ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనమైన ఆలయ నిర్మాణాలు, యాగ క్రతువుల గురించి చర్చ చాలా జరుగుతున్నది. క్రతువుల కాలంలో దానిని ప్రధానంగా మతానికి అంటగట్టారు. ఆలయాల కాలానికి రాష్ట్రంలో బీజేపీ హడావుడి కొంత పెరిగినందున, ఆ పార్టీని ఎదుర్కొనేందుకు అంటున్నారు. ఇదంతా లోతులేని పైపై దృష్టి. కొంత ఆలోచించగలవారు, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఉద్యమకాలం నుంచే ఉండిన ఆలోచన, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ సాగుతున్న పలు ప్రయత్నాలలో భాగంగా దీన్ని చూస్తున్నారు. అయితే దేశంలో జరుగుతున్న రాజకీయ, సామాజిక, క్లిష్ట పరిణామాలను, కేసీఆర్ చాలావరకు మౌనంగా చేసుకుపోతున్న కార్యాలను గమనించినప్పుడు అందుకు చెప్పుకోవలసిన కీలకమైన, విస్తృతమైన, లోతైన అర్థాలు కొన్ని ఉన్నాయనిపిస్తుంది.
ఇప్పుడు దేవాలయాల ఘన నిర్మాణాలు సైతం ఈ దృష్టితో చూసి అర్థం చేసుకోవలసినవే.ఇవి మొట్టమొదటనే ఏర్పడి కొనసాగుతున్న దృష్టే తప్ప కొత్తది కాదు. పైగా మొట్టమొదటి నుంచి తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష. అది స్వరాష్ట్ర సిద్ధి తర్వాత కేసీఆర్ నాయకత్వాన నెరవేరుతున్నది. ఇవన్నీ తొలుత నుంచి గల ఉద్యమ లక్ష్యాలు.
ఒక కార్యానికి పలు లక్ష్యాలుండటం సర్వసాధారణం. అందులో ఆక్షేపించ వలసింది ఏమీ లేదు. అదేవిధంగా ఒకోసారి, తొలుత ఊహించని రీతిలో, కొత్త పరిస్థితులు ఉత్పన్నం కావటం, దానిని బట్టి మరో కొత్త లక్ష్యం ఏర్పడటం కూడా సర్వసాధారణమే. ఆ విధంగా ఇప్పుడు, ఆలయాల ఘనమైన నిర్మాణం అనే అంశాన్ని పరిశీలిద్దాం. దాన్ని ఏవో కొన్ని స్థూలమైన ప్రశ్నలకు పరిమితం కాకుండా, వాటిని ప్రస్తావిస్తూనే లోతైన విషయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిద్దాం. ఆ తర్వాత, ఇటువంటి అంశాలతో ముడిపడి కొన్ని అనూహ్యమైన, అనుద్దేశితమైన విషయాలు కూడా దేశం ముందుకు, సమాజం ముందుకు, మనముందుకు వస్తున్నందున, ఈ ప్రశ్నలపై చర్చ దేశంలో అరుదుగా మాత్రమే జరుగుతున్నందున, ఆ కోణంలోకి కొంత తొంగి చూసేందుకు ప్రయత్నిద్దాం. అది ఎంత ముఖ్య కోణమైనా ఇక్కడ సుదీర్ఘ చర్చ వీలయ్యేది కాదని గమనించాలి. అదేవిధంగా, కేసీఆర్ ఆలోచనలు, కార్యాలకు ఈ కోణంతో స్పష్టాస్పష్ట సంబంధం కనిపిస్తున్నదనాలి. ఈ చర్చను ఈ కోణానికి పొడిగించటం అందువల్లనే.
వాస్తవానికి స్థూలమైన స్థాయిలోనైతే ఈ విషయాల గురించి మరోమారు మాట్లాడుకోవలసిన అవసరమే లేదు. క్రతువులకు సంబంధించి అది కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారమని అర్థం చేసుకోవటం కష్టం కాదు. అవి తనను ‘హిందువు’గా ప్రకటితం చేయడం మాట ఎట్లున్నా, అప్పటికి రాష్ట్రంలో ‘బీజేపీ ఉధృతి’గా ఎవరు చెప్పుకొంటున్నది ఏమీ లేదు. ఆలయాల విషయానికి వస్తే, పైన అన్నట్లు తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం మాట ఉద్యమాల కాలం నుంచీ ఉన్నదే. అందుకు సంబంధించిన కార్యాచరణ రాష్ట్రం ఏర్పడినదే తడవుగా మొదలై అనేక విధాలుగా సాగుతున్నది. అందులోకి దేవతలు ఎందరు రావటం లేదు? పైగా బతుకమ్మ నుంచి బోనాల వంటి గ్రామ దేవతల వరకు ఏ ఉత్సవం మునుపెన్నడూ లేనంత ఘనంగా సాగటం లేదు? అందులో పునరుజ్జీవన క్రమం ఘనంగా ఉండాలనే భావన ఎంతున్నదో, నిస్సంకోచంగా చెప్పాలంటే ఇటువంటివన్నీ ఘనంగానే జరుపుకోవాలనే కేసీఆర్ స్వాభావిక తత్వం అంతున్నది. ఆ కాలమంతా బీజేపీ జాడలు లేవు. అయినా ఎవరైనా దానికి ముడిపెట్టి చూస్తే అంతకన్న హాస్యాస్పదం ఉండదు.
ఇప్పుడు దేవాలయాల ఘన నిర్మాణాలు సైతం ఈ దృష్టితో చూసి అర్థం చేసుకోవలసినవే. ఇవి మొట్టమొదటనే ఏర్పడి కొనసాగుతున్న దృష్టే తప్ప కొత్తది కాదు. పైగా మొట్టమొదటి నుంచి తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష. అది స్వరాష్ట్ర సిద్ధి తర్వాత కేసీఆర్ నాయకత్వాన నెరవేరుతున్నది. ఇవన్నీ తొలుత నుంచి గల ఉద్యమ లక్ష్యాలు. తెలంగాణ అన్నివిధాలా అభివృద్ధి చెందాలి. కోల్పోయినవన్నీ తిరిగిరావాలి. ఈ ప్రణాళికలో, పట్టుదలలో తెలంగాణ సొంత ఉనికికి, గుర్తింపునకు, సొంత రాజకీయానికి, ఆర్థికానికి, అభివృద్ధికి, భావ ప్రపంచానికి, సొంత సమాజానికి ఎంతటి స్థానం ఉందో తనదైన సంస్కృతికి కూడా అంతటి స్థానం ఉంది. ఆ తనదైన మూలాలు అంటూ ఉన్న వేలు, వందల సంవత్సరాల, తరతరాల సంస్కృతిలో తనవారైన అనేకానేక దేవతలు ఉంటారు. విశ్వాసాలుంటాయి. తెలంగాణ సాంస్కృతిక ఘనమైన పునరుజ్జీవనం వలెనే, యాదాద్రి నృసింహ స్వామి నుంచి కొండగట్టు ఆంజనేయుని వరకు, ఇంకా మునుముందువి అన్నీ ఘనమైన నిర్మాణాలుగానే సాగుతాయి. హ్రస్వదృష్టి గల కుంచితులు మాత్రమే తమ రాజకీయ హ్రస్వత్వానికి మించి విశాల దృష్టితో, మౌలికస్థాయి నుంచి చూడలేరు.
పైన అన్నట్లు ఇక ఇప్పుడొక కీలకమైన, మౌలికమైన విషయం మిగిలి ఉన్నది. మన దేశంలో మొదటినుంచి పాలించిన పార్టీలు అభివృద్ధి సాధనలో విఫలం కావటం అట్లుంచి, తాము సెక్యులరిజం అనే దాని విషయంలోనూ విఫలమయ్యాయి. తమపై బీజేపీ నిందకు తగినట్లుగానే సూడో సెక్యులరిస్టుగా మారి మైనారిటీల ఓట్లు కొల్లగొడుతూ వచ్చాయి తప్ప, వారి అభివృద్ధి కోసం చేసింది శూన్యమని జస్టిస్ సచార్ నివేదిక చివరికి బెంగాల్లో సైతం తేల్చి చూపించింది. ఆ విధంగా ఒకవైపు అభివృద్ధిరాహిత్య శూన్యంలోకి, మరొకవైపు అర్థవంతమైన సెక్యులరిజపు రాహిత్య శూన్యంలోకి, మతం ప్లస్ సెక్యులరిజపు అపోహలలోకి బీజేపీ తన దీర్ఘకాలిక వ్యూహంతో, నిరంతర ప్రయత్నాలతో, దేశవ్యాప్తంగా ఒక పద్ధతి ప్రకారం ప్రవేశిస్తూ వస్తున్నది. ఈ ప్రవేశక్రమంలో ఇప్పుడు భారతీయ సంస్కృతిగాని, హిందూ ధర్మంగాని ఆమోదించని అనేక అనాగరికమైన పద్ధతులను కూడా అనుసరిస్తున్నది. అంతా హిందూ మతం ముసుగులో కేవలం అధికార సాధనకు, ధనార్జనకు.
కేసీఆర్ చేస్తున్న పని సరిగా ఇక్కడ తిరిగి చర్చనీయాంశమవుతున్నది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన విషయమనేది మొదటిది కాగా, ఇప్పుడు లోతుల్లోకి వెళ్లి దేశానికి వర్తమాన క్లిష్ట స్థితిలో తప్పనిసరిగా అవసరమైన అందరి అభివృద్ధి-కమ్- ఆధ్యాత్మికత-కమ్ -సూడోయిజం లేని నిజమైన సర్వమత సమానతల నమూనా ఒకటి తయారుచేసుకోగలగటం. కేసీఆర్ లక్ష్యం అదని చెప్పటం లేదు. అదేమిటో మనకు తెలియదు కూడా. కానీ తను దేశాభివృద్ధి, సర్వమతాదరణ, ఇంతకాలం ఇతర పార్టీ ల వైఫల్యాల తీరు, దేశ భవిష్యత్తు గురించి స్పష్టంగా చెప్తున్న మాటలు, దేశానికి, మన సమాజానికి బీజేపీ కలిగిస్తున్న హానిపై చేస్తున్న హెచ్చరికలు ఇటువంటి సూత్రీకరణకు, నమూనాకు అవకాశం కల్పిస్తున్నాయి.
–టంకశాల అశోక్