ఏ ఆటకైనా రిఫరీ తటస్థంగా, నియమబద్ధంగా ఉండాలి. ఏ ఒక్క జట్టువైపు మొగ్గినా అది తొండాట అవుతుంది. ప్రజాస్వామ్యం కూడా అంతే. ప్రజల తీర్పును నిఖార్సైన రీతిలో నమోదు చేయడం అత్యంత కీలకం. ఇందుకు ఎన్నికల వ్యవస్థ, మరీ ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ అనే గురుతర బాధ్యతను నిర్వహించే ఎన్నికల సంఘం (ఈసీ) సందేహాలకు అతీతంగా ఉండాలి. కానీ, ఇటీవలి కాలంలో ఈసీ పనితీరు పదేపదే విమర్శలకు గురవుతుండటం దురదృష్టకరం. మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం గంటగంటకు తారుమారు కావడంపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో ఈసీ ఆలస్యంగా చేస్తున్న ఓటర్ల జాబితా ఉధృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ – క్లుప్తంగా సర్) వివాదాల్లో చిక్కుకున్నది. సర్ పర్యవసానంగా 60 లక్షల పైచిలుకు ఓట్లు గల్లంతు కావడమే ఇందుకు కారణం. అంతిమంగా ఫలితాలపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది పెద్ద ప్రశ్న. ఇదిలా ఉండగానే మరో 12 రాష్ర్టాల్లో సర్ చేపడతామని ఈసీ ప్రకటించడం ప్రకంపనలు సృష్టించింది.
సర్ ప్రక్షాళన మొదటినుంచీ వివాదాల్లో చిక్కుకుంటున్నది. పరిశుద్ధమైన, నిఖార్సైన ఓటర్ల జాబితా రూపొందించడమే సర్ లక్ష్యమని ఈసీ అంటున్నది. కానీ, అసలైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి గల్లంతు చేస్తున్నారని విపక్ష పాలిత రాష్ర్టాలు ఆరోపిస్తున్నాయి. సాధారణ గుర్తింపు పత్రాల ద్వారా జరిగే రొటీన్ సర్వేను పౌరసత్వ పరీక్షగా మార్చివేయడం ఈ మొత్తం తతంగాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టానికి (1950), ఓటర్ల నమోదు నిబంధనలకు విరుద్ధమని కేరళ సీఎం పినరాయి విజయన్ ఎత్తిచూపుతున్నారు. కేరళ అసెంబ్లీ సర్‌ను తిరస్కరిస్తూ తీర్మానం చేసింది కూడా. విపక్ష పాలిత రాష్ర్టాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సర్ ప్రకటనపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల కమిషన్ తీరుపై కేంద్రంలోని బీజేపీ, బెంగాల్‌లోని తృణమూల్ ప్రభుత్వాలకు మధ్య మాటల యుద్ధం వేడెక్కుతున్నది. న్యాయవివాదాల పర్యవసానంగా అసోంలో సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సర్ నిర్వహిస్తుండటం గమనార్హం. సవరణ కోసం కాకుండా మూకుమ్మడిగా ఓట్ల తొలగింపునకు సర్‌ను ఈసీ ఓ ముతక ఆయుధంలా వాడుతున్నదని యోగేంద్ర యాదవ్ వంటి సామాజికవేత్తల విశ్లేషణ. ప్రక్షాళన పేరిట పౌరసత్వ పరీక్షకు తెరతీశారనే ఆరోపణలూ ఉన్నాయి.
ఈసీ పెద్దల నియామక విధానాన్ని కేంద్రం ఏకపక్షంగా మార్చడం సందేహాలకు తావిచ్చింది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. నిష్పాక్షికతకు, పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనంలా ఉండాల్సిన ఈసీ ప్రతిష్ఠ వరుస వివాదాలతో మసకబారుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే భారత్‌కు ఇది శోభించే విషయం ఎంతమాత్రం కాదు. ఓటర్ల జాబితాను కడిగిన ముత్యంలా తయారు చేయడమే ఈసీ లక్ష్యమైతే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అందుకు ఎన్నికల సంఘాన్ని అంతా ప్రశంసించాలి కూడా. అయితే, ఈ క్రమంలో విపక్ష పాలిత రాష్ర్టాలు వివక్షలకు గురికాకుండా, సమాఖ్యవాదం బలి కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నిటి కన్నా ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేయడం ముఖ్యమని ఈసీ గుర్తిస్తే మంచిది.