ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 1: ‘లేకలేక ఏర్పాటు చేసిన సభ.. మళ్లీ ఎప్పుడుంటదో తెల్వది.. అవకాశమున్నప్పుడే అందినకాడికి దండుకోవాలనుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ కాంగ్రెస్ నేత సభకు వెళ్లిన మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు తన వద్ద ఉంచుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బుధవారం సదరు నేత ఇంటి వద్ద గొడవ జరిగినట్టు తెలిసింది. స్థానికులు తెలిపిన, సోషల్ మీడియాలో వైరల్ అయిన వాయిస్ రికార్డు వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని ఓ గ్రామంలో బస్సులో మందిని తీసుకెళ్లేందుకు ఇద్దరు ఇన్చార్జిలకు బాధ్యతలు ఇచ్చారు. ఎలాగోలా కష్టపడి ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ఇప్పిస్తామని 60 మందిని బస్సులో తీసుకెళ్లారు. సభ ముగిసిన తర్వాత డబ్బులు కావాలని ఇన్చార్జిలను అడిగారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఓ చోట కూర్చున్నాడు. ఇన్చార్జి తీసుకున్న వ్యక్తులు ఎంత ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడం.. సభకు వెళ్లిన వారు డబ్బుల కోసం నిలదీయడంతో డబ్బులు తీసుకున్న నాయకుడి ఇంటికి వెళ్లారు.
అక్కడ కూడా సదరు నాయకుడు లేక పోవడంతో ఇన్చార్జి నాయకులు తలలు పట్టుకున్నారు. చివరకు డబ్బులు తీసుకున్న వ్యక్తి ఆచూకీ తీసి అక్కడికి వెళ్లగా సదరు నాయకుడే ఇన్చార్జిలతో వాగ్వాదానికి దిగాడు. “అసలు మీరు కాంగ్రెస్ నాయకులే కాదు” అంటూ మాట్లాడటంతో దానిని ఇన్చార్జిలు రికార్డు చేశారు. అది కాస్తా ఉదయం సోషల్మీడియా గ్రూపుల్లో వైరల్ కావడంతో ఇన్చార్జి నేతలు కొంత మందికి సర్దుబాటు చేసినట్టు తెలిసింది.