని సన్నకారు, చిన్న కారు రైతులకు ఒక రోజుకు అందిస్తున్న సహా యం కేవలం రూ.16.48 మాత్రమే. ఈ చిన్న సాయం కేవలం పేద రైతులను అవమానపరచడానికే అన్నట్లున్నది తప్ప వారి ఆర్థికాభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడదు. పేద రైతులపై కేంద్రానికి ఏమాత్రం గౌరవం ఉన్నా వారితోపాటు, రైతు కూలీలందరికీ రోజుకు రూ.200 ఆర్థిక సాయం అందివ్వాలి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి ప్రతి రైతు పెట్టే పెట్టుబడిలో 50 శాతం ఖర్చు తగ్గిస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
రిజర్వు బ్యాంకు మార్గ దర్శకాల ప్రకారం బ్యాంకుల ద్వారా ప్రతి రైతుకు రూ.10 లక్షల వరకు దీర్ఘ కాలిక రుణాలు ఇవ్వాలి. ఈ విషయమై తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఎన్నోసార్లు ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక, వ్యవసాయ శాఖ మంత్రులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఏ స్పందన లేదు.
మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ బోరు బావుల వద్ద మీటర్లు బిగించాలంటున్నది. ‘నూతన వ్యవసా య బిల్లు-2020’ పేరుతో తెచ్చిన వ్యవసాయ చట్టాలు కేవలం కార్పొరేట్ సంస్థల మేలు కోసమే. తెలంగాణలో యాసంగిలో పండించిన వడ్లు కొనబోమని కేంద్రం కరాఖండిగా చెప్పింది. దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశ భవిష్యత్తుకు తీరని నష్టం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టి లో ఉంచుకుని ఇకనైనా వ్యవసాయానికి మేలు చేసే చర్యలను చేపట్టాలి.
(వ్యాసకర్త: తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు)
-పాకాల శ్రీహరి రావు 93475 80252