Mehreen Pirzadaa | టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల భామ, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకుని అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. పెళ్లి అనంతరం ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మెహ్రీన్ వివాహం 2026 ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ అందమైన రిసార్ట్‌లో సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
మెహ్రీన్ వివాహం చేసుకున్న వ్యక్తి పేరు అర్ష్ ఔలక్. ఆయనకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. వ్యాపార రంగానికి చెందిన వ్యక్తి అని టాక్. పెళ్లి ఫోటోలతో పాటు భర్తను అభిమానులకు పరిచయం చేసిన మెహ్రీన్ తాజాగా భర్త అర్ష్ ఔలఖ్ తో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్‌లో మెహ్రీన్‌ని చూసిన ఆమె అభిమానులు.. మీ జంట చాలా క్యూట్‌గా ఉంది. నిండు నూరేళ్లు ఇలానే సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మెహ్రీన్ గతంలో 2021లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు, రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ నిశ్చితార్థం తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం భవ్య బిష్ణోయ్ తన జీవితంలో ముందుకు సాగగా, ఆ తర్వాత మెహ్రీన్ కూడా అర్ష్ ఔలక్ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
పంజాబ్‌కు చెందిన మెహ్రీన్, ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, పంజాబీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మెహ్రీన్ పెద్దగా సినిమాలు చేయడం లేదు.