దంతాలు.. ఇవి మన శరీరంలో గ్రైండర్ లాంటివి. గ్రైండర్ మాదిరిగానే మనం తిన్న ఆహారాన్ని దంతాలు మెత్తగా నమిలి లోపలికి పంపిస్తాయి. ఈ క్రమంలో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. అంటే దంతాలు మన శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో ఒకటి అని చెప్పవచ్చు. ముఖ కవళికలు అందంగా కనిపించడంతోపాటు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే దంతాలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. పంటి నొప్పి వస్తే కనీసం మంచినీరు కూడా తాగలేని పరిస్థితిని చాలామంది ఎదుర్కొనే ఉంటారు.

దంత సమస్యలు ఉంటే అవి పూర్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే నోటి ఆరోగ్యంలో దంతాలదే కీలక పాత్ర. అంతటి ప్రాధాన్యమైన దంతాలను సంరక్షించుకోవడం చాలా అవసరం. కానీ, ఈ విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. దీని వల్ల దంత సమస్యలు ఉత్పన్నమై, చివరికి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. అయితే చిన్న చిన్న చిట్కాలు, సాధారణ సంరక్షణ చర్యలతో దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దంతాల ఆరోగ్యం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దంత సంరక్షణ లేకపోతే కలిగే అనర్థాలు, వాటి లక్షణాలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
దంత సంరక్షణలో బ్రష్ చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకోవడం సర్వసాధారణం. ఇదే దంత సంరక్షణ అనుకుంటారు చాలామంది. అసలు ఉదయం బ్రష్ చేయడం కంటే రాత్రి సమయంలో బ్రష్ చేయడం వల్ల దంతాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయం బ్రష్ చేసుకుంటే ఫ్రెష్‌గా కనిపిస్తాం. సాధారణంగా రాత్రి సమయంలో మనం నిద్రించినప్పుడు మన శరీరంలోని ఇమ్యూనిటీ కూడా నిద్రిస్తుంది. అంటే రోగనిరోధక వ్యవస్థ మందకొడిగా మారుతుందన్నమాట. మనం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ దఫాలుగా తీసుకున్న ఆహార పదార్థాల్లోని చిన్న చిన్న కణాలు దంతాల మధ్యన ఇరుక్కుపోతాయి.
ఈ పదార్థాల నుంచి రాత్రి సమయంలో బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియాను అడ్డుకునేందుకు కావల్సిన ఇమ్యూనిటీ అనేది రాత్రి సమయంలో పెద్దగా పనిచేయదు. దీంతో దంతాలు, చిగుళ్లపై బ్యాక్టీరియాలు రెచ్చిపోతాయి. అందుకని రాత్రి సమయంలో పడుకునే ముందు కచ్చితంగా బ్రష్ చేయాల్సిందే. ఇలా రాత్రి సమయంలో పడుకునే ముందు బ్రష్ చేయడం వల్ల దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు తొలగిపోయి, బ్యాక్టీరియా ప్రభావం కూడా తగ్గిపోతుంది.

సాధారణంగా చిన్న పిల్లలకు రాత్రి సమయంలో పాలు పట్టి, నిద్ర పుచ్చుతారు. పిల్లలకు పట్టే పాలల్లో చక్కర కలపడం వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియా పాలలో ఉన్న చిక్కదనం, చక్కెర వల్ల రెట్టింపు అవుతుంది. దీంతో నోట్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడటం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పెద్ద పిల్లలు సైతం రాత్రి సమయంలో పాలు తాగుతుంటారు. పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే! కానీ, రాత్రి బ్రష్ చేసుకోకుండా పడుకుంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియా కంటెంట్ పెరిగి అది దంతాలు, చిగుళ్లపై ప్రభావం చూపుతుంది.

దంతాలకు సమస్య ఏర్పడితే ఏదైనా చికిత్స తీసుకుని ఉపశమనం పొందవచ్చు. అదే చిగుళ్లకు సమస్య ఎదురైతే అది మొదటికే మోసం అవుతుంది. ఎందుకంటే చిగుళ్లు దెబ్బతినడం వల్ల వాటికింద ఉండే ఎముక అరిగిపోతుంది. ఇలా చిగుళ్ల కింద ఉన్న ఎముక అరిగిపోవడాన్ని వైద్య పరిభాషలో ‘పెరియోడాంటైటిస్’ అంటారు. అంటే పంటి చుట్టూ ఉన్న ఎముక దెబ్బ తిని, దంతాలు వదులు అవుతాయి. అయితే ఈ సమస్య వెంటనే బయట పడదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి ఈ డాంటైటిస్ వచ్చే అవకాశం రెండింతలు అధికం. కొన్ని మందుల వల్ల కూడా చిగుళ్ల వాపు వస్తుంది. మూర్చ వ్యాధిగ్రస్తులు తీసుకునే మందుల వల్ల చిగుళ్ల వాపు తలెత్తుతుంది. నోటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు గుండె ఆపరేషన్లు గాని, క్యాటరాక్ట్ ఆపరేషన్లు గాని చేయించుకోలేం. ఇన్ఫెక్షన్స్ తగ్గిన తరువాతనే సర్జరీలు చేస్తారు. అంటే శస్త్రచికిత్సలు చేయించుకోవాలంటే నోటి ఆరోగ్యం తప్పనిసరి.

-మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ ప్రసాద్ మేక
ప్రాక్టో డెంటిస్ట్ అండ్ ఇంప్లాంటలాజిస్ట్
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్