అంబేద్కర్ ఒక ఆలోచన-ఆచరణ-ఒక ఆత్మగౌరవ నినాదం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యల పరిష్కారంలో అంబేద్కర్ ఆలోచనల ప్రభావం కనబడుతూనే ఉంటుంది. అంబేద్కర్ ఆలోచన విధానం, దృక్పథం మీద నేటికీ అనేక దేశాల్లో చర్చలు, పరిశోధనలు జరుగుతున్నాయి.
దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే ధ్యేయంగా తెచ్చిన దళితబంధు పథకం వేలాది మంది దళితుల తలరాతలను మార్చింది. ఎన్నో కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించగలుగుతున్నాయి. టీ-ప్రైడ్ ద్వారా దళిత పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. నేడు తెలంగాణలో దళితులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఈ ఆత్మగౌరవమే అంబేద్కర్ కోరుకున్నది.
ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో ఇద్దరు మాత్రమే ప్రపంచ మేధావులుగా పేరొందారు. వారిలో ఒకరు కారల్ మార్క్స్ కాగా మరొకరు అంబేద్కర్. ఐక్యరాజ్యసమితి అంబేద్కర్‌ను ప్రపంచ మేధావిగా గుర్తిస్తూ, ఆయన జయంతిని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుతున్నది. ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో, కొలంబియా యూనివర్సిటీలోని లేమన్ లైబ్రరీలో అంబేద్కర్ విగ్రహలను ఆయన స్మృత్యర్థం ప్రతిష్ఠించబడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా.. తన పాలనలో అంబేద్కర్ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని, విజ్ఞానంలో తాను ఎవరి ముందైనా తల దించాల్సి వస్తే అది కేవలం అంబేద్కర్ ముందే అని చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ గొప్పతనానికి ప్రతీక. ఇవాళ భారత ప్రజాస్వామ్యం ఉన్నత స్థాయిలో ఉన్నదంటే అది కేవలం అంబేద్కర్ వేసిన పునాది ఫలితమే.
ఒకవైపు ప్రపంచ దేశాలు అంబేద్కర్‌ను అంత ఘనంగా కీర్తిస్తుంటే మనదేశంలో మాత్రం ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదనే మీమాంస ఉంది. విశ్వమానవుడైన అంబేద్కర్‌ను చేతనంగా, అచేతనంగా ఒక కుల, ఉపకుల సమూహానికి చెందిన నాయకుడిగానే చిత్రించే ప్రయత్నం గత ఏడు దశాబ్దాలుగా భారతదేశంలో జరిగింది. భారతీయ సమాజం కులం పేరుతో స్థిరీకరణకు లోనైంది. నిమ్న కులాలపై అగ్ర కులాలు చూపిన వివక్షకు అంబేద్కర్ సైతం బాధితుడే. ఆయన కుల వ్యవస్థ నిర్మూలనకై జీవితాంతం పోరాడారు. కులం పునాదుల మీద ఒక జాతిని గాని నీతిని గాని నిర్మించలేం అని వ్యాఖ్యానించారు. ఉత్పత్తి కులాలైన, మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించారు. ప్రతీ వ్యక్తికి ఒకే ఓటు-ఒక ఓటుకు ఒకే విలువ అంటూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ఓటు హక్కును కల్పించారు.
మన దేశంలో చాలా మంది తమను తాము గొప్ప దేశ భక్తులుగా అభివర్ణించుకుంటున్నారు. కానీ అంబేద్కర్‌ని మించిన దేశభక్తులు లేరు అనేది వాస్తవం. సమాజం తనపై అత్యంత పాశవికంగా వివక్ష చూపినా, అవమానించినా.. తాను మాత్రం ఎక్కడా వివక్షకు, అసమానతలకు, పక్షపాతానికి తావు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేశారు. అది రాజ్యాంగ రచనలో స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ రచన సంఘంలో ఇతర సభ్యుల సంపూర్ణ సహకారం లేకపోయినా, తన ఆరోగ్యం క్షీణిస్తున్నా.. ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యంగాన్ని అందించారు అంబేద్కర్. సమస్త మానవాళి ప్రగతిని కాంక్షించిన గొప్ప మేధావి అంబేద్కర్. కానీ నేటికీ ఆయనను దళిత వర్గాలకు చెందిన నాయకుడిగానే చూస్తున్నది సమాజం. అంబేద్కర్ త్యాగాన్ని, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని, పోరాట పటిమను భవిష్యత్ తరాలకు అందించడంలో, అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అనే స్ఫూర్తినివ్వడంలో 125 అడుగుల విగ్రహం కీలక పాత్ర పోషిస్తుంది.
అంటరానితనంలో, అతి పేదరికంలో పుట్టి ప్రపంచ మేధావిగా కీర్తిని అందుకున్న అంబేద్కర్ జీవితాన్ని, ఆయన తాత్వికతను ప్రతీ ఒక్కరు అధ్యయనం చేయాలి. ఆచరించాలి. దేశవ్యాప్తంగా అంబేద్కర్‌వాదాన్ని బలోపేతం చేయడంలో హైదరాబాద్ మహానగరం వేదిక కానుంది. అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తున్న తెలంగాణ యావత్ భారతావనికి రోల్‌మాడల్. కేసీఆర్ నాయకత్వం యావత్ దేశానికే స్ఫూర్తిదాయకం.
(వ్యాసకర్త: వైస్ ఛాన్సలర్, కాకతీయ యూనివర్సిటీ)
ప్రొఫెసర్ తాటికొండ రమేష్