ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రజలతో పాటు ప్రతిపక్షాల బాధ్యత. తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రధాన ప్రతిపక్షం మీద ఎదురుదాడికి దిగుతున్నది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
Runa Mafi | అధికారంలోకి వచ్చేందుకు అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వాటిని అమలుచేసేందుకు నానా తంటాలు పడుతున్నది. అర్థం పర్థం లేని నిబంధనలు పెట్టి 11 లక్షల మందికి పైగా కోత పెట్టారు. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు కుటుంబానికి రూ.2 లక్షలకే పరిమితం చేశారు. ఎన్నికలకు ముందు రూ.41 వేల కోట్లని చెప్పి, అధికారంలోకి వచ్చాక రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని ప్రకటించి, బడ్జెట్లో రూ.26 వేల కోట్లను కేటాయించి, ఆపై రూ.17 వేల కోట్లతోనే మాఫీ అయిపోయినట్లు ప్రకటించడం శోచనీయం. తెలంగాణవ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు గానూ 60 లక్షల మంది రుణాలు తీసుకోగా, ప్రభుత్వం మాత్రం 44 లక్షల మంది మాత్రమే రుణాలు తీసుకున్నట్లు చెప్తున్నది. ఇక వారిలోనూ 32.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి.. తీరా 22 లక్షల మంది రుణాలనే మాఫీ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 1,11,027 ఫిర్యాదులు వచ్చాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ హరీశ్‌రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరం. మాయమాటలు మాట్లాడటం రేవంత్‌రెడ్డికి కొత్తేమీ కాదు. గతంలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్ విసిరారు. మరి ఆయన రాజకీయ సన్యాసం ఏమైంది? ఫ్రస్ట్రేషన్లో ఉన్న రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఆయనలో ఇంకా అప్పటి ప్రతిపక్ష నాయకుడే కనిపిస్తున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ సీఎం పదవికి మచ్చ తెస్తున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల ఆందోళనలే కనిపిస్తున్నాయి. ‘ఇదేం మాఫీ.. మాకు రుణమాఫీ చేస్తారా, లేదా?’ అని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రుణమాఫీ పూర్తయిందంటూ గప్పాలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు, పాలాభిషేకాలు చేస్తున్న కార్యకర్తలు ఆందోళన చేస్తున్న రైతులకు సమాధానం చెప్పాలి.
కేసీఆర్ హయాంలో రెండుసార్లు రుణమాఫీ జరిగింది. మొదటి పర్యాయం 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్లు, రెండో పర్యాయం 22.98 లక్షల మంది రైతులకు రూ.13,000 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. కానీ, ఇలా లొల్లి జరగలేదు. రేషన్‌కార్డులో పేరు లేదని, పేర్లు తప్పుగా ఉన్నాయని, చిన్నాచితకా తప్పులు ఉన్నాయని, ఇతర సాంకేతిక కారణాలు చెప్తూ కొర్రీలు పెడుతున్నారు. బ్యాంకుల చుట్టూ పాస్‌బుక్‌లు, ఆధార్‌కార్డులు పట్టుకొని రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మండల వ్యవసాయాధికారులు స్పందించడం లేదు. అలాంటి తప్పులే ఉన్నప్పుడు రుణాలు ఎలా ఇచ్చినట్టు? అప్పుడు ఈ తప్పులు కనిపించలేదా? అంతేకాదు, రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్నవారు అదనపు మొత్తాలను ముందుగా చెల్లిస్తేనే మాఫీ చేస్తామని చెప్పడం సరికాదు. పంట పెట్టుబడులకే ఇబ్బందులు పడుతున్న రైతులు ఆ సొమ్మును ఎక్కడి నుంచి తేవాలి?
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ విషయమై మొదటినుంచీ కాంగ్రెస్ సర్కార్‌పై ఒత్తిడి తెస్తూనే ఉన్నది. కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు రైతుల పక్షాన పోరాడుతూనే ఉన్నారు. అందుకే ప్రశ్నిస్తున్నవారిపై దాడులకు కాంగ్రెస్ తెగబడుతున్నది. అందులో భాగంగానే సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. తాజాగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో దాడి జరిగింది. అంతేకాదు, సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ అమలు తీరుతెన్నుల గురించి తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టులపై కూడా దాడులు జరిగాయి. ఇలాంటి చిల్లర పనుల వల్ల ప్రభుత్వానికే నష్టం. ఇప్పటికైనా హామీలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించాలి. లేనిపక్షంలో ప్రజలే బుద్ధిచెప్తారు.
జీడిపల్లి రాంరెడ్డి
96666 80051