వికారాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగా మారింది. పేదలకు ఉచితంగా అందించాల్సిన కీలకమైన మందులు రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు ఉచితంగా మందులను అందించాల్సిన సర్కార్ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. కీలకమైన మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో ఏ రోజూ ఎదురుకాని మందుల కొరత కాంగ్రెస్ హయాంలో తరచూ వేధిస్తుండటం గమనార్హం.
దవాఖానల్లో అవసరమైన మందులు లేక డబ్బులు వెచ్చించి బయట కొనుగోలు చేయడం భారంగా మారుతుందని రోజువారీ కూలీలు, ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్య తరగతి కుటుంబాల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వైద్యులు మందులు రాసినా దవాఖానల్లో స్టాక్ లేదనే సమాధా నం వస్తుండటంతో బయట మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. ఇదే సమస్య తరచూ ఎదురవుతుందని వారు చెప్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రామయ్యగూడ పీహెచ్సీతోపాటు కొత్తగడి సీహెచ్సీ, శివారెడ్డిపేట్ పల్లెదవాఖానల్లో ఉచితంగా అందించే మందులకు సంబంధించి ఆరా తీయగా ఐరన్, క్యాల్షియం మందుల కొరత విషయం వెలుగులోకి వచ్చింది. పలు దవాఖానల్లో స్లైన్లు కూడా అందుబాటులో లేని పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి.
నెలరోజులుగా క్యాల్షియం, ఐరన్ టాబ్లెట్ల సరఫరా నిలిచిపోయిందని రోగులు, వారి బంధువులు చెప్తున్నారు. గత నెల రోజులుగా స్టాక్ లేదని ఆయా ప్రభుత్వ దవాఖానలోని సిబ్బంది చెప్తున్నారని రోగులు పేర్కొంటున్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు సూచించిన అనంతరం సంబంధిత మందులు ప్రభుత్వ దవాఖానలు, పల్లె దవాఖానల్లో అందుబాటులో లేకపోవడంతో బయట ప్రైవేట్ మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు.
వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మందులు బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయడం అదనపు ఆర్థిక భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గర్భిణులు, బాలింతలు, రక్తహీనత ఉన్నవారికి వైద్యులు సూచించే కీలకమైన ట్యాబ్లెట్లలో క్యాల్షియం, ఐరన్ టాబ్లెట్లు ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపంతో రక్తహీనత సమస్య తలెత్తే వారికి వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు అవసరమవుతాయి. ఇలాంటి సమయంలో మందులు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. కొరతకు అసలు కారణాలు ఏంది? జిల్లా స్థాయిలో మందుల సరఫరాలో ఆలస్యం జరుగుతుందా? లేదంటే రాష్ట్రస్థాయిలోనే మందుల సరఫరాలో సమస్య ఉన్నదా? అనే విషయమై స్పష్టత లేకుండాపోయింది. ఆయా దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులకు సంబంధించి అవసరానికి తగినట్టు ముందస్తు స్టాక్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవసరమైన మందులపై ముందుగానే అంచనా వేసే వ్యవస్థ ఉన్నా నెలరోజులపాటు కీలకమైన ట్యాబ్లెట్లు లేకపోవడం ఏందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరఫరాను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యమే కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. జిల్లాలో సరిపోను మందులు ఉన్నాయని, స్టాక్ ఈ రోజు, రేపు వస్తుందని చెప్తూ సంబంధిత అధికారులు సమస్యను దాటవేస్తుండటం గమనార్హం. కొరతను నివారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.