‘కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇవ్వవచ్చు.. కానీ, తాను బీజేపీలో పనిచేసి గవర్నర్ పదవిని చేపడితే తప్పా’ అంటూ గవర్నర్ తమిళిసై ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ ప్రశ్నలోనే సమాధానం ఉన్నమాట వాస్తవం. ‘ఎమ్మెల్సీ’ రాజకీయ పదవి. ‘గవర్నర్’ రాజ్యాంగబద్ధమైనది. రెండింటినీ పోల్చలేం. గవర్నర్ పదవిలో ఉన్నవాళ్లు రాజకీయాలు మాట్లాడటం ఏ విధంగా సరైనది?
ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన పలువురు గవర్నర్ల నుంచి గత గవర్నర్ నరసింహన్ వరకు దాదాపుగా ఎవరితోనూ వివాదాల్లేవు. కానీ ప్రస్తుత గవర్నర్ తమిళిసై భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానంటూనే రాజకీయం చేస్తున్నారు. అందుకు ఆమె ఆరోపణలే తాజా ఉదాహరణలు. ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉంటున్నప్పటికీ రాజకీయ నేతలాగే ఆమె మాట్లాడుతున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం సాధారణంగా రాష్ర్టాల్లో గవర్నర్ పేరుతో పాలన నడుస్తుంది. అంతేకానీ, సదరు గవర్నర్‌కు ఎలాంటి ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉండవు. పాలనంతా క్యాబినెట్ సూచన మేరకే చేయాలి, చేయాల్సిందే. అదే మన రాజ్యాంగ పెద్దల ఉన్నత ఆలోచన. ఇంకా చెప్పాలంటే గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి. భారత రాష్ట్రపతి ద్వారా నియమితులైన వ్యక్తి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘గవర్నర్ పోస్టు వృథా’ అని విమర్శించారు. ఆ తర్వాత కాలంలో ఆ పోస్టు ద్వారా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇబ్బందులు పడ్డారు, ఇంకా పడుతున్నారు.
1980 దశకంలో ఏపీ గవర్నర్ రాంలాల్ చేసిన రాజకీయ గందరగోళం ఇప్పటికీ దేశ ప్రజలు మరచిపోలేదు. ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి, పరోక్షంగా కాంగ్రెస్‌కు ఉపయోగపడదామనుకున్నారు. కానీ, ప్రస్తుత తెలంగాణ గవర్నర్ మాత్రం తాను తలుచుకుంటే ప్రభుత్వమే పడిపోయేదని మీడియాకు చెప్పడం విడ్డూరం, హాస్యాస్పదం. బడ్జెట్ స్పీచ్‌కు ముందు తనకు అవకాశం ఇవ్వలేదని తమిళిసై వాదన. కానీ, అదేం రాజ్యాంగ విరుద్ధం కాదు కదా. ఈ విషయాన్ని ఎందుకు గవర్నర్ తమిళిసై అర్థం చేసుకోవడం లేదు? గవర్నర్ ప్రసంగంతో రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకంగా ఒనగూడే ప్రయోజనం ఏమైనా ఉందా? అదొక సంప్రదాయం. మన భారత రాజకీయ యవనికపై ఎన్ని సంప్రదాయాలను వదిలించుకోలేదు. మరెన్ని సంప్రదాయాలను కొత్తగా అలవర్చుకోలేదు?
రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థకు ప్రముఖ స్థానం ఉన్నది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, ప్రతి కార్యనిర్వాహక ఆదేశం గవర్నర్ పేరుతోనే జారీ అవుతుంది. శాసనసభలో ఆమోదించిన చట్టాలు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతే అమలులోకి వస్తాయి. పాలనా యంత్రాంగంలో సంక్షోభం, ఘర్షణ తలెత్తిన సమయాల్లో గవర్నర్ నిర్వహించే పాత్ర కీలకం. గవర్నర్ల పరిణతి, అనుభవంతో కూడిన మార్గదర్శకత్వం సాధారణ పరిస్థితిని నెలకొల్పడానికి తోడ్పడుతాయని అనేక ఉదాహరణలు చెప్తున్నాయి.
రాష్ర్టానికి, కేంద్రానికి మధ్య వారధిగా గవర్నర్ విధులుంటాయి. సంబంధిత రాష్ర్టాల్లో ఉద్రిక్త పరిణామాలు నెలకొన్నప్పుడు కేంద్రానికి అక్కడి గవర్నర్లు ఇచ్చే నిజాయితీతో కూడిన, సత్యసమ్మతమైన నివేదికలు చాలా విలువైనవి. ఇలాంటి పరిణామాలను చాలామంది గవర్నర్లు జాగరూకతగా పరిశీలిస్తారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రం గతంలో చాలావరకు అత్యున్నత ప్రమాణాలు, ప్రభావాలు నెలకొల్పిన గవర్నర్లనే చూసింది.సి.రంగరాజన్, కృష్ణకాంత్ వంటివారు గవర్నర్ పదవికే వన్నె తెచ్చారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఒక సమస్యతో వ్యవహరించేటప్పుడు తమ మధ్య ఎన్ని విభేదాలున్నప్పటికీ శత్రువైఖరి కలిగి ఉండరాదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందా? అంటే ఆమె దగ్గర సమాధానం లేదు. కానీ, తనను అవమానిస్తున్నారని అంటారు! ఇటువంటి సందర్భం ఒకటి.. రాజీవ్‌గాంధీ హయాంలో చోటుచేసుకున్నది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఉన్న జ్ఞానీజైల్‌సింగ్ కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఉండేవారు.
కోపగించిన రాజీవ్ ప్రభుత్వం జైల్‌సింగ్ విదేశాలు వెళ్లేందుకు అనుమతించలేదు. వేరే ఇతర పర్యటనలకు కూడా ఆయనకు అనుమతి నిరాకరించింది. జైల్‌సింగ్ కాంగ్రెస్ సీనియర్ నేత. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాన అనుచరుడిగా పేరుండేది. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వమే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండగా అవమానించింది. కానీ, తెలంగాణలో జరుగుతున్నది పూర్తిగా భిన్నం. గవర్నర్ స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్తున్నారు. దేవాలయాలు, గిరిజన ప్రాంతాలను సందర్శిస్త్తున్నారు. అయినప్పటికీ ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై ఇంకా అనవసర ఆరోపణలు చేయడం అర్థరహితమే. గవర్నర్ ఈ విషయంలో ఎంత ఎక్కువ బయటికి మాట్లాడితే అంత ఎక్కువ ఆ పదవికి ఉన్న ఔన్నత్యాన్ని పోగొట్టుకున్నట్లే అవుతుంది.
గవర్నర్‌కు వ్యతిరేకంగా అధికార పార్టీ గానీ, ప్రభుత్వం గానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. గవర్నర్ పదవిని గౌరవిస్తూ సంయమనం పాటిస్తున్నాయి. అయినప్పటికీ, గవర్నర్ ఎందుకు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? విపక్షాలతో పోట్లాడినట్లుగా తనతో పోట్లాడటం సరికాదని చెబుతూ స్వయంగా ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై విమర్శలు ఎం దుకు చేస్తున్నారు? కేంద్రంతో రాష్ట్రప్రభుత్వానికి దూరం పెరిగిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏ విధంగా గవర్నర్ పదవికి వన్నె తెస్తుంది?
(వ్యాసకర్త: రాష్ట్ర లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు)
-మన్నారం నాగరాజు 95508 44433