Bondi Beach : ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ (Bondi Beach)లో ఆదివారం సాయుధులైన ఇద్దరు కాల్పులు జరిపి పదిమందిని బలిగొన్నారు. యూదు మతస్తులే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో నిజానికి మరికొందరు చనిపోయేవారే. కానీ, ఒకేఒక్కడు తెగువతో దుండగుడిని అడ్డుకున్నాడు. ప్రాణాలకు తెగించి.. అతడి నుంచి తుపాకీ లాక్కొని అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు. ఆ వ్యక్తి సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఆ వీడియో చూసినవాళ్లంతా ఆ వ్యక్తి తెగువను ప్రశంసిస్తున్నారు.
పర్యాటకులతో సందడిగా ఉన్న బాండీ బీచ్లో ఆదివారం ఇద్దరు సాయుధులు సెక్యూరిటీ దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఊహించని పరిణామంతో భయభ్రాంతులకు లోనైన పర్యటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరగులు తీశారు. వీరిలో అత్యధికులు యూదు మతస్తులే. రాత్రి ‘హనుక్కాహ్’ అనే తమ సంప్రదాయ హాలీడేను సెలబ్రేట్ చేసుకునేందుకు వీరు వచ్చారు. అయితే.. వీరిని అంతమొందిచాలనే ఉద్దేశంతోనే సాయంత్రం 6:40 సమయంలో కారులో వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఒకవ్యక్తి చెట్టు దగ్గర నిలబడి ఫైరింగ్ చేయగా.. మరొకరు బీచ్ పెవిలియన్ రోడ్డు మీద నుంచి గన్ పేల్చసాగాడు.
BREAKING: Video shows the moment a civilian disarming a Bondi Beach shooter pic.twitter.com/0IbMIeNE5N
— Insider Paper (@TheInsiderPaper) December 14, 2025
అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఒక దుండగుడిని గమనించాడు. అమాయకుల ప్రాణాలు కాపాడాలనుకుని.. కార్ల పక్క నుంచి గబుక్కున వెళ్లి అతడిని వెనకాల నుంచి అదిమి పట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి చేతుల్లోని తుపాకీని లాక్కొని.. వెళ్తావా.. కాల్చేయాలా? అని గన్ ఎక్కుపెట్టాడు. అంతే.. ఆ దుండగుడు భయంతో పరుగందుకున్నాడు. అంతలోనే మరో వ్యక్తి, మరికొందరు వచ్చి.. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడితో పాటు దాడికి పాల్పడిన వ్యక్తి చనిపోయాడు.