ఈ శీర్షిక కొంచెం తీవ్రంగా అనిపిస్తుండవచ్చు కానీ, మొన్నటి కాంగ్రెస్ సభ ఆసాంతం చూసి ఉన్నవారు అర్థం చేసుకోగలరు ఈ తీవ్రత. అక్కడ మాట్లాడినవాళ్లలో ఒక్కడంటే ఒక్కడు ‘జై తెలంగాణ’ అనలేదు. ఒక్కనికీ తెలంగాణ ఆత్మ లేదు. తుచ్చ రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తి కేంద్రక బల ప్రదర్శనలు, శుష్క వాగ్దానాలు తప్ప తెలంగాణకు ఒరిగింది శూన్యం. ఏం చేసైనా సరే అర్జెంటుగా అధికారంలోకి వచ్చి, తెలంగాణను ముంచాలనే ద్రోహ చింతన వారిది.
జై తెలంగాణ అంటే ఎక్కడ చంద్రబాబుకు కోపం వస్తుందో అని హడలిచచ్చే రేవంత్‌రెడ్డి కట్టుబానిస మనస్తత్వం తెలంగాణకు యే రకంగా మేలు చేయగలిగేది?
మకిలి చరిత్ర కలిగిన మీరు మాకు చెప్పేవారా రాహుల్? కేసీఆర్‌ను క్షమించం అంటారా? యెంత కండకావరం! అసలు ఎలాంటి పొత్తులకూ పనికిరాని పార్టీ అని కదా దేశవ్యాప్తంగా అందరూ కాంగ్రెస్‌ను వెలేసిన్రు. పార్టీని, దేశాన్ని నడపడానికి మీ కుటుంబం పనికిరాదని జీ-23 నాయకులే అంటున్నారు కదా? శెరం రాదా?! ఈడికొచ్చి కూతలా?!
ఇక రాహుల్‌గాంధీ.. పాపం ఆయనకు మోపలేని భారం కాంగ్రెస్ పార్టీ. కొన్ని దశాబ్దాల కింద మజ్జి తులసీదాస్ అని ఒక పీసీసీ అధ్యక్షుడు ఉండేవారు. ‘పీసీసీ పదవి తలమీద పేడ తట్ట లాంటిది’ అన్నారు ఆయన. అచ్చు అంతటి నిస్సహాయ స్థితిలో, జీ-23 రోజూ శూలాలతో పొడుస్తూ ఉంటే, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు అసలు రాహుల్‌గాంధీకే యే పదవి ఇవ్వొచ్చో, ఇవ్వకూడదో చెపుతూవుంటే… దారీ తెన్నూ కానక, దిక్కూ మొక్కూ లేక ఏవేవో మాట్లాడుతూ ఉంటారు రాహుల్ గాంధీ. ‘ఈరోజు ఏంటి మన థీం’ అని ఫ్లైట్ దిగగానే అడగగలిగేంత అలవోక రాజకీయాలు ఆయనవి.
పార్టీ అంతర్గత మీటింగ్‌లలో మాట్లాడాల్సిన మాటలు, చేయాల్సిన హెచ్చరికలు, బెదిరింపుల మాటున బేలతనం మొత్తమూ బహిరంగ సభలో కక్కేసిన విషాదమూర్తి ఆయన.మార్కెట్ యార్డ్ ఎక్కడ ఉందో, చేతికి కంకణం కట్టింది మహిళా రైతా, ఎమ్మెల్యేనా తెలియని దయనీయ స్థితిలో ఉన్న నాయకులను ఎవరూ రక్షించలేరు గానీ… వారు ప్రకటించిన ‘డిక్లరేషన్’ను పరికిస్తే స్వామినాథన్ కమిషన్ చెప్పిన ఎమెస్పీని అటక ఎక్కించిందే కాంగ్రెస్ పార్టీ.
స్వామినాథన్ కమిటీ ప్రతిపాదించిన ఎమెస్పీ (సీ2+50% – production plus 50%) ఇవ్వలేమని యూపీఏ- 2 ప్రభుత్వం స్వామినాథన్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే పార్లమెంట్లో ప్రకటించింది. అప్పటి వ్యవసాయ మంత్రి శరద్ పవార్ లిఖితపూర్వకంగా సభలో చెప్పడమే కాక, ఆ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా సమర్పించిన్రు. ఇపుడు వచ్చి ఎమెస్పీ ఇస్తామనడం దారుణమైన మోసం. ఇదొక్కటే కాదు డిక్లరేషన్‌లో చెప్పిన యే అంశమూ కాంగ్రెస్ తాను పాలనలో ఉన్న రాష్ర్టాలలో అమలుచేయడం లేదు. కాంగ్రెస్ పాలనలో జరిగినన్ని రైతు ఆత్మహత్యలు ఎప్పుడూ జరగలేదన్నది రికార్డుల్లో ఉన్నది. ‘ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి…’లో భర్తృహరి చెప్పిన వివేకభ్రష్టతలో కాంగ్రెస్ పార్టీ నేడు కొట్టుకొని పోతున్నది. ఒకటి రెండు రాష్ర్టాలకు పరిమితమైన ప్రాంతీ య పార్టీ కాంగ్రెస్.
మాట్లాడితే తెలంగాణ ఇచ్చినం అంటున్నారు- ఇచ్చినోడే గొప్ప అయితే భారతదేశ స్వాతంత్య్రానికి క్రెడిట్ బ్రిటిష్ వాళ్లకు ఇద్దామా? అసలు ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న దౌర్భాగ్యాలకు మూలవిరాట్టు కాంగ్రెస్ కాదా? రాజీవ్ హయాంలో శిలాన్యాస్ చేసి మత కల్లోలాలకు పురుడుపోసింది కాంగ్రెస్ కాదా? గవర్నర్ల వ్యవస్థ ద్వారా రాష్ర్టాలను కబళించింది కాంగ్రెస్ కాదా? ఈ దేశానికి ఎమర్జెన్సీ ఇచ్చింది కాంగ్రెస్ కాదా అప్పుల భారతాన్ని ఆర్థిక సంస్కరణలతో గొప్పగా మలచిన మన పీవీని దారుణంగా అవమానించింది కాంగ్రెస్ కాదా? ఆయన పార్థివ శరీరానికి కూడా గౌరవం దక్కనీయని నైచ్యం కాంగ్రెస్ ది కాదా? నిన్న సభలో పీవీ ఫొటో కానీ, పేరు కానీ లేకపోవడం తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డకు జరిగిన అవమానం కాదా?
అంతటి మకిలి చరిత్ర కలిగిన మీరు మాకు చెప్పేవారా రాహుల్? కేసీఆర్‌ను క్షమించం అంటారా? యెంత కండకావరం! అసలు ఎలాంటి పొత్తులకూ పనికిరాని పార్టీ అని కదా దేశవ్యాప్తంగా అందరూ కాంగ్రెస్‌ను వెలేసిన్రు. పార్టీని, దేశాన్ని నడపడానికి మీ కుటుంబం పనికిరాదని జీ-23 నాయకులే అంటున్నారు కదా? శెరం రాదా?! ఈడికొచ్చి కూతలా?!
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి మీకు కంటగింపుగా ఉన్నది. అరువు తెచ్చుకున్న దొంగలతో పార్టీని నడిపే మీరు ప్రజలకే కాదు, మీకు మీరు కూడా పనికిరారు. ఈ రోజు ధైర్యంగా మేము తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం చేద్దామనే నినాదంతో భారత రాజకీయాలకు కాయకల్ప చికిత్స చేసేందుకు రంగంలోకి దూకుతున్నాం. ఏదీ మీరు ‘కాంగ్రెస్ మోడల్ దేశవ్యాప్తం చేస్తాం’అని వీధుల్లో తిరగండి, గోచీలు ఊడకుండా తిరిగి ఇళ్లకు పోగలరేమో చూద్దాం!
మీరు కలలో కూడా ఊహించని అభివృద్ధి సంక్షేమాల పరుగు తెలంగాణది. కాన్ ఖోల్ కర్ సునో, రాహుల్.
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.4.16 లక్షల కోట్లు. ఎనిమిదేండ్ల తర్వాత ఇప్పుడు అక్షరాలా రూ.9.80 లక్షల కోట్లు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు తలసరి ఆదాయం సుమారు రూ.1.24 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.2.78 లక్షలు. పెద్ద.. చిన్న అన్న తేడా లేకుండా అన్ని రాష్ర్టాలను దాటుకొని, స్వల్పకాలంలోనే ఎవరికీ అందనంత వేగంగా తారాజువ్వలా రాష్ట్ర ఆర్థికవృద్ధి దూసుకుపోతున్నది. ఈ వృద్ధి రాజధానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రమంతటా సమగ్రంగా కనిపిస్తున్నది.
గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే మనం సగర్వంగా అంటున్నాం… ఈ మోడల్ దేశవ్యాప్తం చేద్దామని. మీరు పాలించే రాష్ర్టాల్లో ఈ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా? పోనీ దశాబ్దాలుగా ఉద్ధరించిన మీ దేశ పాలనలో ఇలాంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? మా కేసీఆర్ చెప్తూంటారు్ర స్టక్చరల్ ఛేంజెస్ రావాలని. ఎందుకో ఊహించగలరా? ఆయన వేస్తున్న ప్రశ్నలు, వెతుకుతున్న సమాధానాలు, సాధించబోయే పరిష్కారాలు మీ తరమా?
ఈ దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లున్నా చెన్నై లాంటి నగరం బకెట్ నీళ్ల కోసం తపిస్తున్నది. ఎందుకు 75% పైచిలుకు దేశం మంచి నీటికోసం అల్లాడుతూ ఉంది?
సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం దేశంలో మొత్తంగా ఉన్నదే 40 కోట్ల ఎకరాల సాగు భూమి. ఇందుకుగాను 40 వేలటీఎంసీలువాడినా, 10 వేలటీఎంసీలుతాగునీటికోసం, పారిశ్రామికఅవసరాలకోసంవాడినాఇంకా 20 వేల టీఎంసీలు మిగులుఉంటాయి. వంద-రెండొందల ఏండ్ల వరకు మనం రంది పడక్కరలేనంత పుష్కలమైన ప్రకృతి సంపద ఉన్నది. ఇప్పటివరకు ఎందుకు 28 వేల టీఎంసీలు వాడకం దాటలేదు దేశవ్యాప్తంగా?
దేశం మొత్తంలో స్థాపిత విద్యుత్ 4 లక్షల మెగావాట్లు. కానీ కేవలం 2 లక్షల మెగావాట్లు మాత్రమే వాడుతున్నాం. విద్యుత్ సంస్థల ఉసురు తీయడం వల్ల అవి నడవలేక, వాటిని నడపలేక బ్యాక్‌డౌన్ అవుతున్నాయి. ఇంకో 2 లక్షల మెగావాటు ్లఉత్పత్తికి సిద్ధంగా ఉండి కూడా కేంద్ర ప్రోత్సాహం లేక మూలన పడి ఉన్నవి. వాటిని దేశ ప్రగతికి ఎట్లా వాడుదాం, అవసరమైతే లక్ష కోట్లు ఇచ్చి వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతిని దేశవ్యాప్తంగా ఎట్లా చేద్దామనే ధ్యాస ఎందుకు లేదు? మీ కాంగ్రెస్ పార్టీ ఎపుడైనా ఈ ఆలోచన చేసిన్రా?
దేశాన్ని ఎక్కువ ఏండ్లు పరిపాలించిన మీ పార్టీ తప్పించుకోగలదా కేసీఆర్ వేసే ఈ ప్రశ్నల నుంచి రాహుల్? ఎపుడో 1969లో మీ నాయనమ్మ ఇచ్చిన ‘గరీబీ హటావో’ నినాదం ఏమీ సాధించలేకపోయిందనే కదా, మీ అమ్మగారు ‘ఫుడ్ సెక్యూరిటీ చట్టం’ తేవాల్సి వచ్చింది. వర్తమానమే సరిగా సోయి ఉండని మీకు ఇంక గతం యెంత చెప్పి ఏమి లాభం? భవిష్యత్ దర్శనం ఎంత చేపించి ఏం సుఖం! అన్నింటా దివాళా తీసిన మీ నుంచినేర్చుకోవాల్సిందేమీ లేదు. తెలంగాణ ద్రోహులు నిండి ఉన్న మీ టీపీసీసీ నుంచి అంతకన్నా లేదు.
సకల జనులను, సబ్బండ వర్ణాలను ఏకం చేసి; ఇటు గల్లీలో, అటు ఢిల్లీలో నిప్పు రగిలించి, బరి గీసి, మెడమీద కత్తి పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ముందు మీ కుప్పిగంతులా? మీ సంగతి తెలుసు కాబట్టే ఇచ్చినం ఇచ్చినం అని మీరు యెంత గింజుకున్నా రాష్ట్రం వచ్చినంక రెండుసార్లు మిమ్మల్ని ఓడించిన్రు తెలంగాణ బిడ్డలు. వారి దృష్టిలో మీరు లేరు. ఇంక ఉండరు. You are a gone caset.
అందుకే… కేసీఆర్ దిగుతున్నరు రంగంలోకి. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తం చేయడానికి. భారతదేశానికి నూతన జవసత్వాలు అందించడానికి. తెలంగాణ ద్రోహుల, దేశ ద్రోహుల భరతం పట్టడానికి. మీరు మమ్మల్ని క్షమించడం కాదు, మీకంత దృశ్యం లేదు. మేమే మిమ్మల్ని శిక్షించడం ఖాయం, ఈ దేశాన్ని రక్షించడం ఖాయం. కాస్కోండి!
-శ్రీశైల్‌రెడ్డి పంజుగుల 90309 97371