డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన నాటి నుంచి అనేక అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నారు. ప్రపంచ ఆధునిక ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పనామా కాల్వ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచ పటంలో సెంట్రల్ అమెరికాలో ఉన్న దేశమే పనామా! 16వ శతాబ్దం నుంచి స్పానిష్ కాలనీగా ఉండి 1821 దాకా కొనసాగింది. ఆ తర్వాత కొలంబియా, వెనిజులా, ఈక్విడార్లతో రిపబ్లిక్ గ్రాన్ కొలంబియాలో భాగంగా ఉన్నది. 1903లో స్వతంత్ర దేశంగా అవతరించింది.
శతాబ్దాల అనంతరం పనామా కాల్వను వెనక్కు తీసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. దీంతో పనామా కాల్వ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి యావత్ ప్రపంచానికి కలిగింది. 1513 నుంచి అనేక దేశాలు, వ్యక్తులు, సాహసికులు ఈ ప్రయత్నాలు చేశారు. పనామా దగ్గర ఉన్న ఇస్తుమన్ను బల్బో దాటారు. 1534లో 5వ రోమన్ చక్రవర్తి చార్లెస్ పనామా కాల్వ సర్వేకు ఆదేశించారు. స్పెయిన్ నుంచి పెటా దాకా రవాణాకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. 1668లో ఇంగ్లిష్ తత్వవేత్త, వైద్యుడు సర్ థామస్ ఇస్తుమన్ దగ్గర పనామా కాల్వ నిర్మాణం అనుకూలమని ప్రతిపాదన చేశాడు. ఇట్లా అనేక ఏండ్లు పనామా ఆలోచనలు కొనసాగాయి. రాజ్యాలు, వ్యక్తులు, పరిశోధకులు ఈ ఆలోచనలను కొనసాగించారు. మనిషి పట్టుదల, సాహసానికి కూడా పనామా కాల్వ నిర్మాణం నిదర్శనం.
1870లో అప్పటి అమెరికా అధ్యక్షుడు యూలిసెస్ ఎస్.గ్రాంట్ కెనాల్ కమిషన్ ఏర్పాటుచేశారు. చీఫ్ ఇంజినీర్ ఆండ్రూ వంటి వారితో కూడిన ఈ కమిషన్ సెంట్రల్ అమెరికాలో నికరగ్వా దగ్గర అనువైన మార్గాన్ని ప్రతిపాదించింది. 1881లో ఎన్నో అవాంతరాల తర్వాత మళ్లీ ప్రయత్నాలు కొనసాగాయి.
ఎత్తయిన కొండల మధ్య నిర్మాణం కష్టసాధ్యమైంది. కొండలను తొలచటం, పనామా అడవుల్లోని విషకీటకాలు, దోమల ధాటికి నిర్మాణంలో శ్రామికులు మృత్యువాతపడ్డారు. ఖర్చు తడిసి మోపెడు కావటం, కొండలను తొలచటం వృథా అని నిర్ణయానికి వచ్చిన ఫ్రాన్స్ కంపెనీ 1889లో ఈ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నది. తదనంతరం అమెరికా 1904లో పనామా కాల్వ నిర్మాణ సారథ్యం స్వీకరించింది. ఈ సారి వినూత్న ఆలోచనలు చేసింది. సాంకేతిక పాటవాన్ని ఉపయోగించి మానవ మేధకు పదును పెట్టింది. సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణల్లో ముందుండే అమెరికా ఈ సారి విజయతీరాలను పనామా చేరుకొనేటట్లు అద్భుత నిర్మాణ ప్రతిభను ప్రదర్శించింది. లిఫ్ట్ పద్ధతి ద్వారా ఒక కృత్రిమ కాల్వను నిర్మించి నీళ్లను లిఫ్ట్ చేసి ఓడలను పైకి, కిందికి దింపే పద్ధతి, గేట్లు మూయడం, తెరవడం ద్వారా ఒక ఆధునిక ఇంజినీరింగ్ పద్ధతిని ప్రవేశపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ సముద్ర మట్టానికి 85 అడుగులు ఎత్తున దీన్ని నిర్మించారు. 1914లో పనామా కాల్వను ప్రారంభించారు. 1977లో టారిజోస్-కార్టర్ ఒప్పందం చేసుకోవటం ద్వారా పనామా కాల్వ నిర్వహణను ఒక అథారిటీ నిర్వహిస్తున్నది. ఈ మార్గం గుండా ఏటా 14 వేల షిప్లు వెళ్తూ ప్రపంచ వాణిజ్య వికాసాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ప్రధానంగా అమెరికా, చైనా, చిలీ, జపాన్, దక్షిణ కొరియా దేశాలు పనామా కాల్వను గణనీయంగా ఉపయోగించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే పనామా కాల్వ నిర్మాణం గురించి తెలుసుకోవడం కుడా ఒక చరిత్రే.
33 ఏండ్ల కల పనామా కాల్వ నిర్మాణం. దీని నిర్మాణంలో 27,600 శ్రామికులు మృత్యువాత పడ్డారు. 200 క్యూబిక్ మెట్రిక్ టన్నుల మట్టిని ఎత్తిపోశారు. విష కీటకాలు, మలేరియా బారినపడి వేలాది శ్రామికులు ఆ మట్టిలోనే కలసిపోయారు. ఇంతటి ఘన చరిత్రను సొంతం చేసుకున్న పనామా కాల్వను డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకుంటానని ప్రకటిస్తున్నారు.
చైనా ప్రాబల్యం పనామా కాల్య నిర్వహణలో పెరిగిపోతున్నదని అమెరికా అక్కసు వెళ్లగక్కుతున్నది. అయితే పనామా కాల్వ నిర్వహణలో చైనా భాగస్వామ్యం ఏమీ లేదు. పోర్టుల నిర్మాణంలో హాంకాంగ్ కంపెనీలు పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే. అది వాణిజ్య అంశం వ్యాజ్యం కాదు. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏ దేశ కంపెనీలైనా నిర్మించవచ్చు. ఎవరూ ఆక్షేపించలేరు. అందుకే ట్రంప్ అన్ని దేశాల్లో తలదూరుస్తూ తన మాట నెగ్గించుకోవాలన్న పంతం వీడనాడాలి.
అయితే, పనామా కాల్వ ద్వారా ఆ దేశం భారీగా సుంకాలు రాబడుతున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. తన సరుకు రవాణా స్వయం పెరుగుతున్నదని అమెరికా కొత్త రాగం ఎత్తుకున్నది. పనామా కాల్వను తిరిగి తీసుకుంటామని, అమెరికా ఆధిపత్య ప్రకటన చేసింది. అయితే, ఎప్పుడో పనామా దేశానికి ఒప్పందం ద్వారా ఇవ్వబడిందని అమెరికా మర్చిపోయింది. ఈ దురహంకార ప్రకటనను పనామా తీవ్రంగా ఖండించింది. పనామా కాల్వ పనామా నేలపై పారుతుందని ఇది అమెరికా సొత్తు కాదని గట్టిగా బదులిచ్చింది. పనామా కాల్వలోని ప్రతి చదరపు మీటర్, దాని చుట్టుపక్కల ప్రాంతం కూడా తమదేనని, పనామా సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆ దేశ అధ్యక్షుడు బోస్ రౌల్ మునిలో బదులిచ్చాడు. పనామా కాల్వ భారీ ఓడల సరుకు రవాణాకు కీలకం. అందుకే దీన్ని ‘దుబాయ్ ఆఫ్ లాటిన్ అమెరికా’ అంటారు. పనామా కాల్వను విస్తరించడానికి కోట్ల డాలర్లను పనామా వెచ్చిస్తున్నది. ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండటానికి పనామా కాల్వ సైజులో ఓడలు నిర్మిస్తున్నారు. భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా పనామాకు సన్నిహితంగా మెలుగుతున్నదని అమెరికా భావిస్తున్నది. ఇది అమెరికాకు మింగుడు పడటం లేదు.
ఏటా పనామా కాలువ ద్వారా రూ.23 లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతున్నది. ఇంతటి వాణిజ్య ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఈ కాలువను చైనా బూచి చూపించి అమెరికా తాను స్వాధీనం చేసుకుంటానంటున్నది. హాంకాంగ్ కంపెనీలు పోర్టులను నిర్వహిస్తుండటం అమెరికా జీర్ణించుకోవడం లేదు. ఏటా 14 వేల ఓడలు ప్రయాణిస్తూ అందులో 72 శాతం వాటా అమెరికా షిప్పులే వెళ్తుంటాయి.
పనామా భారీగా సుంకాలు విధిస్తున్నదని చెప్తూ, దాని నిర్వహణను చైనాకు ఇచ్చారని ఒక కట్టు కథను అల్లి నమ్మింప జూస్తున్నది. హాంకాంగ్ కంపెనీలు పోర్టులను నిర్వహిస్తున్నాయని, ఇది చైనా ప్రాబల్యాన్ని పనామా ప్రోత్సహించడమేనని వాదిస్తున్నది. తాము నిర్మించి ఇచ్చింది చైనాకు ఇవ్వటానికి కాదని ట్రంప్ ప్రేలాపన. నిజానికి ఇప్పటికీ పనామా కాలువను పనామాయే నిర్వహిస్తున్నది. అది ఎవరి సొత్తు కాదు.
(వ్యాసకర్త: ఆర్థిక శాస్త్ర ఉపన్యాసకులు)
-డాక్టర్ సుంకర రమేశ్
9492180764