12 జూన్ 2022: తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఒక చారిత్రాత్మకమైన దినం. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటి అయిన ఎలెస్ట్ కంపెనీ తెలంగాణలో రూ.24,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్‌ను ప్రారంభించడానికి ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో ఈ రంగంలో ప్రపంచస్థాయి దిగ్గజాలైన జపాన్, కొరియా, తైవాన్‌ల సరసన ఇప్పుడు తెలంగాణ చేరింది.
మే 2022: లండన్, దావోస్‌లలో 10 రోజుల పర్యటన. 45 వ్యాపార సమావేశాలు, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 ప్యానల్ డిస్కషన్ సమావేశాలు, రూ.4,200 కోట్ల పెట్టుబడులు. మార్చి 2022: వారం రోజుల అమెరికా ట్రిప్. 35 వ్యాపార సమావేశాలు, 4 సెక్టార్ రౌండ్ టేబుల్ సమావేశాలు, 3 భారీ గ్రీట్ అండ్ మీట్ సమావేశాలు, రూ.7,500 కోట్ల పెట్టుబడులు. ఈ డిజిటల్ సోషల్ యుగంలో ఒక రాష్ట్ర దార్శనిక ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఒక మంత్రి, ఆయన టీమ్ పనిచేస్తున్న శైలి ఇలా ఉంటుంది. ఆ రాష్ట్రం తెలంగాణ. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ మంత్రి పేరు కేటీఆర్.
కట్ చేస్తే… మొన్న దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడానికి మన దేశం నుంచి చాలామంది మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు కూడా వెళ్లారు. కానీ, మన తెలంగాణ శిబిరం దగ్గర జరిగినంత యాక్టివిటీ మరే ఇతర శిబిరం దగ్గర జరగలేదు. ఒక ప్రత్యేక వార్తాంశంగా అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నలిస్టులు ఫొటోలతోసహా సోషల్ మీడియాలో, మీడియాలో షేర్ చేసిన వాస్తవం ఇది.దేశంలోని ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు ఇదే దావోస్‌కు చాలాసార్లు వెళ్లారు. యూఎస్, యూకే, యూరప్‌లలో అనేక విదేశీ పర్యటనలూ చేశారు. ప్రతిపాదన పెట్టాం, అయితే అవుద్ది, లేకపోతే లేదన్న సాంప్రదాయిక శైలి. ఎందుకు కాదు, మనమెందుకు సాధించలేమన్న ప్రోయాక్టివ్ దృక్పథం కేటీఆర్‌ది. ఇంత డైనమిజమ్, ఇంత స్పష్టత, ఇలాంటి అత్యంత వేగవంతమైన భావవ్యక్తీకరణ, సందర్భం ఏదైనా సరే.. అలవోకగా ఎదుటివారిని మెస్మరైజ్ చేసే తనదైన ఇంగ్లిష్ శైలి.. ఇవన్నీ మన దేశంలో ఏ రాష్ట్ర మంత్రిలోనైనా చూశామా అన్నది నాకు జవాబు దొరకని ప్రశ్న.
‘భారత్ వైవిధ్యమైన దేశం. ఈ దేశంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలనుకున్నా, ఇంకే కమర్షియల్ యాక్టివిటీ చేయాలనుకున్నా సరే, మీరు ఏ రాష్ట్రం నుంచి ఈ దేశంలోకి ప్రవేశిస్తున్నారనేది చాలా కీలకం!’, ‘తెలంగాణ రాష్ట్రం పోటీపడుతున్నది ఈ దేశంలోని రాష్ర్టాలతో కాదు. ప్రపంచంలోని ది బెస్ట్ దేశాలతో!’ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్ కేటీఆర్‌లో ఉన్నాయి. ఇంత పాజిటివ్ స్పిరిట్, ఇంత దూకు డు ప్రదర్శిస్తూ ముందుకుసాగిపోతున్న కేటీఆర్ మంత్రి మాత్రమే అంటే ఆయన పరిధిని తగ్గించినట్టవుతుంది. ఇప్పుడు రాజకీయాల్లో కేటీఆర్ అంటే ఒక బ్రాండ్.
తెలంగాణ మీద అణువణువునా మమకారం లేకుండా ఈ స్థాయి ఆసక్తి, కృషి సాధ్యం కాదు. ఆ మమకారం కేటీఆర్‌కు అత్యంత సహజసిద్ధంగా కేసీఆర్ నుంచి వచ్చిందనుకోవచ్చు. కానీ, దాన్ని ఊహించని ఎత్తులకు తీసుకుపోతూ, తండ్రికి పుత్రోత్సాహాన్ని కలిగిస్తూ, జాతీయ అంతర్జాతీయ వేదికల మీద శ్లాఘించబడే స్థాయికి ఎదగడమన్నది కేటీఆర్ వ్యక్తిగత సామర్థ్యం, నిరంతర కృషి కారణం గానే. సామర్థ్యం ముందు వారసత్వం అనే పదానికి అర్థం లేదు. అలాగే సామర్థ్యానికి వారసత్వం అనేది ఎప్పుడూ అడ్డు కాకూడదు. కేటీఆర్ విషయంలో వారసత్వం అనేది కేవలం అతని పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడిందనుకోవచ్చు. కాని, ఆ తర్వాతదంతా ఆయన స్వయంకృషే అన్నది ఎవ్వరైనా సరే ఒప్పుకొని తీరాల్సిన నిజం.
(వ్యాసకర్త: మనోహర్ చిమ్మని, రచయిత, ఫిలిం డైరెక్టర్)