‘వేర్వేరు రాష్ర్టాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా హిందీలోనే మాట్లాడాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో భాషా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే మతాల పేరుతో ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచి అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్న బీజేపీ, ఇప్పుడు భాష పేరుతో పెద్ద అస్ర్తాన్నే ప్రయోగిస్తున్నదని విశ్లేషకుల భావన.
దక్షిణాది రాష్ర్టాల్లో హిందీ భాషపై ఆదినుంచి వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు అమిత్ షా మాటలు వినగానే దక్షిణాది నేతలు తీవ్రంగా స్పందించారు. ‘భారతదేశ భిన్నత్వంపై దాడి’గా ప్రతిపక్షాలు విమర్శించాయి. ‘భారత ప్రజలు ఏం తినాలి, ఏ భాష మాట్లాడాలనేది వారికే వదిలేయాలి. నేను మొదట భారతీయుడిని. ఆ తర్వాతే గర్వించదగిన తెలుగువాడిని, తెలంగాణ వ్యక్తిని. నా మాతృభాష తెలుగు. ఇంగ్లిష్, హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలనడం, ఇంగ్లిష్ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయ’ని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘అమిత్ షా ప్రకటన దేశ సమగ్రతకు గొడ్డలిపెట్టు లాంటిద’ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశానికి జాతీయ భాష లేదు. కేంద్రస్థాయిలో హిందీ, ఇంగ్లిష్ అధికార భాషలుగా ఉన్నాయి. రాష్ర్టాల్లో ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా ఉపయోగిస్తున్నారు. 1960 ప్రాంతంలో రాష్ర్టాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ర్టాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు పెల్లుబికాయి. ఆ తర్వాత 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. అధికార లావాదేవీలన్నిటా హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా వినియోగించడం తప్పనిసరి చేస్తూ ఆ చట్టం తీసుకొచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ వంటి 22 భాషలను ఆయా ప్రాంతాల్లో అధికార భాషలుగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ గుర్తించింది. హిందీ అధికార భాషగా లేని రాష్ర్టాలతో కేంద్రం ఇంగ్లిష్‌లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని నిర్దేశిస్తూ 1967లో అధికార భాషల చట్టాన్ని సవరించారు.
దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడేవారు 60 శాతం మంది ఉంటే.. హిందీ, దానికి దగ్గరగా ఉండే భాషలు మాట్లాడేవారు 40 శాతం మంది ఉంటారు. ఇదిలా ఉంటే హిందీ భాష మాత్రమే దేశాన్ని ఏకం చేయగలదనడం అవివేకం. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసినా, ఉద్యోగావకాశాలకు షరతుగా విధించినా మళ్లీ ఆందోళనలు చెలరేగే ప్రమాదం ఉన్నది. ఏడున్నర దశాబ్దాలుగా భారతదేశం ఒకే ఒక్క అధికారిక భాషను అమలు చేయకుండా మనుగడలో ఉన్నది. భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం.
కర్ణాటక మినహా ఇతర దక్షిణాదిలో బీజేపీ మనుగడ అంతంత మాత్రమే. సమీప భవిష్యత్తులో కూడా దక్షిణాది రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేకపోవడం, గెలిచే అవకాశాలు లేకపోవడం వంటివి కూడా బీజేపీ సృష్టిస్తున్న భాషా వివాదానికి ఒక కారణంగా భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా రెండేండ్ల కంటే తక్కువ సమయమే ఉండటంతో భాషా వివాదాన్ని రాజేసి.. ఉత్తరాదిలో మళ్లీ గెలవాలని బీజేపీ భావిస్తున్నట్లున్నది. అంతేకాకుండా హిందీ ప్రజలు గుజరాతీయుల ఆధిపత్యాన్ని నిరసిస్తారేమోననే భయంతో బీజేపీ ఇప్పుడు ఈ హిందీ భాషా సమస్యను లేవనెత్తినట్లు కనిపిస్తున్నది. అంతేకాకుండా కొత్త వివాదాలను సృష్టించడం ద్వారా దేశంలో అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది.
–ఫిరోజ్ ఖాన్, 96404 66464