పొలిటికల్ సబ్వర్షన్ (Political Subversion) అంటే కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడం కాదు. ఒక సమాజం శతాబ్దాలుగా నిర్మించుకున్న నైతిక విలువలు, చారిత్రక సత్యాలు, సామాజిక ఐక్యతను లోపలి నుంచే కుళ్లిపోయేలా చేసే ఒక విషపూరితమైన ప్రక్రియ. వ్యవస్థలో అప్పటికే పాదుకుపోయిన ఉన్నత ప్రమాణాలు, సిద్ధాంతాలను తలకిందులు చేసి, ప్రజల నిబద్ధతను, మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ, పచ్చని సామాజిక జీవనాన్ని అతలాకుతలం చేయడమే దీని అసలు లక్ష్యం. రహస్యంగా పొంచి ఉండే శక్తులు, ఒక జాతి ఆత్మగౌరవ మూలాలను కూల్చివేసేందుకు చేసే కుట్రపూరిత యుద్ధమిది.
నేడు తెలంగాణ నేల అచ్చం అటువంటి అదృశ్య యుద్ధాన్నే ఎదుర్కొంటున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది ఒక భౌగోళిక, పరిపాలనాపరమైన విభజన మాత్రమే కాదు; అది దశాబ్దాల వలసఆధిపత్యంపై సాధించిన సామాజిక, సాంస్కృతిక విజయం. అయితే, ఈ చారిత్రక పరిణామాన్ని జీర్ణించుకోలేని ప్రతీఘాత శక్తులు, నాడు పరోక్షంగా.. నేడు ప్రత్యక్షంగా తెలంగాణ అస్తిత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఉద్యమ కాలంలో తెలంగాణ సమాజంలో నెలకొన్న అపురూపమైన ఐక్యత, ఆ నిరంతర జాగరూకత ఈ శక్తులను అడ్డుకోగలిగింది. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత సహజంగానే సమాజంలో ఏర్పడిన విభిన్న దృక్పథాలు, ప్రయోజనాల ఘర్షణలు ఈ కుట్రదారులకు మళ్లీ ఆశలు చిగురింపజేశాయి. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే తెలంగాణను రాజకీయంగా కుప్పకూల్చడానికి డబ్బు సంచులతో శాసనసభ్యులను కొనుగోలు చేసే నీచమైన వ్యూహానికి నిస్సిగ్గుగా తెరలేపారు. కానీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అసాధారణ అప్రమత్తత వల్ల విచ్ఛిన్నకర శక్తుల వ్యూహం విఫలమైంది. అప్పట్లో ఆ శక్తులకు తగిలిన ఆ దెబ్బతో నేటికీ వారు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. తమ పార్టీ మౌలిక సిద్ధాంతాలను తుంగలో తొక్కి అయినా, చివరకు బద్ధశత్రువులతో చేతులు కలిపి అయినా తెలంగాణపై మళ్లీ పెత్తనం చెలాయించాలని వారు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు.
కరోనా తర్వాతి కాలంలో డిజిటల్ మీడియా, యూట్యూబ్ చానళ్లు విజృంభించడం ఈ శక్తులకు ఒక ఆయుధంగా మారింది. దీంతో కుట్రపూరిత విషప్రచారం ప్రారంభమైంది. దురదృష్టవశాత్తూ, బీఆర్ఎస్ శ్రేణులు ఈ కుట్రలను సమయానికి గుర్తించి పూర్వపక్షం చేయలేకపోయాయి. కొన్ని యూట్యూబ్ చానళ్ల అరాచకత్వం నుంచి మొదలైన ఈ దాడిని, క్రమంగా ప్రధాన స్రవంతి మీడియా అందుకొని దాన్ని మరింత తెలివిగా, మరింత విస్తృతంగా వ్యాప్తి చేసింది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే గోబెల్స్ ప్రయోగం ఇక్కడ పూర్తిగా విజయవంతమైంది. మత ఉద్రిక్తతలను జోడించిన బీజేపీ, తెర వెనుక చక్రం తిప్పిన టీడీపీ.. కలిసికట్టుగా కాంగ్రెస్‌ను అధికార పీఠంపై కూర్చోబెట్టాయి.
కేసీఆర్ వ్యక్తిత్వంపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న వికృత దాడిని కేవలం రాజకీయ విమర్శగా చూడలేం. ఇది ముందే సిద్ధం చేసిన ఒక స్క్రిప్ట్. తెలంగాణను సాధించిన నాయకుడిని, బీఆర్ఎస్ ఉనికిని నామరూపాలు లేకుండా చేస్తే తప్ప, ఈ గడ్డపై తాము శాశ్వత పెత్తనం చేయలేమని ఈ ప్రతీఘాత శక్తుల కుట్రపూరిత ఆలోచన. అందుకే, ఇవాళ ఆ ఆధిపత్య శక్తులకు రేవంత్‌రెడ్డి ఒక మౌత్ పీస్‌గా మారి, తెలంగాణ జాతి చేతనను హరించే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్‌ను కించపరుస్తూ, తెలంగాణ పోరాట చరిత్రను వక్రీకరించి, తృణీకరిస్తున్నాడు.
నేడు కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి లక్ష్యం ఒక్కటే.. బీఆర్ఎస్ను అంతం చేయడం. ప్రాంతీయ శక్తిని లేకుండా చేస్తేనే తెలంగాణపై జాతీయ పార్టీల పెత్తనం స్థిరపడుతుందని, అధికారం ఆ రెండు శక్తుల మధ్యనే చేతులు మారే ఆట అవుతుందని ఆయా పార్టీల భావన. అంతేకాకుండా దక్షిణాదిన వైభవంగా వెలుగుతున్న అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి హైదరాబాద్‌పై, తెలంగాణ సహజ వనరులపై పూర్తి అధికారం దక్కించుకోవాలనే పన్నాగం ఫలిస్తుందని కుట్ర. తెలంగాణను సాధించి, అస్తిత్వ భావనకు ఏకైక ఆసరాగా నిలిచిన కేసీఆర్ మనుగడను జీర్ణించుకోలేని శక్తులు, ఏదేమైనా ఆయన ఉనికినే అదృశ్యం చేయడానికి నిరంతరంగా విషప్రచారాలతో విజృంభిస్తున్నాయి. తద్వారా తెలంగాణ అస్తిత్వ దీపాన్ని ఆర్పి, మనల్ని మళ్లీ సుషుప్తిలోకి నెట్టాలని చూస్తున్నాయి.
రేవంత్‌రెడ్డి సృష్టిస్తున్న ఈ తిట్ల ట్రాప్‌ను ఈ నేపథ్యంలో నుంచే మనం అర్థం చేసుకోవాలె. నిజానికి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది రెండేండ్ల కాంగ్రెస్ పరిపాలన మీద, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ ఏం చేసిందనే దాని మీద, ఆరు గ్యారెంటీల నమ్మక ద్రోహం మీద. అంతేకాకుండా రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలపై, నిరుద్యోగులకు కాంగ్రెస్ చేసిన ద్రోహంపై, ఫీజు రీయింబర్స్మెంట్ అందక బిడ్డల చదువులు ఆగిపోతున్న విషయంపై చర్చ జరగాలి. గురుకులాల్లో విషాహారం తిని బలైపోయిన పసి ప్రాణాల మీద చర్చ జరగాలి. ఇవేవీ చర్చకు రాకూడదనేదే ఈ రాజకీయ విధ్వంసక వ్యూహం ప్రధాన లక్ష్యం. ‘జాతిపిత’ భావన మీద దాడి నెపంతో రేవంత్ చేస్తున్నది ఉద్యమంలో ఉదయించిన జాతి చేతనను అంతం చేసే కుట్ర. క్రమక్రమంగా ’జై తెలంగాణ’ నినాదాన్ని అధికార కార్యక్రమాల నుంచి దూరం చేసిన విధంగానే, మొత్తం తెలంగాణ ఆత్మగౌరవ భావననే అసంగతంగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నాడు. కానీ, తెలంగాణ సమాజం మేల్కోవాలి. అబద్ధాల పునాదులపై నిర్మించిన ఈ పాలన, విద్వేషపూరితమైన ఈ సబ్వర్షన్ వ్యూహాలను పటాపంచలు చేయాలి. మన అస్తిత్వ దీపం రక్షణ కోసం అసిధారా వ్రతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డపైనా ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి విసురుతున్న తిట్ల ట్రాప్ లో పడకుండా, మన ప్రగతిని, మన నీటి హక్కులను, మన భవిష్యత్తును రక్షించుకోవడానికి సిద్ధం కావాలి. సూర్యోదయం కాగానే చీకటి తోక ముడిచినట్టే.. తెలంగాణ చైతన్యం మేల్కొంటే ఈ ప్రతీఘాత శక్తులు పటాపంచలు కావడం ఖాయం!
(వ్యాసకర్త: కవి, గాయకుడు,శాసనమండలి సభ్యుడు)
-దేశపతి శ్రీనివాస్