కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు నానాటికి వెల్లువెత్తుతున్నాయి. విమర్శలు హామీల అమలు, పరిపాలన విషయంలో. ఆరోపణలు అవినీతికి సంబంధించి. అయితే వాటిని ప్రస్తుతానికి పక్కన ఉంచుదాము. కాంగ్రెస్ పార్టీకి, ఆ ప్రభుత్వానికి మేలు జరగటం, లేదా హాని కలగటం అనే దృక్కోణం నుంచి చూసినప్పుడు, అంతకన్న ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఒకటున్నది. అది, వారు తమ గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారా లేదా అన్నది. ప్రస్తుత ధోరణిని జాగ్రత్తగా గమనించినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ వారు తమ చరిత్ర నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకుంటున్న సూచనలు కనిపించటం లేదు. దాన్ని బట్టి, గత అధికార భ్రష్ఠత్వాలకు వలెనే మరొక మారు పతనానికి పరిస్థితులను తమకు తామే సిద్ధం చేసుకుంటున్నారనే అభిప్రాయం కలుగుతున్నది.
Congress | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు వచ్చేముందు జాతీయ పరిణామాలను చెప్పుకుందాం. ఎందుకంటే, మొదట ఉమ్మడి రాష్ట్రంలో గాని, తర్వాత తెలంగాణలో గాని మనం చూస్తున్న కాంగ్రెస్ పతన క్రమానికి మూలాలు జాతీయ పరిణామాలలో ఉన్నాయి. అవి అర్థం చేసుకుంటే గానీ ఇవి అర్థం కావు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించి అన్నివర్గాల ప్రజలను వెంట తీసుకుపోయింది. స్వాతంత్య్రం తర్వాత, అన్నివర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి, వారి ఆకాంక్షల పరిపూర్తికి, దేశ సర్వతోముఖాభివృద్ధికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించింది. కానీ వారి పరిపాలన అవన్నీ నిజాయితీ రహితంగా, అరకొరగా అమలవుతూ సాగటంతో మొదలైంది. ఆ వివరాల్లోకి ఇక్కడ వెళ్లలేము గాని, ఆ విధంగా మొదటనే కనిపించిన వైఫల్యాలూ, అందుకు తగిన వ్యతిరేక ఫలితాలు కూడా ఆరంభంలోనే మొదలయ్యాయని గుర్తించాలి. ఆ తొలి దశలో కనిపించిన అటువంటి స్థితే, అప్పటినుంచి 70 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఉందన్నది ఇక్కడ మాట్లాడుకుంటున్న ప్రధాన విషయం. ఇది జాతీయస్థాయి నుంచి తెలంగాణ వరకు కూడా. అదెట్లాగో చూద్దాం.
కాంగ్రెస్ తొలి ప్రధాని అయిన నెహ్రూ ఒక దార్శనికుడు, చిత్తశుద్ధి గలవాడనటంలో సందేహం లేదు. ఆయన తన 17 ఏండ్ల పాలనలో దేశ అవసరాలకు అనుగుణంగా, రాజ్యాంగాన్ని అనుసరించి అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో అనేకం విఫలమయ్యాయి, లేదా అరకొరగా సాగాయి. అందుకు కారణం ఏమిటన్నది మాత్రం ప్రచారం కాలేదు, ప్రజల దృష్టికి రాలేదు. అందుకు కారకులు కాంగ్రెస్‌లో జాతీయస్థాయి నుంచి రాష్ర్టాల వరకు గల కన్జర్వేటివ్ వర్గాలు, ఫ్యూ డల్ వర్గాలు, అధికార యంత్రాంగంలోని ఒక వర్గం, విదేశీ పెట్టుబడిదారీ లాబీలు. అందువల్ల ఏమి జరిగింది, నెహ్రూ త ర్వాత ఈ శక్తుల ప్రాబల్యం ఎట్లా పనిచేసిందనే చర్చ ప్రస్తుతం చేయలేము గాని, ఈ ప్రారంభ దశలోనే తదనంతర కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలకు బీజాలు పడ్డాయని మాత్రం గుర్తించాలి.
ఆ వైఫల్యాల ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాలంలోనే చవిచూసింది కూడా. 1952 మొదటి ఎన్నికల తర్వాత 1957లో రెండవ ఎన్నికల నాటికే కాంగ్రెస్ పార్టీ యూపీ, బీహార్, బెంగాల్, అస్సాం, ఒరిస్సా వంటి పెద్ద రాష్ర్టాలలో, ఓట్లు, సీట్లతో పాటు, కేరళలోనైతే ఏకంగా అధికారాన్నే పోగొట్టుకుంది. అందుకు కారణాలు పార్టీలోని ఇతర నాయకులకు కాకున్నా నెహ్రూకు బాగానే అర్థమయ్యాయి. బడుగు, బలహీనుల సమస్యలను పరిష్కరించనట్టయితే, వారు తమ చేతికి అందిన ఓటు ఆయుధంతో మనలను శిక్షిస్తారని, అదేవిధంగా మనలను పక్కకు తోసివేసి తమ దారి తాము వెతుక్కుంటూ ముందుకుపోతారని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే మాట్లాడుతూ హెచ్చరించారాయన. మాటలు సరిగా ఇవేకాకున్నా సారాంశం ఇది. నిజానికి ఈ స్థితిని 1952 మొదటి ఎన్నికల కన్నా ముందే అప్పటి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఊహిస్తూ నెహ్రూకు ఒక లేఖ రాశారు. ఆయన ముఖ్యంగా ఎత్తిచూపింది కాంగ్రెస్‌లో అప్పటికే మొదలైన అవినీతి ధోరణుల గురించి. అవి అట్లాగే సాగితే కాంగ్రెస్ నష్టపోతుందని కూడా అన్నారు.
విషయమేమంటే, ఆ విధమైన రాధాకృష్ణన్, నెహ్రూల హెచ్చరికల నుంచి కాంగ్రెస్ వాదులు గాని, వారి వివిధ ప్రభుత్వాలు గాని, ఆ 1950ల కాలం మొదలు ఈ 2024 వరకు 70 సంవత్సరాల సుదీర్ఘకాలంలో ఎటువంటి పాఠాలు నేర్వలేదు. ప్రజలకు మాయమాటలు చెప్పటం, పాప్యులిజంతో మభ్యపెట్టడం, ఓట్లను అమ్ముకునేందుకు ప్రజలను అలవాటు చేయటం, ఒక ఎన్నిక నుంచి మరొక ఎన్నికకు అలవికాని హామీలనివ్వటం, తమ వైఫల్యాలను యథావిధిగా కొనసాగిస్తూ, అధికారాన్ని అనుభవిస్తూ, అవినీతిని విచ్చలవిడిగా సాగించటం అనే పద్ధతులకు అలవాటుపడిపోయారు. కొద్దిపాటి తేడాలతో ఇదే సాగుతూ వస్తున్నది జాతీయస్థాయిలో, రాష్ర్టాలలో కూడా అయినా వారు పాఠాలు నేర్వలేదు. నేటికీ నేర్వటం లేదు. తెలంగాణలో సైతం ప్రస్తుతం అదే కనిపిస్తున్నది.
ఇందుకు ఫలితాన్ని వారు మొదటిసారి 1957లోనే ఎదుర్కొనగా, తర్వాత అది మరింత తీవ్రమై అనేక ఒడిదుడుకులను అనుభవించారు. ఆ విషయాలు క్లుప్తంగా చూద్దాము. కేంద్రంలో సొంత మెజారిటీతో కాంగ్రెస్ వరుసగా పాలించింది 1977 వరకు మాత్రమే. తర్వాత కాలంలో జరిగిందంతా మధ్య మధ్య అధికారానికి రావటం, లేదా ఇతర పార్టీల పొత్తుతో రావటం. అనగా తన ఎదురులేని ఏకచ్ఛత్రాధిపత్యం ఇప్పటికి 47 సంవత్సరాల క్రితం 1977లోనే భంగపడింది. అప్పటినుంచి పలుమార్లు కేంద్రంలో అధికారం కోల్పోయింది. ప్రస్తుతానికి వస్తే, 2004, 2009లో రెండు సార్లు కూటమి రూపంలో మాత్రమే పాలించిన తర్వాత, 2014 నుంచి ఇప్పటికి వరుసగా మూడు సార్లు గెలవలేకపోయింది. అంతేకాదు, తన చరిత్రలోనే ఎన్నడూ లేనంత తక్కువ సీట్లు తెచ్చుకున్న మూడుసార్లు కూడా ఇవే. ఇక రాష్ర్టాలను చూస్తే, కాంగ్రెస్ ఆధిపత్యం కేంద్రం కన్నా (1977) పది సంవత్సరాల (1967) ముందే భంగపడింది. ఆ దుస్థితి నుంచి, పతన పరంపర నుంచి ఆ పార్టీ నేటికీ కోలుకోలేదు. కనుక ఈ రోజున దేశంలోని 28 రాష్ర్టాలలో కేవలం మూడే మూడింట అధికారంలో మిగిలింది. అయినప్పటికీ పాఠాలు నేర్చుకొని ఒక సమగ్రమైన అజెండాను తయారుచేసుకోవటం, పార్టీని క్రమపద్ధతిలో నిర్మించుకోవటానికి బదులు హంగామా డైలాగులు, నాటకీయతలతోనే మురిసిపోతున్నారు.
ఈ చర్చ అంతటిలో చెప్పదలచిన రెండు ప్రధానమైన అంశాలు ఏమంటే, ఒకటి, కాంగ్రెస్ పార్టీ గాని, ప్రభుత్వాలు గానీ, గత 77 సంవత్సరాల సుదీర్ఘకాలంలో తమ వైఫల్యాలను సరిదిద్దుకోలేదు. అవినీతిని, బంధుప్రీతిని నిరోధించుకోలేదు. అంతిమంగా ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. దీని ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కనిపించింది, తెలంగాణలో కనిపిస్తున్నది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడగా వారి ఎదురులేని పాలన 30 ఏండ్లు గడవకముందే 1983లో ఎన్టీఆర్ నాయకత్వాన ఒక ఫెడరల్ పార్టీ రాకతో ముగిసింది. అప్పటినుంచి 2014లో రాష్ట్ర విభజన వరకు వారి అధికారానికి ఐదు సార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి. మరొక విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మూడుసార్లూ ఫెడరల్ పార్టీలే గెలిచాయి. తెలంగాణలో రెండు సార్లు ఓడి ఒకసారి గెలిచారు.
ఈ మొత్తం కాంగ్రెస్ చరిత్రలో పైన చెప్పుకున్న పరిపాలనా వైఫల్యాలు, పాఠాలు నేర్వకపోవటం, విచ్చలవిడి అవినీతి అనే మూడు లక్షణాలతో పాటు, గమనించదగిన మరో రెండు విషయాలున్నాయి. ఒకటి, కాంగ్రెస్‌వాదులు సుమారు 1990ల వరకు జయాపజయాలతో నిమిత్తం లేకుండా తమ పార్టీకి కట్టుబడి ఉండేవారు. ఆయారాం గయారాంలు ఉండినా తక్కువే. అటువంటి వారికి అదొక మచ్చగా కూడా ఉండేది. పార్టీ వాదులకు పార్టీ పరమైన సిద్ధాంతాలపై నమ్మకం, నాయకత్వం పట్ల విధేయతలు ఉండేవి. ఒకసారి ఓడినా మరోసారి గెలవగలమనుకునేవారు. గమనించవలసిన రెండు విషయాలలో ఇది ఒకటి కాగా, తర్వాత కాలంలో వివిధ కారణాల వల్ల పార్టీ సిద్ధాంతాలపై నమ్మకాలు, నాయకత్వాల పట్ల విధేయతలు సడలిపోవటం ఒక ధోరణిగా మారింది. ఒకవైపు పార్టీ బలహీనపడటం, గెలుపు అనుమానాస్పదం అవుతుండటం, మరొకవైపు నాయకులకు, శ్రేణులకు వ్యక్తిగత అధికార ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతుండటం వంటి వాటితో అసలు రాజకీయరంగమే ఒక ఫ్రీ మార్కెట్‌గా మారింది. కాంగ్రెస్ అందుకు మినహాయింపు కాలేదు. రాజకీయ వాదులు, వారి అనుచరులు, చివరికి సాధారణ కార్యకర్తలు కూడా ఇదే ధర్మాన్ని అనుసరించే రెండవ దశ మొదలైంది. కాంగ్రెస్ గెలిస్తే అందులోకి వస్తారు, ఓడితే మరో పార్టీలోకి పోతారు. అంతా రంగులరాట్నం తీరు.
ఈ పరిణామాల నుంచి, స్వయంగా తన అనుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఏ పాఠాలు నేర్చుకోని ఈ స్థితే ఈ రోజున తెలంగాణలోనూ కన్పిస్తున్నది. పరిస్థితి సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, హామీల అమలులో తీవ్ర వైఫల్యం, దానిని కప్పిపుచ్చుకునే మాయ మాటలూ, చేష్టలూ, క్రమంగా విచ్చలవిడిస్థాయికి చేరుతున్న అవినీతి, పరిపాలనా వైఫల్యాలు, అంతిమంగా 77 సంవత్సరాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవటం. ఆ విధంగా వారు రాగల కాలంలో తమ పతనానికి తామే మరొకసారి బాటలు వేసుకుంటున్నారు. ఆ స్థితిని నెహ్రూ అంతటివాడే ప్రయత్నించి కూడా సరిదిద్దలేకపోయినప్పుడు, ప్రస్తుతం అసలు అటువంటి ఆలోచన గలవారే లేనప్పుడు, ఇక చెప్పేదేమున్నది!
ఎవరైనా సరే ఒకసారి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను, వారు బాండ్ పేపర్లపై సంతకాలు చేసి ఇంటింటికి తిరిగి పంచిన ఆరు గ్యారెంటీలను చూడండి. ఆ గ్యారంటీలలో వారన్న 100 రోజులలో గానీ, ఇప్పటికి గడిచిన 260 రోజులలో గాని ఏవి అమలయ్యాయో, ఏవి కాలేదో తమంతట తామే పోల్చిచూసుకోండి. అమలు కావటం లేదా కాకపోవటంపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఏమి అంటున్నారు, ఏమి అనటం లేదు, ఏవి దాస్తున్నారు, ఏవి వంకరటింకర తిప్పి మాట్లాడుతున్నారు అనేవి మీ అంతట మీరే గమనించండి. ఎవరూ చెప్పనక్కరలేదు. అట్లాగే, మ్యానిఫెస్టోలో ఏమి చెప్పి తర్వాత ఏమంటున్నారనేది కూడా. మరొకవైపు ఈ అంశాలపై ఏ సవాలుకూ జవాబివ్వకపోవటాన్ని అందరూ ఇప్పటికే గమనించి ఉంటారు. కొత్తగా ఒక ఉద్యోగమైనా ఇచ్చినట్లు రుజువు చేస్తే అసెంబ్లీ నుంచే గాక రాజకీయాల నుంచే తప్పుకుంటానని కేటీఆర్ పలుమార్లు సవాలు చేసినా జవాబుండదు. రుణమాఫీ అందరికీ జరిగిందని నిరూపిస్తే తాను కూడా అదే పని చేయగలనన్న హరీశ్‌రావు సవాలుకు స్పందన ఉండదు. ఇటువంటివి మరెన్నో. తాజాగా, కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అమృత్’ అమలులో అవినీతి లేదని జ్యుడీషియల్ విచారణలో తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకోగలనని కేటీఆర్ అన్నారు. ఈ వ్యాసం రాసే సమయానికైతే అందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి ఎటువంటి ఉలుకూ పలుకూ లేదు.
హామీల అమలు, అవినీతి, పరిపాలన సక్రమంగా సాగకపోవటంపై ఇప్పటికే ప్రజలలో మాటలు మొదలయ్యాయి. దాని అర్థం, పైన వివరంగా చర్చించుకున్నట్లు కాంగ్రెస్ వారు గత 77 సంవత్సరాలుగా నేర్చుకోని పాఠాలను ఇప్పటికీ నేర్చుకోవటం లేదు. తమ జాతీయ నాయకత్వం అయినా వారికి నేర్పటం లేదు. నిజం చెప్పాలంటే వారు నేర్పరు, నేర్పలేరు కూడా. ఎందుకంటే వారు స్వయంగా నేర్చుకోలేదు, నేర్చుకోవటం లేదు గనుక.
-టంకశాల అశోక్