సమస్యలపై నినదిస్తున్న, నిలదీస్తున్న ప్రజలను, వారి ఆలోచనలను దారిమళ్లించడంలో, తప్పుదోవ పట్టించడంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఆ రకమైన రాజకీయాలు చేయడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు.
రుణమాఫీ కాని రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కారు. వర్షాల వల్ల నష్టపోయినవారిని ఆదుకునే దిక్కులేదు. విషజ్వరాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి అనేక సమస్యలు ముప్పిరిగొన్న సమయాన ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టించడానికే కాంగ్రెస్ సర్కార్ హైడ్రామాకు తెరదీసిం ది. మూడు నాలుగు దశాబ్దాలుగా ఉంటు న్న నిర్మాణాలను ఆక్రమణల పేర విజయవంతంగా కూల్చడానికి కంకణం కట్టుకున్నది.
హైడ్రాకున్న అధికారాలను హైకోర్టు ప్రశ్నిస్తూనే ఉన్నా.. ఒక ఎజెండా ప్రకా రం, ఒక పథకం ప్రకారం ప్రతిపక్ష నేత లు, పేద ప్రజల నిర్మాణాలను ప్రభుత్వం ధ్వంసం చేస్తూనే ఉన్నది. ఈ క్రమంలో సామాన్యులు వారి ఆస్తిపాస్తులను కోల్పోతున్నా పాలకపక్షం పట్టనట్టు వ్యవహరి స్తున్నది. బ్యాంకు లోన్లతో నగరంలో సొంత గూడు కొనుక్కున్నవారు ఇప్పుడు నిరాశ్రయులవుతుండటం శోచనీయం. అనుమతులిచ్చిన అధికారులు, అమ్మిన బిల్డర్లు హాయిగా ఉండగా.. కష్టపడి కొనుక్కున్న సామాన్యులు, మధ్య తరగతివారు, ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నా రు.
అయితే, ఆక్రమణల కూల్చివేత నిర్ణయం సరైనదే అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులోనూ పక్షపాత వైఖరి ప్రదరిస్తున్నది. సొంత పార్టీ నాయకుల ఆక్రమణలను చూసీచూడనట్టుగా వ్యవ హరిస్తుండటం మాత్రం అత్యంత ఖండనీ యం. అయితే, హైడ్రా కూల్చివేతల్లో సామాన్యుడే సమిధ కావడం విచారకరం.
అసలు కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ధ్వంసరచన ఉన్నది. ముఖ్యమంత్రులు కావడం కోసం మతకల్లోలాలు సృష్టించిన చరిత్ర ఆ పార్టీ నేతలది. రాష్ట్రంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టే నటిస్తూ.. అవకాశం వస్తే గద్దెనెక్కాలని గోతికాడి నక్కలా వేచిచూస్తూ ఆ పార్టీ నేతలు అధిష్ఠానంతో రహస్య మంతనాలు జరుపుతుంటారు. సూట్కేసు రాజకీయాలకు కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్. పదవుల కోసం దేనికీ వెరవని లక్షణం ఆ పార్టీ నేతల సొంతం. అవకాశవాద పొత్తులు, మద్దతు ఉపసంహరణ వారికి షరామామూలే.
తరతమ భేదం లేకుండా ఎవరి ప్రభుత్వాలనైనా ధ్వంసం చేయగలగడం వారికి వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని తీవ్రం గా వ్యతిరేకించి, విమర్శించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండటం విడ్డూరం. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం సాధించిన తెలంగాణ పిత ను, తెలంగాణ కోసం స్వేదం చిందించిన పార్టీని అడుగడుగునా ఇబ్బందులు పెడుతుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
అయితే ఈ చర్యల వల్ల కాంగ్రెస్కు ఒరిగేదేమీ లేదు. ఆ పార్టీయే నవ్వులపాలై, ప్రజాదరణ కోల్పోవడం ఖాయం. రాష్ట్రంలో ఉని కి కోల్పోయిన టీడీపీని నిలబెట్టే ప్రయత్నం కూడా తెలంగాణ ధ్వంస రచనలో భాగమే కావచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు వారానికోసారి హైదరాబాద్లో మకాం వేసి, పార్టీ పునర్నిర్మాణానికి కృషి చేస్తాననడం అందుకు ఊతమిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణవాదులు, తెలంగాణ సమాజం జాగరూకత తో, అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూనే, తెలంగాణకు రాబోయే ప్రమాదాన్ని అడ్డుకోవాలి. ఈ తరుణంలో ఈనకాచి నక్కపాలు కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపైనే ఉన్నది. ఆ దిశగా అడుగులు పడతా యని ఆశిద్దాం.
శ్రీశ్రీ కుమార్