వాదన ఆగిన చోట హింస మొదలవుతుంది. రాజకీయ ప్రత్యర్థిని గెలువలేమనే నిస్పృహ కలిగినప్పుడే భౌతిక దాడికి తెగబడతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో అచ్చంగా జరిగింది ఇదే. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ కార్యకర్తల దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆఫీసులపై, కార్యకర్తలపై కాంగ్రెస్ పొలిటికల్ గూండాగిరి ఇదే మొదటిసారికాదు. గతంలో ఐదారుసార్లు కాంగ్రెస్ మూకలు బీఆర్ఎస్ ఆఫీసులపై విరుచుకుపడ్డాయి. గత ఏడాది జనవరిలో సిద్దిపేటలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు సృష్టించిన హింసాకాండ ఇంతాఅంతా కాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయంపై జరిగిన ఘాతుక దాడిలో పలువురు గాయపడటం తెలిసిందే. భువనగిరి, సిరిసిల్లలోనూ గులాబీ కార్యాలయాలు కాంగ్రెస్ మార్క్ హింసోన్మాదానికి గురయ్యాయి. ఓ మాజీ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రస్తుత సీఎం ఫొటో పెట్టాలని పాలక పక్షీయులు వీరంగం వేయడం సిగ్గుచేటు. అయితే, గులాబీ పార్టీ ఎదురుదాడికి దిగడానికి ఎంతోసేపు పట్టదు. కానీ రాజకీయ నైతిక విలువలకు కట్టుబడి ప్రజాస్వామికంగానే ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి తెలియకుండా గజ్వేల్‌లో ఆ దాడి జరిగిందని ఎవరూ అనుకోరు. అది ఆయన ఆత్మన్యూనతా భావనకు అద్దం పడుతున్నది. నోరు నొచ్చేటట్టు బూతులు వల్లించడం సరిపోలేదేమో, ఏకంగా తమ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి బీఆర్ఎస్ కార్యాలయంపై రాళ్లు వేయించారు. దివాలాకోరు రాజకీయానికి ఇంతకన్నా మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. విపక్ష ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటో పెట్టాలని రూలేమీ లేదు. పైగా అది గవర్నమెంటు ఆఫీసు కూడా కాదు. పోనీ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కార్యాలయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఫొటోలు పెట్టిన ఉదంతాలు ఏవైనా ఉన్నాయా? అంటే అదీ లేదు. కనీస ప్రజాస్వామిక మర్యాదలు, మన్ననలు పాటించలేని ఫ్యూడల్ దురహంకారం జరిపించిన దాడిగానే దీనిని చూడాలి. గజ్వేల్‌లో పగిలి ముక్కలైంది కిటికీల అద్దాలు కావు, ప్రజాస్వామిక విలువలు. హస్తం పార్టీ జిల్లా ముఖ్యనేతపై, మరికొందరిపై కేసు నమోదు కావడం కాంగ్రెస్ ఏడో హామీ అయిన ప్రజాపాలన అసలురంగును బయటపెట్టింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఓ మేరునగం. తెలంగాణ సాధించింది ముమ్మాటికీ కేసీఆరే. సాధించిన తెలంగాణను సమున్నతంగా నిలబెట్టిందీ ఆయనే. అందుకే ఆయన చిత్తరువు ప్రజల గుండెల మీద కొలువుదీరింది. అధికారపు వెలుగునీడలతో అది మారేది కాదు. అది ఎన్నటికీ చెరిగిపోని, ఎవ్వరూ చెరుపలేని శిలాక్షరం. కానీ మోసపూరితంగా అధికారం చేజిక్కించుకుని గోడల మీదకు ఎగబాకాలని చూసేవారికి కేసీఆర్ కీర్తికాంతులు చూస్తే కండ్లు బైర్లు కమ్ముతాయి. అందుకే ఆనవాళ్లు లేకుండా చేస్తామని, ముద్రలు చెరిపేస్తామని పగటి కలలు కంటుంటారు. తాము ఎన్నటికీ ఆయన దరిదాపుల్లోకి రాలేమని వారికి తెలుసు. అందుకే అంత అక్కసు. వైరభక్తితో అనునిత్యం కేసీఆర్ నామస్మరణలో తరిస్తుంటారు. ప్రజల గుండెల్లోకి తొంగిచూసేందుకు మాత్రం వెనుకాడుతారు. అక్కడ కేసీఆర్ స్థానం సుస్థిరం. అందుకే గోడల మీద పడతారు. తన ఫొటో పెట్టాలని ఒక సీఎం వెంపర్లాడటం విడ్డూరం. ఎవరి ఫొటో ఎక్కడ పెట్టాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పటికే మోసపోయి గోసపడుతున్న ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టేందుకు సరైన అదను కోసం ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ గుర్తుంచుకుంటే మంచిది.