యూరియా కొనాలంటే ముందు స్మార్ట్‌ఫోన్ కొనాలి. ఆ స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్లను రైతు ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాతే వ్యవసాయం మొదలుపెట్టాలి. అప్పుడే ఎరువులు కొనుక్కోవాలి. ఇది నేను చెప్తున్న విషయం కాదు, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్తున్నది. రైతులకు సకాలంలో యూరియాను అందించలేని రేవంత్ సర్కార్ యూరియా కొనుగోలుకు ‘యాప్’ పేరిట కొత్త నాటకానికి తెరదీసింది. ఖరీఫ్‌లో యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం, చెప్పులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు లైన్లలో పెట్టిన దృశ్యాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
కాంగ్రెస్ అసమర్థత కారణంగా రబీలో కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉన్నది. అప్పటి మీడియా కథనాలతో తీవ్ర విమర్శలను, ప్రజాగ్రహాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి రైతుల వెతలు మీడియాలో కనపడకుండా జాగ్రత్తపడి, తన బాధ్యత నుంచి తప్పించుకునే కుట్రలో భాగంగానే ఈ యాప్‌ను ముందుకు తీసుకువచ్చింది. అంతే తప్పితే, రైతుల సమస్యల పరిష్కారం కోసం కాదు. యూరియా కొరతను, రైతుల క్యూలైన్లను ప్రపంచానికి కనబడకుండా చేసేందుకు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నం ఇది. ఈ యాప్ వల్ల రైతులకు ఇప్పుడున్న ఇబ్బందులకు తోడు కొత్త కష్టాలు ఎదురవుతాయనడంలో సందేహం లేదు.
ఈ యాప్‌తో రైతులు తమ ఇంటినుంచే యూరియాను బుక్ చేసుకోవడం ద్వారా దుకాణాల వద్ద రద్దీని తగ్గించవచ్చు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడం, అర్హులైన రైతులకు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు అందించవచ్చని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, రాష్ర్టానికి సరిపడా యూరియాను అందుబాటులో ఉంచితే దుకాణాల దగ్గర రద్దీ ఎందుకుంటుంది? బ్లాక్ మార్కెట్లోకి ఎందుకు వెళ్తుంది? దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటి.. అవసరానికి సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచడం లేదనే కదా? ఇక యూరియా కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ యాప్ నుంచే బుకింగ్ చేసుకోవాలన్న నిబంధనలు పెట్టారు. ఇది చాలా దారుణం. ఒక సాధారణ, నిరక్షరాస్యుడైన రైతు ఈ రోజు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాడా? వాడినా ఈ యాప్‌ను ఎలా ఆపరేట్ చేయాలో అతనికి తెలుసా? యాప్‌లో ఎరువులు బుక్ చేసుకోవాలంటే ప్రతీ రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. దాన్ని ఆపరేట్ చేయడం రావాలి. ఇది సాధ్యమా? ఇంట్లో చదువుకున్న పిల్లలుంటారు కదా అంటారేమో? పిల్లలు చదువుల కోసం, ఉద్యోగాల కోసం నగరాలకు వలసవెళ్లిన వారి పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించిందా?
ఈ యాప్‌లో బుక్ చేసుకున్న 24 గంటల్లోగా రైతులు యూరియా తీసుకోవాలి. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఆ సమయానికి వెళ్లలేకపోతే, ఆ బుకింగ్ రద్దవుతుంది. తిరిగి మళ్లీ యూరియాను బుక్ చేసుకోవాలంటే 15 రోజులు ఆగాలనే కఠిన నిబంధన పెట్టారు. ఆలోపు పంట దెబ్బతింటే ఎవరు బాధ్యులు? ఇదంతా, యూరియా అందుబాటులో ఉన్నప్పటి పరిస్థితి. అసలు యూరియానే అందుబాటులో లేకుంటే ఎట్లా? ఇక్కడ మరొక ముఖ్యాంశం కౌలు రైతులు. యాప్ ద్వారా యూరియా బుక్ చేయాలంటే ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తక వివరాలు తప్పనిసరి. మరి కౌలు రైతులకు ఎరువులు ఎలా? కౌలు రైతులకు యజమానులు తమ ఆధార్, పట్టాదార్ వివరాలు ఇవ్వరు. కౌలు రైతుల కోసం యజమానులు చొరవ తీసుకొని ఎరువులను ఆన్లైన్లో బుకింగ్ చేసే అవకాశాలుండవు. ఇప్పటికే వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఆధార్, పట్టా పాస్‌బుక్‌లు అడుగుతుండటంతో కౌలు రైతులు ప్రైవేటుకు అమ్ముకోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం తాజా నిబంధన వల్ల ఇప్పుడు కౌలు రైతులు అసలు పంట పండించే పరిస్థితే లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. గతంలో ప్రైవేట్ షాపుల్లో ఎవరికైనా, ఎంతైనా అమ్మే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు సాగు విస్తీర్ణం కంటే ఎక్కువ అమ్మితే డీలర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. దీనివల్ల కౌలు రైతులకు అసలు యూరియా దొరికే వెసులుబాటే లేకుండా పోతున్నది.
పంటరకాన్ని బట్టి ఒక్కో ఎకరానికి ఇచ్చే యూరియా బస్తాల సంఖ్యపై ప్రభుత్వం స్పష్టమైన పరిమితులు విధించింది. వరి ఎకరానికి 2.5 నుం చి 3 బస్తాలు, మిర్చి అయితే 5 బస్తాలు, మక్క అయితే 3 బస్తాలు, వేరే పంటలకు 2 బస్తాలు ఇస్తారట. ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు ఒకే విడతలో యూరియా ఇస్తారు. పెద్ద రైతులైతే (5-20 ఎకరాలు) 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 విడతల్లో తీసుకోవాలి. ఇక రైతు యాప్‌లో యూరియా ను బుక్ చేసుకునేటప్పుడు తన గ్రామం లేదా మండలంలోని కేంద్రాలను ఎంచుకోవచ్చు. పంపిణీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా లు, అగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డీలర్ షాపుల్లో యూరియాను అమ్ముతారు. ప్రైవేట్ డీలర్లు కూడా ఈ యాప్ ద్వారానే యూరియాను విక్రయించాలని ప్రభు త్వం ఆదేశించింది. యాప్‌లో బుకింగ్ ఐడీ రైతు చూపిస్తేనే వారు యూరియా ఇవ్వాలి. డీలర్లు తమ వద్ద ఉన్న నిల్వలను ఎప్పటికప్పుడు యాప్‌లో అప్డే ట్ చేయాలి. దీనివల్ల ఏ షాపులో ఎంత యూరియా అందుబాటులో ఉన్నదో రైతులకు ముందే తెలుస్తుంది. అయితే, యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన మొదటిరోజే దాదాపు అన్ని షాపుల్లో ‘నో స్టాక్’ అని పెట్టారు. అలాంటప్పుడు రైతు ఎక్కడికెళ్లి యూరియాను కొనుక్కోవాలి. తమ ప్రాంతంలోని డీలర్ల వద్దకు స్టాక్ వచ్చే వరకు ఆగాల్సిందేనా? అట్లయితే, పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంటుందా?
యూరియా యాప్‌లో అత్యంత కీలక అంశం యూరియా పొందాలంటే రైతు సాగు చేస్తున్న పంట వివరాలు సిస్టంలో ఉండాలి. పంట వివరాలను నమోదు చేసే బాధ్యత పూర్తిగా వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో)లపై ఉంటుంది. వీరు ప్రతీ సీజన్లో గ్రామాల్లో పర్యటించి, ఏ రైతు ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశారో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఈ డాటా ఆధారంగానే రైతుకు ఎన్ని బస్తాల కోటా ఇవ్వాలనేది యూరియా ‘యాప్’లో కనిపిస్తుంది.
సాధారణంగా పంట వేసిన ప్రారంభ దశలో యూరియా అవసరం. కానీ, ఏఈవోలు పంట నమోదు చేయడానికి సమయం పడుతుంది. పంట నమోదులో ఆలస్యమైతే యూరియా యాప్‌లో రైతు కోటా కనిపించదు. యూరియాను కొనలేడు. అంటే అర్హత ఉన్నా రైతుకు యూరియా అందదు. ఏఈవోలు సీజన్ ప్రారంభంలోనే పంటల నమోదుకు ప్రయత్నించినా, ఒక్కో రైతు ఒక్కో సమయంలో పంట వేయడం వల్ల సాధ్యం కాదు. మరో అంశం ఏమంటే, రైతులు ఒక సీజన్లో ఒక పంట, మరొక సీజన్లో మరో పంట వేసినప్పుడు కూడా ఏఈవోలు వెనువెంటనే పంట నమోదు పూర్తిచేయాలి. ఒక రైతు ఖరీఫ్‌లో వరి వేశాడనుకుందాం.. అప్పుడు అతను ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా కొనుక్కోవచ్చు. అయితే, రబీలో అతడు అదే స్థలంలో మిర్చీ పంట (మిర్చీకి ఎక్కువ యూరియా అవసరం) వేస్తే.. ఏఈవో వెంటనే దాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయాలి. లేకపోతే రైతుకు వరి కోటా ప్రకారమే యూరియా కోటాను నిర్ణయిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసం అని చెప్పి తీసుకువచ్చిన యాప్‌తో ఇన్నిరకాల సమస్యలున్నాయి. రైతుల గురించిన సోయి ఉంటే ఈ సమస్యలన్నీ రేవంత్ సర్కారుకు అర్థమయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతోని మాట్లాడి రైతులకు అవసరమైనంత మేర యూరియాను తీసుకురావాలి. అది చేయలేకనే ఈ యాప్‌ను రైతులపై బలవంతంగా రుద్దుతున్నది. ముమ్మాటికీ ఇది సరైన పద్ధతి కాదు. రేవత్ సర్కారు ఈ యూరియా యాప్‌పై పునరాలోచించుకోవాలి.