మన్సూరాబాద్, ఆగస్టు 2: మద్యం మత్తులో ఉన్న ఓ తల్లి 9 నెలల తన కుమార్తెను చెరువులో ముంచి హత్యచేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై వినోద్‌కుమార్ కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లాకు చెందిన రవీందర్‌రెడ్డి, లోకసాని రాజేశ్వరి(34) భార్యాభర్తలు. వీరికి కుమార్తె లోకసాని అనూరాధ ఉంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా రాజేశ్వరి ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఆదివారం మద్యం తాగిన రాజేశ్వరి సాయంత్రం 6:30 గంటల సమయంలో చిన్నారితో కలిసి ఎల్బీనగర్, సాగర్ రింగ్‌రోడ్డు సమీపంలోని బైరామల్‌గూడ చెరువు వద్దకు వచ్చి, చిన్నారి అనూరాధను చెరువులో ముంచింది.
కొద్దిదూరంలో ఉన్న యువకులు దీన్ని గమనించి పరుగెత్తుకొచ్చి చిన్నారిని బయటకు తీశారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. చిన్నారిని చంపిన సమయంలో తల్లి మద్యం మత్తులో ఉన్నట్టు ఎస్సై తెలిపారు. కాగా భర్తతో దూరంగా ఉంటున్న రాజేశ్వరి మరోవ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. అతడితో గొడవ కారణంగానే చిన్నారిని హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.