తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలనే బలమైన ఆకాంక్ష వెనుక ఓ సుదీర్ఘ నేపథ్యం ఉన్నది. ఇది ఒక్క రోజులోనో, ఒక్క సంఘటనతోనో, కొద్దికాలపు వివక్షతోనో ఏర్పడిన భావన కాదు. రాష్ట్రం ఏర్పాటు కోసం చావో రేవో అన్న పద్ధతిలో జనం కొట్లాడటం వెనుక 70 ఏండ్ల దుఃఖం ఉన్నది. కాంగ్రెస్ పాలనలో ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన అన్యాయాలన్నీ, ఒకదానికి ఒకటి తోడై ప్రజలు ఉద్యమించక తప్పని పరిస్థితిని సృష్టించాయి.
అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో అత్యంత వ్యూహాత్మకంగా, ప్రజాస్వామ్యయుతంగా సాగిన తుదిదశ పోరాటం ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చే వరకు తెలంగాణ నేల నిరంతర ఉద్యమాలతో రగిలిపోయింది. నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర కాంగ్రెస్‌పార్టీ చేతుల్లో కీలు బొమ్మలుగా మారి నిధులు, నియామకాలు, ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, పదవులు, వనరులు..ఇలా అన్నిట్లో అన్యాయం జరిగినా పట్టించుకోలేదు. కేటాయింపులన్నీ ఆంధ్రా ప్రాంతానికి తరలి పోగా. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతం అన్న ముద్ర మిగిలింది. అయినా నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరెత్తలేదు.
గోదావరి, కృష్ణ నదులు తెలంగాణ నుంచే ఆంధ్రకు వెళ్లాలి. తెలంగాణలో ప్రాజెక్టులు కడితే, నీళ్లను తమకు ఇష్టమున్నట్లు వాడుకోవడం కుదరదని నాటి ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు భావించారు. అందుకే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టులను మూలకు పడేసి, ఆంధ్ర, రాయలసీమకు ఉపయోగపడే ప్రాజెక్టులు మాత్రమే నిర్మించుకున్నారు. దీని ఫలితంగా గోదావరి,కృష్ణ నదుల నీళ్లను ఆంధ్ర, రాయలసీమకు తరలించుకుపోవడం సులభమైంది. రెండు నదులపై నదీ పరీవాహక ప్రాంతం తెలంగాణ లో ఎక్కువ ఉన్నప్పటికీ, సాగుభూమి, వ్యవసాయ దిగుబడులు ఆంధ్రలో ఎక్కువ రావడానికి నీళ్ల తరలింపే ప్రధాన కారణం. అలాంటి తెలంగాణలో మా ర్పు కోసం పోరాటం తప్పలేదు. అలాంటి సమయం లో తెలంగాణకు జరుగుతున్న సకల అన్యాయాలకూ విరుగుడు స్వరాష్ట్ర సాధనే అని తేల్చి చెప్పిన నాయకు డు కేసీఆర్. తెలంగాణకు నీళ్లు, నియామకాలు, నిధు ల విషయంలో న్యాయం జరగాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాల్సిందేనని గట్టిగా పిలుపునిచ్చారు.
నేడు ఎన్నికల సమయంలో గగ్గోలు పెడుతున్న కాం గ్రెస్‌ను చూస్తే జాలేస్తున్నది. నాడు తెలంగాణకు నీళ్ల విషయంలో వారు చేసిన అన్యాయం వర్ణించలేం. ఆం ధ్ర ప్రాంతంతో కలిస్తే నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని 1956కు ముందే మేధావులు, నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫజల్ అలీ కమిషన్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. తెలంగాణలో ప్రవహించే నదులపై హక్కులు పోతాయ నే భయం తెలంగాణ ప్రజల్లో నెలకొని ఉన్నదని ఫజల్ అలీ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది. అందుకే, హైదరాబాద్ రాష్ట్రంలో తలపెట్టిన నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని కమిషన్ సూచించింది. భారత పార్లమెంటు కూడా దీన్ని ఆమోదించి, హైదరాబాద్ రాష్ట్రం తలపెట్టిన ప్రాజెక్టుల ను పూర్తి చేయడానికి హామీ ఇచ్చిం ది. కానీ ఇవేమీ కుటిల కాంగ్రెస్ హయాంలో అమలు కాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదికున్న పరీవాహ ప్రాంతంలో 79 శాతం తెలంగాణలో, 21శాతం ఆంధ్రలో ఉంటే, కృష్ణానది పరీ వాహక ప్రాంతం 68.5 శాతం తెలంగాణలో 18.39 శాతం రాయలసీమలో, 13.11 శాతం కోస్తాంధ్ర లో ఉన్నది. ఇదే నిష్పత్తిలో నీటి వాటాలుండి, వాటిని వాడుకునేందుకు ప్రాజెక్టుల నిర్మాణం జరిగి ఉంటే, సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండేది కాదు.కానీ నదులు పారేది తెలంగాణలో వాటి ప్రతి ఫలాలు మాత్రం ఆంధ్ర ప్రాంతం వారికి దక్కడంతో తెలంగాణ ఎంతో నష్టపోయి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ.
కంటికి నీళ్లు కరువురా నా తెలంగాణ పల్లెలో
కడుపున జిల్లేడు మొలిసెరా నా తెలంగాణ పల్లెలో
అని ప్రజాకవి జయరాజు నాటి తెలంగాణలో అర వై ఏండ్లకు పైగా సాగిన దుఃఖాన్ని కండ్లకు కట్టారు.
గోదారి గోదారి ఓ పారేటి గోదారి
చుట్టూ నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి
ఈ భూమి నా తెలంగాణ భూమి అని యశ్పాల్ రాసిన పాట నాడు నీళ్ల విషయంలో జరిగిన వివక్షను కండ్లకు కట్టింది. నాడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది. నేడు కేసీఆర్ ముందు చూపు తో రైతుల కోసం గోదావరి మీద కాళేశ్వరం నిర్మిస్తే నేటి కాంగ్రెస్ నాయకులు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ బోగస్ మాటలు మాట్లడుతున్నా రు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం సాగిన పోరాటంలో వేలాదిమంది యువకులు బలిదానాలు చేసుకోవడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగల్లాగా చొరబడి పచ్చటి తెలంగాణలో నెత్తురు పారించాలని చూస్తున్నారు. అందుకే తెలంగాణ కవు లు, కళాకారులు, మేధావులు ఏకమవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
తెలంగాణను అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. వీరి ఆరోపణలు చూస్తుంటే దయ్యాలే వేదాలు వల్లించినట్టున్నాయి. ఈ దొంగలకు తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదు. అధికార దాహంతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే నవ్వొస్తుంది. స్కాంల కాంగ్రెస్ స్కీంల పేరుతో చేసే జిమ్మిక్కులను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నది గుర్తించాలి. 70 ఏండ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏమి చేయలేని కాంగ్రెస్‌ను ప్రజలు పాతరేయాలి.
జీ రాజేశ్ నాయక్
96035 79115