తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడింది అనడానికి ప్రభుత్వం ఇటీవల విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి చేపడుతున్న నిర్ణయాలే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)లో రాష్ట్రం ర్యాంక్ పడిపోకుండా ఉండటం కోసం, 1,441 బడులను జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో విద్యాశాఖ దయనీయ స్థితికి అద్దం పడుతుంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నివేదికలో జీరో ఎన్రోల్మెంట్ ఉన్న జాబితాలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. దీనితో పీజీఐ ర్యాంక్ పడిపోతుంది. దీనితో ప్రభుత్వం 1,441 పాఠశాలలను మూసి వేసి 2026-27 యూడైస్ లెక్కల నుండి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. మరో 640 పాఠశాలల్లో కేవలం ఉపాధ్యాయులు మాత్రమే ఉండి, ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపించి వాటిని కూడా త్వరలో మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో ప్రభుత్వ విద్య పట్ల పాలక వర్గాలకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 2,081 జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఉన్నట్టు తేలగా, ప్రస్తుతానికి 1,441 స్కూళ్లను మూసివేయడంతో పాటు, మిగిలిన 640 పాఠశాలలను మూసివేస్తే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 24 వేల లోపే పరిమితం కానుంది. గ్రామాలలో పాఠశాలలు మూతపడటం వల్ల పేద, దళిత, గిరిజన, వెనుక బడిన వర్గాల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం కంటే వాటిని పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య, ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేయాలి. బడుల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. పాఠశాలలను మూసివేయడం సమస్యకు ముగింపు కాదు. వాటికి పూర్వ వైభవం తీసుకు రావడమే ఈ సమస్యకు పరిష్కారం.
(వ్యాసకర్త: ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రోగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ )
-పల్లె నాగరాజు
8500431793