యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పల్లెబాటకు శ్రీకారం చుట్టనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఆయన సన్మానించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత యాదాద్రి భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 17న ఎన్నికల కోడ్ ముగియనుంది. దీంతో కేటీఆర్ మొదటగా 18న యాదాద్రి భువనగిరి జిల్లాకు రానున్నారు.
జిల్లాలో గెలుపొందిన బీఆర్ఎస్ మద్దతుదారులతో ఆయన భువనగిరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. వారితో స్వయంగా ముచ్చటించనున్నారు. అనంతరం సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించనున్నారు. గెలిచినోళ్లతోపాటు ఓడిన అభ్యర్థులతోనూ మా ట్లాడతారు. సంస్థాగతంగా ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డితోపాటు మాజీఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున సం బురాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు.
పైళ్లకు కేటీఆర్, హరీశ్‌రావు అభినందన
భువనగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ మద్దతుదారులు విజయదుందుభి మోగించడమే కాకుండా రాష్ట్రంలోనే నాలు గో స్థానంలో నిలిచింది. మంచి ఫలితాలు రావడంతో కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పైళ్ల శేఖర్ రెడ్డిని అభినందించా రు. సోమవారం వారు వేర్వేరుగా శేఖర్ రెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికార పార్టీని మట్టి కరిపించి.. సగానికి పైగా స్థానాలు దక్కించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగించాలని సూచించారు. ప్రజా సమస్యలపై ఎప్ప టికప్పుడు పోరాడాలని, కాం గ్రెస్ హామీలు, సర్కారు తప్పులను ఎత్తిచూపాలలని వారు సూచించారు.
బీఆర్ఎస్ పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పది : శేఖర్ రెడ్డి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంలో ఎక్కడా తగ్గకుండా హోరాహోరీగా పోరాడిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అండదండలతో అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోలీసులను ఉపయోగించిందని మండిపడ్డారు.
తమ పార్టీ అభ్యర్థులు గెలిచే చోట తనిఖీల పేరుతో కేడర్‌ను అడ్డుకున్నదని విమర్శించారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులు ఎక్కడా తగ్గకుండా పోరాడిన తీరు ఎంతో గొప్పదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార దుర్వినియోగాన్ని ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. ఎన్నికల్లో ఓడిన వారందరికీ మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పోరాట స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ ముందుకు సాగుదామని, అందరికీ అండగా తానుంటానని ధైర్యం చెప్పారు.