వరంగల్ ప్రతినిధి)/హైదరాబాద్/ములుగు, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు భరోసా ఇవ్వాలనే సదాశయంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం అంకురార్పణ చేసిన పథకం ‘కల్యాణలక్ష్మి’. 2014 అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకం ప్రారంభమైంది. ఉద్యమకాలంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ములుగు మండలం (నేటి ములుగు జిల్లా కేంద్రం)లో ఒక గిరిజన కుటుంబం తమ బిడ్డ పెండ్లి కోసం పడిన కష్టాన్ని కేసీఆర్ కండ్లారా చూశారు.
ఆ గిరిజన తండ్రి దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కల్యాణలక్ష్మి. ఈ మానవీయ పథకం పురుడు పోసు కొని శుక్రవారానికి పుష్కరం పూర్తవుతున్నది. ఇప్పటివరకు సుమారు 13 లక్షల మంది కుటుంబాల్లో కల్యాణకాంతులు నింపింది.
కళ్యాణలక్ష్మి పథకం అంకురార్పణకు 2002 మార్చిలో బీజం పడింది. వరంగల్ జిల్లా ములు గు మండలం రామచంద్రాపురం గ్రామం పరిధిలోని భాగ్యతండాలోని (కొడిశలకుంట శివారు) పెద్దలంతా దుర్గమ్మ పండుగకు (ఉగాది పండుగ ముందు)వెళ్లారు. తండాకు చెందిన బానోత్ కీమానాయక్, రుకమ్మల ముగ్గురు కుమార్తెలు కల్పన, సునీత, కవిత ఇంటి వద్దే ఉన్నారు. రాత్రి గుడిసెకు నిప్పంటుకున్నది. అప్పటికే మంటలు వ్యాపించడంతో వస్తువులన్నీ ఆహుతయ్యాయి.
శ్రీరామనవమి తర్వాత పెద్ద బిడ్డ(కల్పన) పెండ్లి పెట్టుకున్నారు. ఇందుకోసం తెచ్చిన సామాను, బట్టలు, ఖర్చుల కోసం తెచ్చిపెట్టిన రూ.50వేలు కాలిపోయాయి. అప్పుడు తెలంగాణ కోసం సింహగర్జన చేస్తున్న కేసీఆర్‌కు భాగ్యతండా విషయం తెలిసి భాగ్యతండాకు వెళ్లి వారిని ఓదార్చారు. ప్రమాదంపై ఆరా తీశారు. ధైర్యం చెప్పి పెళ్లి ఖర్చంతా భరిస్తా. కాలిన ఆ రూ.50 వేలనూ ఇస్తా అని మాటిచ్చి నిలబెట్టుకున్నారు.
రాష్ట్రం సిద్ధించిన తర్వాత నాలుగు నెలల్లోనే ‘కళ్యాణలక్ష్మి’ని కేసీఆర్ ప్రారంభించారు. మొదట దళిత, గిరిజనులతోపాటు ‘షాదీముబారక్’ పేరు తో మైనారిటీలకు అమలు చేశారు. ఆ తర్వాత బీసీలు, అగ్రవర్ణ పేదలకు కూడా వర్తింపజేశారు. 2016 ఏప్రిల్ 1న బీసీలు, ఈబీసీలు, 2017 మార్చి 19న అగ్రవర్ణ పేదలను సైతం ఈ స్కీమ్ పరిధిలో చేర్చారు. మొదట రూ.51వేలు, 2017లో రూ.75,116, ఆ తర్వాత 1,00,116 చొప్పున చెక్కులుఅందజేస్తున్నారు.
బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో లక్షలాది నిరుపేదల ఇండ్లల్లో కల్యాణకాంతులు నింపిన కల్యాణలక్ష్మి పథకంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కత్తిగట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. బడ్జెట్లో ఘనంగా కేటాయింపులు జరుపుతున్నా, అమలులో నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడుతున్నారు. మూ డేండ్ల కాంగ్రెస్ పాలనలో దరఖాస్తుదారులు సాయం కోసం నిరీక్షించాల్సి వచ్చింది. 2026 జనవరి నాటికి 1.2 లక్షల దరఖాస్తులు ఉండగా, ఇందులో 50 వేలకు పైగా పెండింగ్‌లో ఉండడ మే ఇందుకు నిదర్శనం. మూడేండ్లలో సుమారు 4లక్షల మంది దరఖాస్తుచేసుకోగా, కేవలం 1.60లక్షల మందికే ఆర్థిక సాయం అందినట్టు చెప్తున్నారు. కల్యాణలక్ష్మి అమలుపై దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడంలోనూ ప్రభు త్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 12న హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆలస్యంగా మేల్కొని కౌం టర్ దాఖలు చేసింది. స్టే ఎత్తేయాలని అభ్యర్థించింది. దీంతో పథకం తిరిగి పట్టాలెక్కింది.
2002లో తమ పెండ్లికి కేసీఆర్ చేసిన సాయాన్ని కల్పన, యాకూబ్ దంపతులు ఇప్పటికీ మర్చిపోలేదు. ‘సద్ది తిన్నా రేవు తలంవాలె అంటరు. కానీ, మేం ఉన్నంతకాలం కేసీఆర్‌ను మతిల పెట్టుకుంటం’ అని చెప్తున్నారు. తన పెండ్లికి ఆదుకున్న కేసీఆర్‌ను రోజూ గుర్తు చేసుకునేందుకు తన ఇద్దరు పిల్లలకు పేరు పెట్టుకున్నారు. చంద్రశేఖర్‌రావు అని కలిసేలా బిడ్డకు చంద్రకళ అని, కొడుకుకు చంద్ర హుస్సేన్ అని పేరు పెట్టుకొని తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనాకాలంలో కల్యాణలక్ష్మి పథకాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ఏటా బడ్జెట్లో క్రమం తప్పకుండా నిధులు కేటాయించేవారు. పెండ్లయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే చెక్కులు అందించేవారు. పథకం అమలులో ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా చేపట్టారు. ఇలా 2014-15లో రూ.200 కోట్లు, 2015-16లో రూ. 300 కోట్లు, 2016-17లో రూ.300 కోట్లు, 2017-18లో రూ. 750 కోట్లు, 2018-19లో రూ. 1450 కోట్లు, 2019-20లో రూ. 1450 కోట్లు, 2020-21లో రూ. 1350 కోట్లు, 2021-22లో రూ. 2750 కోట్లు, 2022-23లో రూ.2750 కోట్లు, 2023-24లో రూ. 3210 కోట్లు కేటాయించారు.

కేసీఆర్ పాలనా కాలంలో సుమారు 13 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు సుమారు రూ.13 వేల కోట్లు సాయం చేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. తద్వారా లక్షల మంది తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వులు నింపారు. ఈ పథకం ఐక్యరాజ్యసమితి ప్రశంసలు సైతం అందుకున్నది. 18 ఏండ్లు నిండినవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దీంతో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణ పేదలకు రూ.లక్ష నూటాపదహార్ల నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని ఆశచూపింది. ఊరూరా బహిరంగ సభలో పెట్టి ప్రచారం చేసింది. ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకంలో భాగంగా 100 రోజుల్లో అమలు చేస్తామని ఊదరగొట్టింది. కానీ గద్దెనెక్కిన తర్వాత పూర్తిగా మరిచిపోయింది.
దాదాపు మూడేండ్లు కావొస్తున్నా ప్రభుత్వం మాత్రం తులం బంగారం ఊసెత్తడంలేదు. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రశ్నించినా, బుకాయించి తప్పించుకుంటూ వస్తున్నది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే నిరుపేద ఆడబిడ్డల పెండ్లికి 8 గ్రాముల బంగారం అందిస్తున్నది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీసం ఆలోచన కూడా చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ చేసిన మోసంపై మహిళా లోకం మండిపడుతున్నది.
‘మా అమ్మ (కల్పన) కేసీఆర్ సారును రోజూ యాదిజేసుకుంటది. ఆయన పేరు కలిసేటట్టు నాకు, మా అన్నకు పేరుపెట్టింది. ఊర్లో మా నాన్న (యాకూబ్)ను అందరూ టీఆర్ఎస్ అని పిలుస్తారు. కొంతమంది కేసీఆర్ అని కూడా పిలుస్తుంటారు. నా పెండ్లి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సార్ క్యాంప్ ఆఫీసులో చేసిండు. పెండ్లిల్నే కల్యాణలక్ష్మి చెక్ ఇచ్చిండు.
– చంద్రకళ (కల్పన కుమార్తె)
నా పేరు బానోత్ కిమానాయక్ కానీ నన్ను తెలంగాణ కీమానాయక్ అని పిలుస్తున్నరు. కేసీఆర్ తెలంగాణ తెచ్చినోడైతే, నేను కల్యాణలక్ష్మి పథకానికి కారణమైనోడిని. 2002లో పుట్టెడు దుఃఖంలో ఉన్న నాకు కేసీఆర్ సారు పెద్దదిక్కుగా నిలిచిండు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను, నా కుటుంబ సభ్యులు ఆయన మేలును మరిచిపోరు. ఆయన మళ్లీ రావాలి, మంచి పనులు చేయాలి.
– బానోత్ కీమానాయక్
కేసీఆర్ సార్‌కు మేము ఎప్పటికీ బాకీ పడి ఉంటాం. బిడ్డ పెండ్లి ఎట్ల చేయాల్నో తెలియక రంది పడుతున్న మా చింతను కేసీఆర్ ‘కల్యాణలక్ష్మి’ తీర్చింది. నా బిడ్డ పేరు అనిత. 2021 మేలో మోస్రా మండలం చే తండాకు చెందిన యువకుడికి ఇచ్చి పెండ్లి చేసినం. పెండ్లి తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్తో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకుంటే రు.లక్షా 116 సహాయం అందింది. ఆ పైసలతో పెండ్లిబాకీ తీర్చేసినం. మా కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్ సార్‌కు కృతజతలు. కల్యాణలక్ష్మి పథకంతో మా గిరిజన ఆడబిడ్డల పెండ్లి భయం పోయింది. మా చుట్టాల్లో చాలా మందికి ‘కల్యాణలక్ష్మి’ డబ్బులు వచ్చినయ్. దీంతో వారంతా సంతోషంగా ఉన్నారు.
– రేణుకాబాయి, రాజీవ్‌నగర్ తండా, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా