త్రిపురారం, ఆగస్టు 2 : గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె దవాఖానల ఏర్పాటు కార్యక్రమం కొన్ని చోట్ల నత్తనడకన సాగుతోంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో నిర్మించిన పల్లె దవాఖాన రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ప్రజలకు ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ, దాని పరిధిలో అనేక గ్రామాలు ఉండటం, గ్రామ జనాభా అధికంగా ఉండటంతో స్థానికులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా పల్లె దవాఖాన నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సహకారంతో గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణ పనులు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి. అయితే నేటికీ భవనం పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో ప్రారంభోత్సవం చేసేందుకు జాప్యం జరుగుతోంది.
రెండేండ్లుగా అసంపూర్తిగా పనులు..
పల్లె దవాఖాన నిర్మాణ పనులు ప్రారంభించిన రెండేండ్లవుతున్నా మరికొన్ని పనులు పెండింగ్లోనే ఉన్నాయి. గదుల నిర్మాణం పూర్తయినప్పటికీ తలుపులు, విద్యుత్తు సౌకర్యం, ఫ్యాన్లు, బాత్రూంలు తదితర మౌలిక సదుపాయాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో భవనం ఖాళీగా ఉండిపోయింది. వైద్య సేవల కోసం ప్రస్తుతం గ్రామ ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపైనే ఆధారపడాల్సి వస్తోంది. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇబ్బందులు ఎదురొంటున్నామని, గ్రామంలోనే దవాఖాన ప్రారంభమైతే ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో పనులు..
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పల్లెదవాఖాన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత పనులు నెమ్మదించాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘గత ప్రభుత్వం చేపట్టిన పనికావడంతోనే పూర్తి చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందా? లేక త్వరలో ప్రారంభిస్తారా?..’ అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ప్రఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భవనాన్ని వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ విషయమై పెద్దదేవులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శిరీషను వివరణ కోరగా త్వరలో పనులు పూర్తి చేయించి దవాఖాననుప్రారంభిస్తామన్నారు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభించాలి..
మా గ్రామంలో అధిక జనాభా ఉన్నందున పల్లె దవఖాన పనులు వెంటనే పూర్తి చేసి వెంటనే ప్రారంభించాలి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలి. చుట్టుపక్క గ్రామాల ప్రజలకు మంచి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను ప్రారంభించి, ఇక్కడి ప్రజలకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నా.
-గుండెబోయిన వెంకటేశ్వర్లు, పెద్దదేవులపల్లి సర్పంచ్