ఉత్తరప్రదేశ్‌లో మొదలై మధ్యప్రదేశ్, గుజరాత్‌లకు చేరి, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి పాకిన బుల్డోజర్ రాజకీయాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అల్పసంఖ్యాక వర్గాలే కాకుండా, పేదప్రజల, ప్రజాస్వామ్య ప్రియుల హృదయాలు బాధతో బరువెక్కుతున్నాయి. దేశంలో మత స్వాతంత్య్రం, చట్టబద్ధపాలన రాజుగారి ‘దేవతా వస్ర్తాలా’్ల తయారైన దుస్థితి కళ్లెదుట కనిపిస్తున్నది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా కూడా ఆ ఉత్తర్వు ప్రతి తమ చేతికి అందలేదంటూ కేంద్రప్రభుత్వ కనుసన్నల్లో, బీజేపీ ఆధీనంలోని ఢిల్లీ మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు బుల్డోజర్లను మరో గంటన్నరపాటు నడిపించి విధ్వంసం కొనసాగించారు. ఈ దాష్టీకాన్ని బట్టి వారు ఎంతకు తెగించారో, వారి వెనుక ఉన్న శక్తులెవరో ఊహించుకోవచ్చు. దేశాన్ని పాలించే వాళ్లు మతం పేరుతో విద్వేష జ్వాలల్ని రగిలిస్తుంటే నిస్సహాయంగా చూసే పరిస్థితి నెలకొంది.
సమర్థవంతమైన న్యాయ విచారణ వ్యవస్థ మనది. లబ్ధప్రతిష్ఠ న్యాయవ్యవస్థ మనకున్నది. ఎవరైనా నేరం చేస్తే చట్టం ప్రకారం శిక్షించవచ్చు. కానీ అధికారంలో ఉన్న ఒక రాజకీయ పక్షం లేదా ఒక సామాజిక వర్గం ఇతర పార్టీ వారిని లేదా వర్గాన్ని వేధించడానికి రాజ్యాంగం సమ్మతించదు. అధికారంలో ఉన్నవారు తమకు తామే కొందరిని నేరస్థులుగా ముద్రవేసి, బుల్డోజర్లు నడిపించడానికి ఇదేమీ రాచరికం కాదు, సైనికపాలన కాదు. బీజేపీ వారు దేశమంతటా అధికారంలో లేరు. మరి ఇతర పార్టీలు అధికారంలో ఉన్నచోట, వారు కూడా బీజేపీ నాయకులపై ఇదే విధంగా వ్యవహరిస్తే పరిస్థితి ఏమిటి? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తదనుగుణమైన బాధ్యత కూడా ఉంటుంది. ఇతరులకు మార్గదర్శకంగా, ఆదర్శంగా ఉండాలి. కానీ కంచే చేను మేసినట్టు ఈ అరాచకానికి పాల్పడమేమిటి?
మన పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు అనేక మూడవ ప్రపంచదేశాలు సైనిక పాలనలో మగ్గిపోతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని పదిలంగా నిలబెట్టుకున్న ఘనత మనది. శ్రీలంక వంటి చిన్నదేశాలు జాతి విద్వేషాలతో కుతకుతలాడినా, అనేక జాతులు, భాషలు, సంస్కృతులు గల మన విశాల దేశం పరస్పర సహనంతో ప్రశాంతంగా ఉన్నది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలకు దీటుగా మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నదని గర్వంగా చెప్పుకుంటాం. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, మత స్వాతంత్య్రం, భావ స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన గల రాజ్యాంగ వ్యవస్థ మనది. సహనం, సౌభ్రాతృత్వం అనే నైతిక విలువలు ప్రాచీనకాలం నుంచి మన జాతిలో జీర్ణమైపోయి ఉన్నాయి. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తప్ప ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు తెలువని నాయకులు, ప్రజల సమస్యలను పరిష్కరించలేని అసమర్థ పాలకులు విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామంటే ప్రజలు సహించరు. భారతీయ సమాజం ఇటువంటి విషమ పరీక్షలను ఎన్నింటినో ఎదుర్కొని నిలిచింది. నిరంకుశ పాలకులకు గుణపాఠం నేర్పుతారు.