హిమాయత్‌నగర్, అక్టోబర్ 1 : ఓట్ల తొలగింపులో ఈసీ తన వైఖరిని మార్చుకోవాలని లేకపోతే హైదరాబాద్‌తోపాటు ఎన్నికల కమిషన్ కార్యాలయం కూడా తగలబడిపోతదంటూ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం కింగ్‌కోఠిలో మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 20వేల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఏఎంసీలు, ఏఆర్వోలు బీజేపీతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.
తమ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా ఎన్నికల కమిషన్ అధికారులు, బీజేపీ నేతలు వ్యవస్థీకృతమై ఓటు చోరీకి పాల్పడుతున్నారని, ఈసీ తక్షణమే స్పందించి ఇప్పటిదాకా తొలగించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని యథావిధిగా పునరుద్ధరించాలని దానం డిమాండ్ చేశారు.