జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాస్ లీడర్ కాదు. తన పేరు, ఇమేజ్‌పై ఆధారపడి రెండు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు వ్యక్తిగత ప్రజాదరణ లేదని స్పష్టమవుతున్నది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమితో కలిసి ఆయన పార్టీ గెలిచింది కానీ సొంతంగా గెలవలేదు. అక్కడి అసెంబ్లీలో జనసేన ప్రాతినిధ్యం కేవలం 12 శాతం మాత్రమే.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పదవి రావటంతో తనని తాను గొప్ప నాయకుడిగా ఊహించుకొని, తెలంగాణ రాజకీయాల్లో తన సభతో ఏదో అద్భుతం చేస్తానని, తాను ఏది మాట్లాడితే అది చెల్లుతుందని పవన్ కల్యాణ్ అనుకున్నారేమో. తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు రావటంతో జనసేనకు, ఆయన వ్యక్తిగత రాజకీయ విశ్వసనీయతకూ నష్టం వాటిల్లింది. ‘అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి’ అని తేలిపోయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. దశాబ్దాల ఉద్యమం, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మేధావుల త్యాగాలు, కేసీఆర్ నిరాహార దీక్ష ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం ప్రతి తెలంగాణవాదికి భావోద్వేగ అంశం. అలాంటి రోజున పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో రాజకీయ సభ నిర్వహించాలని అనుకోవటం అంటే ఇక్కడి ప్రజలను రెచ్చకొట్టటమే!
ఈ పరిణామాల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉన్నదనటంలో అనుమానం లేదు! ప్రధాని మోదీ ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా కొన్ని రాజకీయ భేటీలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ భేటీల వెనుక ఉన్న అసలు రాజకీయ ఉద్దేశాలు ఏమిటన్నది అర్థమవుతున్నది. పార్టీలు స్థాపించే హక్కును రాజ్యాంగం ఇచ్చినా, ఆంధ్ర ఆధిపత్య భావజాలంతో ఉన్న తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల విషయంలో తెలంగాణ ప్రజల అభిప్రాయం భిన్నంగా ఉంటుంది.
ఆంధ్ర ఆధిపత్యం, వివక్ష, అణచివేత, పక్షపాతం, ఆత్మగౌరవం తదితర అంశాలపై ఉన్న అనుభవాల కారణంగా ఇక్కడి ప్రజలు ఆయా నాయకత్వాలకు అధికారాన్ని అప్పగించటానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాజకీయాలు పూర్తిగా తెలంగాణ కేంద్రంగా జరిగాయి. రాజకీయంలో రాటుదేలిన చాణక్యం, దూరదృష్టి, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని, రాజకీయ శక్తిగా మలచటంలో కేసీఆర్ నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యారు. దీంతో తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది.
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి తాను టీటీడీ నుంచి కోట్ల రూపాయలు విరాళంగా ఇప్పించానని పవన్ కల్యాణ్ తరచూ ప్రస్తావించటం ఏమిటి? ఆ విరాళంతోనే కొండగట్టు గుడి నడుస్తున్నదా? దేశవ్యాప్తంగా అనేకమంది భక్తులు ఆలయాలకు కోట్ల రూపాయల విరాళాలు అందిస్తుంటారు. పలువురు తాము చేసిన, చేయించిన దానధర్మాలను వ్యక్తిగత విశ్వాసంగా భావిస్తారు. టీటీడీ విరాళాన్ని తనదే అన్నట్టుగా చెప్పడం సమంజసమా? కానీ ఆ విషయాన్ని రాజకీయ వేదికలపై ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకో? గుడికి ఇచ్చిన విరాళాలతో రాజకీయాలను ముడిపెడతారా?
హైదరాబాద్‌లో నవ నిర్మాణ సభలు నిర్వహించే ముందు పవన్ కల్యాణ్ ముందుగా ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. తెలంగాణకు బయటివారి నవ నిర్మాణ పాఠాలు అవసరం లేదు. పవన్ కల్యాణ్ తెలంగాణపై సెంటిమెంట్ మాటలు మాట్లాడారు. అయితే తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించటంలో జరిగిన వైఫల్యాలపై ప్రధాని మోదీని ప్రశ్నించే ధైర్యం ఆయనకు ఉన్నదా? ఏపీకి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు కేటాయించినా, తెలంగాణకు రావాల్సిన రూ.1,350 కోట్లు ఇవ్వలేదు.
రైల్వేలకు నిధుల కేటాయింపులో ఏపీకి రూ.10,134 కోట్లు ఇచ్చి, తెలంగాణకు కేవలం రూ.5,000 కోట్లు మాత్రమే కేటాయించారు. కరీంనగర్, జనగామ, వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన లెదర్ పార్కులకు నిధులు ఇవ్వలేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మద్దతు ఇవ్వలేదు. కానీ ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు. పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు. ఐఐఎం, నవోదయ పాఠశాలలను ఇవ్వలేదు. ఈ విషయాలపై మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నించగలరా?
గోదావరి జలాలను బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నుంచి తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే, పవన్ కల్యాణ్ తెలంగాణ పక్షాన నిలుస్తారా? లేదా ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా? ఇప్పటికైనా తెలంగాణలోని పవన్ అభిమానులు ఒక విషయం గమనించాలి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆయన తెలంగాణకు మద్దతు ఇచ్చే నాయకుడు కాదు. ఆంధ్రప్రదేశ్తెలంగాణ మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌కే మద్దతుగా నిలుస్తారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణలో నవ నిర్మాణ్ పేరిట కుట్రలు చేయవద్దు. మీ కుట్రలన్నింటినీ భగ్నం చేయగల బలమైన నాయకుడు, అపర చాణక్యుడు, ధైర్యం, దూరదృష్టి, మేథస్సు, వ్యూహాత్మకత, నిర్భయత్వం, నాయకత్వ సామర్థ్యం కలిగిన అసాధారణ నాయకుడు కేసీఆర్ ఇక్కడ ఉన్నారన్న విషయం మరిచిపోవద్దు.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు)
జీవీ రామకృష్ణారావు 9866767777