ఎనిమిదేండ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏం సాధించింది? ఎనిమిదేండ్ల స్వయం పాలన
భవిష్యత్ తరాలకు ఏం అభయం ఇస్తున్నది? ఎనిమిదేండ్ల తెలంగాణ మట్టి బిడ్డల వెతలకు,
గోసలకు పరిష్కారమేమైనా చూపిందా?… తరచూ విన్పిస్తున్న ప్రశ్నలివి.
ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం రాజకీయ, సామాజిక, ఆర్థిక, వ్యవస్థీకృత, గుణాత్మక మార్పులకు బలమైన పునాది వేసింది. కొత్తగా ఆర్థిక వనరుల సృష్టి, వాటి వినియోగం… పల్లె నుంచి పట్నం దాకా జరిగిన ఈ మార్పును ప్రపంచమే గుర్తించింది. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సామూహిక సమస్యలకు ముందుగా పరిష్కారం చూపించే ప్రయత్నం విజయవంతమైంది. మట్టి మనుష్యులను కేంద్రంగా చేసుకొనే పాలన సాగింది. కరువు, వలసల చిరునామాను మార్చిం ది. మునుపటికి, ఇప్పటికి సామాజికంగా చైతన్యపూరితమైన మార్పునకు తెలంగాణ సంకేతంగా నిలిచింది.
తెలుగువారంటే మద్రాసీలు లేదా ఆంధ్రావాళ్లు అనేవారు ఉత్తరాది వారు. ఇప్పుడు తన ఆచరణాత్మక విధానాల ద్వారా తెలంగాణనే ఓ బ్రాండ్‌గా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఏం చేస్తరు? అనే ప్రశ్నకు ఇదిగో ఇదీ.. ఇట్లా చేస్తామని పల్లెటూళ్లకు జలహారాలైన చెరువులు సమాధానం ఇస్తున్నాయి. మండు వేసవిలోనూ చల్లగాలి పిల్లతెమ్మెరలు తంగేడు పూల తంబాలాలను తాకిపోతున్నాయి. ఇది కాదా మార్పునకు సంకేతం?
సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట తెలంగాణ రాష్ట్రం కావాలని తపించిన కలాలు, గళాలు భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలో ఆశతో, ఆవేదనతో చెప్పాయి. ‘మట్టి మీద ఇల్లు బతుకాలంటే.. భూమిలో బావి బతకాలి’ అని చెప్పిన కవి నాళేశ్వరం శంకరం అక్షరాలకు ఆచరణ రూపంగా ఇవ్వాళ తెలంగాణలో ఎండిన బావుల్ల నీటి ఊట కన్పిస్తున్నది. బోర్లు వేసేందుకు లక్షల రూపాయలు అప్పులు చేసి అవస్థలు పడిన రైతులకు బోరున ఏడ్చే గోస తప్పింది. 24 గంటల కరెంటు వెలుగులు నింపుతున్నది.
‘మా ఆయన పత్తి, మిర్చి అంటూ గాళ్లోకి ఎగిరాక/ ఇంట్లో పిల్లలతో ఒంటరిగా నేను’ అంటూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలకు వేదన చెందారు కరువు జిల్లా పాలమూరు కవి డాక్టర్ పరిమళ్. కానీ ఇప్పుడు చిల్లంబొల్లమైన కల్లాలు లక్షల టన్నుల ధాన్యపు సిరుల చిరునవ్వులను సింగారించుకున్నవి. ఇవి మన కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలు. ఈ పంటలే కాదు పత్తి, మిర్చి సాగు చేయండని ధైర్యంగా ప్రభుత్వమే చెప్పేలా రాష్ట్రం తయారైంది. నాడు ప్రాణం తీసిన, పత్తి, మిర్చి పంటలను చింతలేకుండా సాగుచేయవచ్చనే ధీమాను ఈ ఎనిమిదేండ్ల పాలన కల్పించింది. సాగునీటి రంగంలో చోటుచేసుకున్న మార్పులు తెలంగాణ జీవనచిత్రాన్నే మార్చుతున్నాయి. ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్, రీ- డిజైన్లు తెలంగాణ భవిష్యత్తుకు కొత్త డిజైన్ తయారుచేస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో మంత్రులు రాత్రుళ్లు బస చేయడం ఏ రాష్ట్ర చరిత్రలోనైనా ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో లెక్కలేనన్ని రాత్రులు అక్కడే మంత్రులున్నారు. అంత పెద్ద ప్రాజెక్టును కేవలం 39 నెలల్లో పూర్తిచేశారు. దేశ చరిత్రలోనే సకాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసిన దాఖలాల్లేవు. ఎనిమిదేండ్ల తెలంగాణలో ఇవన్నీ జరిగాయి. మంత్రి కేటీఆర్ పనితీరుతో ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి కంపెనీల పెట్టుబడుల వెల్లువను చూస్తున్నాం. ఉద్యమంలో ఉన్నవారే పాలనలోకి వస్తే పని విధానం ఎట్లా ఉంటుందనేదానికి కూడా ఈ ఎనిమిదేండ్లే సజీవ సాక్ష్యంగా నిలిచాయి.
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్, పాలమూరు జిల్లాలో కరు వు, వలసలు.. దూరమైన మాట వాస్తవం కాదా? ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి.. అమలుచేస్తున్న పథకాల గురించి నీతి ఆయోగ్ ‘శభాష్’ అన్న మాట వాస్తవం కాదా? హీరాకుడ్, భాక్రానంగల్ ప్రాజెక్టులతో దశాబ్దాల కిందటే సిరులందుకున్న రాష్ర్టాలతో తెలంగాణ పోటీ పడి దేశానికే ధాన్యాగారమైన మాట వాస్తవం కాదా? ఇవన్నీ కేవలం ఎనిమిదేండ్లలోనే జరిగాయి. ఇంకా సామాన్యుడిని కేంద్రంగా చేసుకున్న పథకాలు ‘రైతు బం ధు’, ‘రైతు బీమా’ ‘ఆసరా పింఛన్లు’ వంటి వి ఉన్నాయి. సామాజికంగా కుటుంబాలు కుంగుబాటు కాకుండా ఉండేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, విద్య, వైద్య రంగా ల్లో తీసుకువచ్చిన గణనీయమైన మార్పు లు తెలంగాణలో కొత్త చరిత్రకు నాంది పలికాయి. ఇవన్నీ చేయడానికి దిల్ ఉన్న నాయకుడు కావాలి, విల్ ఉన్న నాయకత్వం కావాలి. అవి రెండూ ముఖ్యమంత్రి కేసీఆర్‌లో మెండుగా ఉన్నాయి.
(వ్యాసకర్త: గోర్ల బుచ్చన్న, 87909 99116 సీనియర్ జర్నలిస్ట్)