ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు నిర్వహించుకునే హక్కున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న ‘రైతు సంఘర్షణ సభ’ అనే నినాదమే హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో కరెంట్ కోతలెందుకు ఉన్నాయి? ఆకలి చావులు, ఆత్మహత్యలకు ఆ పార్టీ కారణం కాదా?రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకుచెప్పాల్సిన అవసరం ఉన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసింది. అర్ధరాత్రి ఇచ్చిన కరెంటుతో రైతుల ప్రాణాలు తీసింది. నీరు లేక పంటలు ఎండిపోయినయి. రైతును పట్టించుకున్న నాథుడే లేడు. నేడు కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ర్టాల్లో వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది. కనీసం 5, 6 గంటలు కూడా కరెంట్ ఉండే పరిస్థితి లేదు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. అది కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలి.
వరంగల్‌లో రాహుల్‌గాంధీ పెట్టిన ‘రైతు సంఘర్షణ సభ’ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా సాగింది. సమాధానం చెప్పాల్సిన చోట స్తబ్దుగా ఉండి, సాఫీగా పాలన సాగుతున్న చోట సభలు పెట్టడం చూస్తుంటే కాంగ్రెస్‌ను ఇక ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడనిపించింది. ‘తెలంగాణ’ను ఎవ్వరూ ఇవ్వలేదు. ఏండ్ల తరబడి కొట్లాడితే వచ్చింది. నిలబడి కలబడితే వచ్చింది. ప్రజలను ఏకంజేసి పోరాడితే వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ జాతులు ఏకమైతే, ఇవ్వక తప్పని పరిస్థితి వస్తేనే తెలంగాణ వచ్చింది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ ఏర్పాటు జరగలేదు. కాంగ్రెస్ స్థానంలో ఎవరున్నా తెలంగాణ ఇవ్వాల్సిందే. దేశవ్యాప్తంగా అనేకచోట్ల కాంగ్రెస్ ఇప్పటికే కనుమరుగైంది. ఇష్టం వచ్చినట్లు, నోటికి వచ్చింది మాట్లాడితే కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయం. ఇది రాహుల్ గ్రహించాలి.
దేశాన్ని ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న బీజేపీది మరో కోణం. ఆ పార్టీకి తెలిసినవి అల్లర్లు, ఆందోళనలే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పచ్చబడ్డ పాలమూరులో పాదయాత్ర చేస్తున్నడు. మహబూబ్‌నగర్ ఎడారిగా మారిందని ఆయన చేస్తున్న ఆరోపణలు వింటుంటే అక్కడి రైతులు నవ్వుతున్నారు. బీజేపీ తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనది, రాష్ర్టానికి పసుపు బోర్డు ఇవ్వదు, తెలంగాణకు రావాల్సిన వాటాపై మాట్లాడదు, ఓ వైపు ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తూనే తెలంగాణపై వల్లమాలిన ప్రేమ చూపెడుతది. తెలంగాణ రాష్ర్టానికి నయా పైసా ఇవ్వరు కానీ, వారికి తెలంగాణ ప్రజల ఓట్లు, సీట్లు కావాలి. విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విడగొట్టి తద్వారా లబ్ధి పొందాలనేది బీజేపీ సిద్ధాంతం.
ఇక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వైఎస్ బిడ్డ షర్మిళ ‘వైఎస్ఆర్టీపీ’ పేరుతో తెలంగాణలో ‘మంగళవారం నాటకం’ మొదలుపెట్టింది. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఆమె చేస్తున్న ఉపన్యాసాలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఒక మూర్ఖుడైతే కేసీఆర్‌పై నానా మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఈ జెండాలెక్కడవి? వీళ్ల ఎజెండాలెక్కడివి? ఎవరి కనుసన్నల్లో వీళ్లు పనిచేస్తున్నారు. పైసాకు పనికిరానోడు గూడా కేసీఆర్‌ను విమర్శించుడేనా? కాబట్టి ఈ దిశగా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
రాష్ట్రంలో రైతు అనుకూల పాలన సాగుతున్నది. అదే ఒరవడి కొనసాగాలంటే మన ఐక్యతను మరోసారి ప్రదర్శించాలి. ఢిల్లీ పార్టీలు, వారి బానిసలు చెప్పే అబద్ధాలను నమ్మి మోసపోతే తెలంగాణ వందేండ్లు వెనక్కి వెళ్తుంది. తెలంగాణను ఈ దుష్ట చతుష్టయం నుంచి కాపాడాలన్నా, ఈ రాబందుల దండయాత్రను తిప్పికొట్టాలన్నా తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష.
-తాడబోయిన విజయ్, 94919 98702