కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 28 నెలలు కావస్తున్నది. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం తాజాగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు’తో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐదు దశల్లో ప్రారంభించిన కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు పాల్గొనలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఏమాత్రం అమలు చేయలేకపోవడంతో ప్రజల నుంచి వారికి వ్యతిరేకత ఎదురవున్నది.
అధికారులకు ఇష్టం లేకున్నా విధిలో భాగంగా పాల్గొని ప్రజా వ్యతిరేకతను చవిచూస్తున్నారు. కొన్ని గ్రామాల్లో నామమాత్రంగా సభలు నిర్వహించి, చేతులు దులుపుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో లబ్ధి పొందిన వారినే సభకు రహస్యంగా పిలిపించుకొని వారి అభిప్రాయాలను రాసుకొంటూ ‘మమ’ అనిపిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలతో పాలన సాగుతున్నది. ప్రజాపాలన పేరుతో, ఆరు గ్యారంటీల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇపుడు ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నది. రేవంత్‌రెడ్డి 6 గ్యారెంటీల పేరుతో, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలకు అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి రాగానే వాటి అమలును అటకెక్కించి అహంకారపూరితంతో మాట్లాడుతున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన హామీ నేటికీ నిలబెట్టుకోలేదు. భూమిలేని ఉపాధి రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. పోడు రైతులు, అసైన్డ్ భూముల రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఈ హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు.
చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క వర్గానికి రిజర్వేషన్ల శాతాన్ని పెంచలేదు. ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్‌కు రూ.750 కోట్లు మంజూరు చేస్తామన్నారు. కానీ ప్రస్తుతమున్న కార్పొరేషన్‌కు ఒక్క పైసా కూడా నిధులు విదల్చడం లేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 23 నుండి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేర్చకుండా మరింత జఠిలం చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరు మీద బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాదికి బీసీ సంక్షేమం కోసం రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లో లక్ష కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. బీసీ సబ్ ప్లాన్ కూడా అటకెక్కినట్టే.
ప్రభుత్వ పాలన అక్రమాలు, అవినీతి, కుంభకోణాలు, కూల్చివేతలు, అణచివేతలకు కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రికి మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న శ్రద్ధ రైతులు, పేద, మధ్య తరగతి ప్రజల మీద లేదు. కార్పొరేట్ కంపెనీల కోసం, కాంట్రాక్టులకు లబ్ధి చేకూరే విధంగా పాలన కొనసాగుతున్నది. రేవంత్ సర్కార్ ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ శక్తులకు దాసోహమైంది. అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ఎక్కడికక్కడ పేదల భూముల కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వెలుగుమెట్ల ప్రజల గోస చూశాం, మూసీ బాధితుల బతుకుల ఆవేదన విన్నాం, లగచర్ల ప్రజల గోడు చూశాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్నివర్గాలకు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు.
– జంగిలి యాదగిరి
9441801134