అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామని మ్యానిఫెస్టోలో భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చాక మౌనం వహించటంలో ఆంతర్యమేమిటి? 2003 డీఎస్సీలో ఉత్తీర్ణులైన వారికి కూడా పాత పెన్షన్ అమలు చేయకపోవటం సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల వివక్షగానే భావిస్తున్నారు. 2003 డీఎస్సీ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, సుప్రీంకోర్టు, హైకోర్టు సానుకూలంగా తీర్పులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టటం గర్హణీయం.
ప్రతి నెలా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం కేటాయించే వెయ్యికోట్లలో సీపీఎస్ ఉద్యోగులకు ఎలాంటి కేటాయింపులు చేయకపోవటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ర్టాల ప్రభుత్వాలు పాత పెన్షన్ అమలు చేస్తున్నాయి. తెలంగాణ లోనూ వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగులందరూ ముక్తకంఠంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా సర్కార్ ఈ విషయమై స్పష్టమైన హామీ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది.
ఒకవైపు పశ్చిమ ఆసియా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి. అదే సందర్భంలో రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఆవిరయ్యాయి. ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు’ ఆ నష్టాలు చాలవన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు గత 16 నెలలుగా డీఏల బకాయిలు చెల్లించడంలేదు.
ఉద్యోగుల వాటా, ప్రభుత్వం వాటా సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయకపోవటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విధంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నప్పటికీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలు సీపీఎస్ ఉద్యోగులను పట్టించుకోవడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలకు సంబంధించి మూడు జీవోలను విడుదల చేసింది. 2024లో జారీ చేసిన జీవో నంబర్ 120లోని 17 ఇన్స్టాల్మెంట్లలో 16 ఇన్స్టాల్మెంట్లు, 2025లో జారీ చేసిన జీవో నంబర్ 78లోని 28 ఇన్స్టాల్మెంట్లలో 10 ఇన్స్టాల్మెంట్లు, 2026లో జారీ చేసిన జీవో నంబర్ 2లోని 30 ఇన్స్టాల్మెంట్లలో నాలుగు ఇన్స్టాల్మెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 75 ఇన్స్టాల్మెంట్లలో 31 ఇన్స్టాల్మెంట్లు పెండింగ్‌లో పెట్టటం సీపీఎస్ ఉద్యోగుల పట్ల వివక్షనే.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ తరహా వాయిదాల పద్ధతి ద్వారా తీవ్రంగా నష్టపోతున్నామని, ఇకనైనా ఈ వాయిదాల విధానానికి స్వస్తి పలుకాలని ఉద్యోగులు వేడుకొంటున్నారు. అదేవిధంగా డీఏలను ప్రకటించిన వెంటనే ఆయా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం గత నెలలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీలు ఐక్య ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. జేఏసీలు ప్రతిపాదించిన 64 డిమాండ్లలో ప్రభుత్వం నాలుగు ప్రధాన డిమాండ్లు తీసుకొని సీపీఎస్ రద్దు అంశం నాలుగవ అంశంగా పేర్కొనటం అసంతృప్తికి గురిచేస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగుల్లో 50 శాతానికి పైగా ఉన్న సీపీఎస్ ఉద్యోగుల పట్ల తమ వైఖరిని మార్చుకోవాలని, లేదంటే తీవ్ర ఉద్యమ కార్యాచరణ చేపట్టటానికి కూడా వెనుకంజవేయబోమని హెచ్చరిస్తున్నారు.
– (వ్యాసకర్త: టీఆర్టీఎఫ్ మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి)
డాక్టర్ మొక్తాల మురళి 9705447142