కేటీఆర్… ఈ మూడు అక్షరాలు నవశకానికి దిక్సూచి, యువతరానికి ఐకాన్. ఐటీహబ్ నిర్మాణ సారథి.
పేదలకు కష్టమొస్తే నేనున్నానంటూ భరోసానిచ్చే మనసున్న నాయకుడు కేటీఆర్. అనతికాలంలోనే ఎన్నో
అంతర్జాతీయ సంస్థల చేతుల మీదుగా అవార్డులను సొంతం చేసుకున్న మోడ్రన్ లీడర్.
శాబ్దకాలంలో సిరిసిల్ల నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చడమే కాదు, తాను చేపట్టిన శాఖల్లో ఎన్నో విప్లవాత్మక, వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అటు పార్టీలో, ఇటు ప్రజల గుండెల్లో అంచెలంచెలుగా ఎదిగి చెరగని ముద్రవేసుకున్న యువనేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
స్వరాష్ట్రంలో తొలిసారి మంత్రి పదవి చేపట్టిన కేటీఆర్ అధికారం ఉంటే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టించవచ్చో ఆచరణలో నిరూపించారు. ఐటీరంగం దిశ దశలను మార్చి చూపించారు. పరిశ్రమలు, పురపాలక శాఖల్లో కీలక మార్పులు తెచ్చి ప్రజలకు సౌలభ్యాన్ని మెరుగుపరిచారు. రాష్ట్రస్థాయిలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతూనే, తనకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ముఖ్యంగా చేనేతకు జీవం పోసి, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్న బాధ్యత గల నేత కేటీఆర్. యువ నాయకులకు ఆదర్శంగా, పేదల పాలిటి శ్రీమంతుడిగా కేటీఆర్ నిలుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు విద్యావ్యవస్థలో తీవ్రమైన వివక్ష ఉండేది. దీంతో ప్రతిభావంతులు అధఃపాతాళానికి తొక్కివేయబడ్డారు. పేద విద్యార్థులు పెద్ద సదువులకు దూరమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత విద్యావ్యవస్థకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం వల్ల నేడు గురుకులాలు పేద విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.
అనేకమంది విద్యార్థులు జేఈఈ, ఎంబీబీఎస్, నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. భవిష్యత్తులో దేశంలోనే ముఖ్యమైన వైద్య, ఇంజినీరింగ్ నిపుణులను అందించడంలో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఎంత మొర పెట్టుకున్నా కొంతమంది నాయకులు ప్రజల ఆవేదనలను అర్థం చేసుకోరు. అలాంటిది… సోషల్ మీడియా ద్వారా తమ సమస్యను తెలియజేసినా, క్షణంలో స్పందించి ఆ సమస్యను తక్షణమే పరిష్కరించే కేటీఆర్ లాంటి యువ నాయకుడు తెలంగాణలో ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం.
(వ్యాసకర్త: సంపత్ గడ్డం , 78933 03516, దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు)