విస్తారమైన కురవడంతో రాష్ట్రంలో మొన్నటిదాకా వరదలు పోటెత్తాయి. దాంతో పారిశుద్ధ్యం పేరుకుపోయింది. తత్ఫలితంగా విష జ్వరాలు విజృంభిస్తుండటంతో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ వ్యవస్థలు విఫలమవ్వడమే అందుకు ప్రధాన కారణం. యావత్ తెలంగాణ ఇప్పుడు మంచానపడ్డది. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర ప్రజలు కార్పొరేట్ దవాఖానలకు క్యూ కడుతున్నారు. లక్షల్లో ఖర్చుపెడుతున్నారు. అయినప్పటికీ కొందరు ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరం.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు కుక్కకాటుకు బలవుతున్నారు. వేలాది మంది పిల్లలు గాయాల పాలవుతున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడం లేదు. ఈ విషయమై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. కాగా, పాలకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడంపైనే దృష్టిసారిస్తున్నారు. వారు పట్టించుకోకపోవడంతో అధికారులు ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కుంటుపడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో పాలన పడకేసింది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుందని నమ్మే కేసీఆర్ తన పాలనలో ప్రజారోగ్యం, మాతాశిశు, మహిళల సంక్షేమానికి పెట్టపీట వేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠపరిచారు. జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటుచేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చేశారు. అంతకంటే ముందే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందికి, స్థానిక ప్రజాప్రతినిధులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త సేకరణ, మురుగుకాల్వల నిర్వహణ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడారు. కానీ, గత 9 నెలలుగా పరిస్థితి తారుమారైంది. స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో అధికారులే రాజ్యమేలుతున్నారు. రేవంత్ సర్కార్ ఒక్కో అధికారికి రెండు, మూడు గ్రామాల బాధ్యత అప్పగించడంతో పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ప్రజలు రోగాల బారినపడుతున్నారు.
కౌన్సిలర్లను ప్రలోభపెట్టి, దొడ్డిదారిన మున్సిపాలిటీలను చేజిక్కించుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజా సంక్షేమంపై దృష్టిపెట్టడం లేదు. అడ్డదారిలో అందలమెక్కుతూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు అక్రమ సంపాదన కోసం అర్రులు చాస్తున్నారే తప్పప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలో నమోదవుతున్న డెంగ్యూ కేసులు దడ జనవరి నుంచి ఆగస్టు వరకు 6,848 మందికి డెంగ్యూ సోకినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వీటిలో హైదరాబాద్‌లో నమోదైనవే 2,697 కావడం గమనార్హం. మేడ్చల్, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మిగతా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. కానీ, అనధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా 32 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కేసుల నమోదు, మరణాల రేటును ప్రభుత్వం దాచిపెడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూలై నుంచి ఇప్పటివరకు 1.42 కోట్ల మందికి పైగా జ్వర సర్వే చేసి అతి తక్కువ డెంగ్యూ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
విషజ్వరాల బాధితులతో హైదరాబాద్‌లోని నీలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. సరైన వైద్యం అందక రెండు, మూడు రోజుల్లోనే ఆరోగ్యం విషమించి మరణాలు సంభవిస్తున్నాయి. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం గర్హనీయం. ప్రభుత్వ దవాఖానల్లో సరైన వసతులు, మందులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది రోగులు ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడికి గురవుతున్నారు.
ఇదిలా ఉంటే.. గురుకులాల్లో పరిస్థితులు మరింత దయనీయమయ్యాయి. అటు ఆహార కలుషితం.. ఇటు విష స్పర్పాల కాట్లతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుండటం తల్లిదండ్రులను కలవరపెడుతున్నది. కేసీఆర్ హయాంలో పూర్ణ, ఆనంద్ లాంటి విద్యార్థులు హిమాలయాలను అధిరోహించారు. కానీ, రేవంత్ హయాంలో ఫుడ్ పాయిజన్, సౌకర్యాల లేమి, పాముకాట్లతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదీస్తున్నారు.
అక్రమార్కులతో కుమ్మక్కవుతున్న ప్రిన్సిపల్స్ విద్యార్థుల ప్రాణాలతో వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నా రేవంత్ సర్కార్ చూస్తున్నది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు కుక్కకాటుకు బలవుతున్నారు. వేలాది మంది పిల్లలు గాయాల పాలవుతున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడం లేదు. ఈ విషయమై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇక రాష్ట్రంలోని పెద్ద పెద్ద హోటళ్లలో కలుషిత ఆహారం పట్టుబడటం సర్వసాధారణమైంది. పాడైపోయిన, గడువు ముగిసిన పదార్థాలను వినియోగదారు లకు విక్రయిస్తుండటం బాధాకరం. ఇవి హైదరాబాద్‌లో వెలుగుచూసిన దారు ణాలు మాత్రమే. కరీంనగర్, వరంగల్ లాంటి ద్వితీయశ్రేణి నగరాల్లో తదితర ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత తీవ్రంగా ఉన్నది. దాంతో అక్కడ జరిగే దారుణాలు అంతగా వెలుగులోకి రావడం లేదు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు గత బీఆర్ఎస్ సర్కారుపై అభాండాలు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వాళ్ల నిర్లక్షపూరిత ధోరణితోనే రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ప్రజ లు సమిధలవుతున్నారు. కాబట్టి ఇకనైనా రేవంత్ సర్కార్ మొద్దునిద్రను వీడాలి. ప్రభుత్వం తన తీరును మార్చుకొని సంక్షేమంపై దృష్టిసారించకపోతే ప్రజల తిరుగుబాటు ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుం ది. ఇందులో ఏ మాత్రం సంశయం అక్కరలేదు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు)
-డాక్టర్ నలమాస శ్రీకాంత్‌గౌడ్
88866 66006