‘రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తే, రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు’ అన్నట్టే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే తడాఖా చూపిస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వంటి వారు బహిరంగంగానే హెచ్చరిస్తుంటే, రేవంత్ ఒంటెత్తు పోకడలతో చాలా మంది శాసన సభ్యులు లోలోపలే రగిలిపోతున్నారు. చివరకు నామినేటెడ్ పదవుల్లో సైతం టీడీపీ నుంచి వచ్చిన తన పాత స్నేహితులకు తప్ప, అసలైన కాంగ్రెస్ వారికి ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న అసంతృప్తి వారిలో
పెద్దఎత్తున పెరుగుతున్నది.
అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైరైన ఉద్యోగులకు రెండున్నరేండ్లు గడిచినప్పటికీ వారి కష్టార్జీతమైన డబ్బును వారికి చెల్లించే పరిస్థితి లేదు. ‘క్యాన్సర్ బారిన పడ్డాం, చికిత్సకు డబ్బు కావాలి’ అని రోజూ సచివాలయం చుట్టూ తిరిగిన మాజీ ఉద్యోగులు ఎందరో ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల చెల్లింపులపై ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా తొలుత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, రిటైరైన వారికి చెల్లించాల్సినవి చెల్లించని ప్రభుత్వ వైఖరిని నిలదీసిన హైకోర్టు.. సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని మందలించడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇక, ‘నన్ను కోసినా రూపాయి రాదు’ అని సీఎం స్వయంగా ప్రకటించడంతో సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో ఆశలు మరింత సన్నగిల్లాయి. చివరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు వస్తున్నాయి.. హమ్మయ్య అనుకొనే పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది… దిగజార్చారు.
హైడ్రా పెను విధ్వంసం
కాంగ్రెస్ సగం పదవీ కాలం పూర్తి కాకముందే ప్రజల్లో ఆసక్తికరమైన వైఖరి కనిపిస్తున్నది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూసే వారు క్రమంగా ఎక్కువవుతున్నారు. దీనికి కారణం రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరుగడమే. హైడ్రా పేరుతో ప్రభుత్వం సృష్టించిన పెను విధ్వంసం.. బాధిత ప్రజలు పాలకులకు శాపనార్థాలు పెట్టడమే కాదు.. ఎన్నికలు వస్తే తడాఖా చూపిస్తాం అనే స్థాయికి చేరింది.
ఇప్పుడు రాష్ట్రంలో సకల జనులు ‘కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశాం’ అనే భావనలోకి వచ్చాయి. ‘కేసీఆర్ అన్నా.. నువ్వు మళ్లీ రావాలి’ అంటూ కెమెరాల ముందు ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలే ఇందుకు రుజువు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా ఒక సీఎంను ప్రజలు ఇంతలా తిట్టలేదు. ‘నేను శాడిస్ట్‌ను. ఎవరైనా బాధతో తిడుతుంటే నాకు సంతోషంగా ఉంటుంది’ అనడం రేవంత్ మనస్తత్వాన్ని తెలియజేస్తున్నది. గతంలో వైఎస్సాఆర్‌కు సన్నిహితంగా ఉండి, ఇప్పుడు ఒక సర్వే సంస్థను నిర్వహిస్తున్న వారితో ఏడాది కింద ట కలిశాను. ప్రజల్లో చాలా వేగంగా ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడినట్టు వాళ్లు చెప్పారు. ఇటీవల మీడియా సంస్థలతోపాటు పలు ఇతర సంస్థలు జరిపిన సర్వేలు కూడా కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నదని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పాయి.
కేసీఆర్ హయాంలో బంగారు తునక తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా రైతులకు మేలు జరిగింది. భూముల ధరలు పెరిగాయి, నీటి సౌకర్యం పెరిగి సాగు బాగయ్యింది. ఒకప్పుడు కరువుకు చిరునామాగా నిలిచిన తెలంగాణ, తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లోనే మొదట వ్యతిరేకత మొదలైంది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని ఆశపెట్టి, అందరికీ చేయలేదు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. రైతుబంధు అమలు అంతంత మాత్రమే. భూముల ధరలు పడిపోవడమే కాదు.. అసలు కొనేవాళ్లు లేరు. అమ్మకాలు కొనుగోళ్లు పడకేశాయి. అవసరమైతే ఎకరం పొలం అమ్మి బిడ్డ పెండ్లి చేస్తాను అనే ధీమా గతంలో రైతుల్లో ఉండేది. ఇప్పుడా ధీమా కనిపించడం లేదు. 6 గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పి, రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అతీగతీ లేదు. అశోక్‌నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ కి రాహుల్ గాంధీ వచ్చి ఎన్నికల ముందు ‘మీకు నేను అండగా ఉంటాను, పిలిస్తే వస్తాను’ అని హామీ ఇచ్చారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి యువత మద్దతుతో అధికారంలోకి వచ్చారు. తీరా ఇప్పుడు ఆ హామీని మర్చిపోవడమే కాదు.. ప్రశ్నించిన ఆ నిరుద్యోగ యువత మీదే లాఠీఛార్జ్ చేస్తున్నది ఈ ప్రభుత్వం.
బీఆర్ఎస్ ఇండ్లనే పంచుతూ..
రాష్ట్రంలో ప్రజల సంఖ్యను మించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసినట్టు ప్రకటనలు వస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కొత్త ఇండ్ల నిర్మాణం అనేది జరుగడంలేదు. గత ప్రభుత్వ హయాంలో చివరి దశలో ఉన్న ఇండ్లు, పూర్తి అయిన ఇండ్లకు ఇప్పుడు రంగులు వేసి ఇవ్వడం తప్ప కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగడంలేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని కేటీఆర్ సవాల్ చేస్తే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మిగిలిన రెండున్నరేండ్లలో రికార్డు స్థాయిలో ఇండ్లు నిర్మిస్తాం అంటూ ప్రతిసవాల్ విసిరారు. దీన్నిబట్టి కేటీఆర్ చెప్పినట్టే హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదు అని ఒప్పుకున్నట్టేగా! కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని, చివరకు తులం ఇత్తడి కూడా ఇవ్వడం లేదు. బాలింతలకు గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పథకం ఎత్తేశారు. మహిళకు రెండున్నర వేలు, వృద్ధాప్య పింఛన్ నాలుగు వేలు అని హామీ ఇచ్చి.. చివరకు ‘సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయని అనుకున్నాం.. అవేమీలేవు అందుకే హామీలు అమలు చేయడం లేదు’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
‘ఎన్నికల సమయంలో ఇన్నేసి హామీలు ఇస్తున్నారు అమలు ఎలా సాధ్యం?’ అని భట్టి విక్రమార్కను మీడియా ప్రతినిధులు అడిగితే ‘మా పార్టీలో చాలా మంది ఆర్థిక నిపుణులు ఉన్నారు, హామీలు అమలు చేస్తాం, ఎలా అమలు చేయాలో మాకు తెలుసు’ అని గొప్పలకు పోయారు. మరి పదవీ కాలం సగం పూర్తైనా ఒక్క ఆర్ధిక నిపుణుడి జాడ మాత్రం కనిపించడం లేదు. చదువుకునే అమ్మాయిలను సైతం స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ మోసం చేసింది. చివరకు కాంగ్రెస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకొన్న మీడియాను సైతం మోసం చేశారు. జర్నలిస్ట్‌లకు పెన్షన్, ఆరోగ్య బీమా, మరణిస్తే ఐదు లక్షలు అని హామీ ఇచ్చి పాలకులతో పాటు నాయకులూ మరిచిపోయారు.
పబ్బం గడపడానికే అన్ని వర్గాల్లోనూ పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన కాంగ్రెస్ నాయకులు ‘దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి’ అన్నట్టు తమకు కావలసిన వాటిపైదృష్టి పెట్టారు.
పరిపాలన చేతగాని సీఎం రేవంత్.. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ‘హిట్లర్ నాకు ఆదర్శం’ అంటూ వివాదాస్పద ప్రకటనలతో కాలం గడుపుతున్నారు. ప్రజలు, రైతులు, మహిళలు, యువత చివరకు సొంత పార్టీ వారిలో సైతం అసంతృప్తి కనిపిస్తున్నప్పటికీ, రేవంత్ రెడ్డి మాత్రం హై కమాండ్ సంతృప్తి పడితే చాలు అనుకుంటున్నారు. తేడా వస్తే బడేబాయ్ నరేంద్రమోదీ.. ‘మాతో వచ్చేయ్!’ అని రేవంత్ రెడ్డికి బహిరంగంగానే సభలో ఇచ్చిన పిలుపు ఎలాగూ ఉన్నది. మధ్యలో ఇబ్బంది నమ్ముకొన్న కాంగ్రెస్ వాదులకే. దీంతో ఎవరికి వారు సర్దుకుంటూ 2028లో జరిగే ఎన్నికల కోసం ప్రజలతో సహా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకొన్న రేవంత్ సర్కార్.. రేపు బస్సు యాత్రలో కేసీఆర్, పాదయాత్రలో కేటీఆర్ చేసే విమర్శలతో ఇంకా ఏ స్థాయిలోకి జారిపోతుందో
కాలమే సమాధానం చెప్తుంది.
బుద్ధోదయం
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన 60 నెలల గడువులో ఇప్పటికే సగం కాలం పూర్తయింది. మిగిలింది మరో 30 నెలలు. చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం. అప్పుడు ఎవరి మాట ఎవరూ వింటారో తెలియని పరిస్థితి. అంటే ఆ ఏడాది ప్రభుత్వం పెద్దగా చేసేదేమీ ఉండదనే చెప్పొచ్చు. ఏమైనా చేయడానికి ప్రభుత్వానికి గట్టిగా ఉన్న కాలం 18 నెలలు మాత్రమే. కానీ కాంగ్రెస్ వాళ్లు ఏదో చేస్తారన్న ఆశ రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గంలోనూ కనిపించడంలేదు. ప్రభుత్వం మీద ప్రతీఒక్కరూ నమ్మకం కోల్పోతున్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల గోస
ఎన్నికలు వచ్చే వరకు కూడా సాధారణంగా ప్రజలు ప్రభుత్వంపై ఆశతోనే ఉంటారు. అధికారంలో ఉన్నవాళ్లు హామీలను అమలు చేయకపోతారా? అని ఎదురుచూస్తారు. కానీ చిత్రంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులకు పదవీవిరమణ రోజునే చెల్లించాల్సిన బెనిఫిట్స్ చెల్లించి, ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద వదిలి పెట్టే సంప్రదాయానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు.
కేసీఆర్ పాలనే కావాలన్న 81% ప్రజలు
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై రాష్ట్రంలోని దాదాపు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీన్ని ధ్రువపరుస్తూ ‘పాలిటిక్స్ 365’ అనే ఓ ప్రైవేట్ సంస్థ తాజాగా నిర్వహించిన ఆన్లైన్ పోల్‌లో మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్కే జై కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు బాగున్నదంటూ 81 శాతం మంది ఓటేయగా, రేవంత్ పాలనకు కేవలం 17 శాతం మంది మద్దతు పలికారు. ఇక, సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ కూడా సీఎం రేవంత్‌రెడ్డి పట్ల అసంతృప్తి కనిపించింది. దాదాపు 60 శాతం మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం.
-బుద్ధా మురళి