దేశంలోని విపక్షాలన్నీ పార్లమెంట్, రాజ్యసభల్లో ఒక్కటవుతున్నాయి. ఆప్, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర 17 పార్టీలు ఇప్పుడు గౌతమ్ అదానీ స్కాం మీద జేపీసీ డిమాండ్ చేస్తున్నాయి.
పార్లమెంట్ లోపలా బయట గొంతు కలపడం శుభపరిణామం. విక్రమార్కుడు-బేతాళుడి మాదిరి బీజేపీ వెంట పడుతామని, విపక్షాల మధ్యన, విపక్షాల తరుపున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఇంతేకాదు, కేంబ్రిడ్జిలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశంలో ప్రస్తుత అప్రజాస్వామ్య విధానాల గురించి మాట్లాడితే తప్పుపడుతూ మంత్రులు, పార్లమెంట్, రాజ్యసభల్లో హంగామా చేయడం, రాహుల్ క్షమాపణ కోరాలని, అదానీ ఇష్యూను పక్కదారి పట్టించే పనిమీద బీజేపీ ఉన్నది. కెనడాలో, చైనాలో, ఇలా ఎక్కడపడితే అక్కడ తాను వచ్చినాకే దేశం అభివృద్ధి చెందిందని, దేశాన్ని కించపరిచేవిధంగా పీఎం మాట్లాడిన పలు విషయాలను ఖర్గే ఈ సందర్బంగా పేర్కొన్నారు.
ఎవరి హయాంలో ఏం జరిగిందో దేశానికీ తెలుసు. రెండుసార్లు ఎన్నికల్లో జనాన్ని మభ్యపెట్టి గెలిచి, ఇదే గొప్ప అనుకుంటే ఎట్లా? ఈ తొమ్మిదేండ్ల పీఎం మోదీ పాలనలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఏ మేరకు విలువ లభించిందో యావత్ ప్రపంచం చూసింది. ప్రపంచంలోని ఏ ఇండెక్స్ చూసి నా మన దేశం వందపైన ర్యాంకుల్లోనే ఉన్నది. ఆకలి, అసమానతలు, నిరుద్యోగం, అధిక ధరలు, ప్రెస్ ఫ్రీడమ్, సంతోషం, అన్నింటిలోనూ వెనకబాటే! ఇది నిజం కాదా! 12 లక్షల కోట్ల రుణమాఫీలు, కార్పొరేట్లకు ఇవ్వలేదా, ఎన్పీఏలు ఎందుకు పెరిగాయి? బ్యాంకుల దివాలాకు ఎవరు బాధ్యులు? ప్రశ్నించే గొంతుకలను జైల్లో పెట్టడం,అధికారంలో ఉన్నవారి మాదిరిగానే ప్రజలచే ఎంపికైన విపక్షాలను కనీసం పార్లమెంట్లో మాట్లాడనీయకపోవడం, మైక్‌లు కట్చేయడాన్ని అప్రజాస్వామ్యం అనకుంటే ఇంకేమంటారు?
దేశ పరిస్థితి 1977 ఎమర్జెన్సీ కన్నా, ఇప్పుడు భిన్నంగా ఉందా? లేదు. అలా ఎక్కడా కూడా కనిపించడం లేదు! వృద్ధ ప్రీస్ట్ స్థాన్ స్వామిని జైల్లో పెట్టి, అనారోగ్యంతో అయన చనిపోవ డానికి కారణం ఎవరు? చేయని నేరానికి 28 నెలలు సిద్ధిక్ కప్పన్ లాంటి జర్నలిస్ట్‌ను జైల్లో ఉంచడాన్ని ఏమంటారు? ఒక ఈడీ అధికారి రాజీనామా చేసి, ప్రజా ప్రతినిధిగా ఎంపికై, ఆ తర్వాత మినిష్టర్ కూడా అయ్యాడు! ఇలా అయితే ప్రజలకు ఎలా నమ్మ కం కుదురుతుంది.
మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి, బీహార్ ప్రస్తుత డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆయన సతీమణి, సోదరీమణులను మొత్తంగా లాలూ కుటుంబాన్ని నాశనం చేయడానికి కేంద్రం పూనుకున్నట్లు ఈడీ, సీబీఐ చేసిన 24 దాడులను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. రైడ్స్ సందర్భంగా ఎవరెవరి వద్ద ఏం దొరికింది, ఏం రికవరీ చేశారు? పంచనామా ఎందుకు చేయరు? గోదీ మీడియాకు లీకులు ఇచ్చుడు దేనికి? ఈడీ, సీబీఐ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొచ్చు కదా! పైనుంచి ఫోన్లు వస్తేనే ఇవన్నీ చేస్తారా! గతంలో గురుగ్రామ్‌లోని వైట్ ల్యాండ్ కంపెనీ వాళ్ల మాల్ మీద దాడులు చేశారు. ఇది తేజస్వీ యాదవ్‌ది అని ‘లీక్’లు ఇచ్చి మీడియాలో వార్తలు పెట్టిస్తారు. ఆ తర్వాత ఈ మాల్ తేజస్విది కాదు, బీజేపీ వాళ్లది, హర్యానా సీఎంకు చెందిన వారిదని తేలుతుంది. వైట్ ల్యాండ్ కంపెనీ స్వయంగా తేజస్వీకి మాల్తో సంబంధం లేదని ప్రకటిస్తుంది. ఇదో ట్రెండ్ అయిపోయింది. దీని బాధితులు ఎక్కువ భ్రమల్లో పడేవారు మిడిల్ క్లాస్ పీపుల్ అయిపోతున్నారు.
అదానీ గురించి వీరికే తెలియదు, ఇక సామాన్యుడికేం తెలుస్తుంది? ఎందుకంటే గోది అలా మీడియా వార్తలను ప్రసారం చేస్తుంది. తమిళనాడులో వలస కార్మికులను చంపుతున్నారని, కొడుతున్నారని, నకిలీ వ్యక్తులకు, చేతులకు, కాళ్లకు, నెత్తికి కట్లు కట్టి ఫొటోలు పెట్టి మరీ, దుష్ప్రచారం చేశారు. ఈ విషయం అబద్ధమని, అవన్నీ ఫేక్ వార్తలని తేలడంతో దీనివెనుకాల 80-20 వర్గాలు, చివరికి కటకటాలు లెక్కించే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో దీన్నిబట్టే స్పష్టమవుతున్నది.
బీహార్‌లో గతంలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర జరిపినపుడు, అప్పటి సీఎం లాలూప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ‘మనుషుల మధ్యన గొడవలు సృష్టించే ఇలాంటి యాత్రలను బీహార్‌లోకి రానివ్వమన్నారు. మనుషులే లేకుండా చేసే గొడవలు ఎందుకు? రేపు ఆ మనుషులే లేకుంటే గుడిలో గంట ఎవరు కొడుతారు! మసీదులో నమాజు ఎవరు చేస్తారు!. మనుషుల మనసుల్లో విషం నింపి, వారే లేకుండా చేసే రాజకీయాలు వద్దు’ అని అన్నారు లాలూ ప్రసాద్ యాదవ్! అందుకే అప్పటినుంచే లాలూ అంటే బీజేపీ, జనసంఘ్, ఆర్ఎస్ఎస్లకు గిట్టదు!
తన మీద, తన కుటుంబసభ్యుల మీద జరిగిన దాడులపై లాలూప్రసాద్ యాదవ్ ట్వీట్ తమను బీజేపీ లొంగదీసుకోవాలని చూస్తున్నదని, ఏం జరిగినా, ఏం చేసినా తలదించేది లేదన్నారు. లాలూకు పూర్తిగా విపక్షాల మద్దతు లభిస్తున్నది. నిజానికి ఈ దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఒక శిక్ష లాంటిదే! ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని నిర్దోషులను ఇబ్బంది పెట్టడంపై దేశానికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. అది ఎంతో దూరం లేదు! ఇదంతా చేస్తూనే పీఎం నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘తనను కిలోల కొద్ది తిట్లు తిడుతున్నారని, తనను సమాధి చేస్తారట, సమాధిని తవ్వుతున్నార’ని విక్టిమ్ కార్డు ఉపయోగిస్తుంటారు!
అసోం సీఎం బిశ్వా శర్మ మీద పుష్కలంగా ఈడీ, సీబీఐ కేసులు ఉన్నప్పటికీ అతన్ని బీజేపీలో చేర్చుకొని, అసోం సీఎంగా చేయడం, కేసుల మీద విచారణ నిలిపివేయడం మీద హోంమంత్రి అమిత్ షాను విలేకరులు ప్రశ్నించారు. అలాంటి ప్రశ్నలు మీరు వేయవద్దని అన్నారాయన. ఈ పరిస్థితుల్లో బీజేపీ వ్యూహం అర్థమై, అర్థం కాకుండా ఉన్నట్టు నటిస్తే కుదరదు.
ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని జీవించే, ప్రశ్నించే హక్కు ఉండాలన్నా, విపక్షాలు పార్లమెంట్లో మాదిరి, బయట కూడా కలిసి ఉండాలి.
– ఎండీ మునీర్
99518 65223
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు)