తెలంగాణ అంటే మనకు మొదట యాదికొచ్చేది బతుకమ్మ పండుగే. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని, స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమం దాక ‘బతుకమ్మ’ వేదికగా ఆటపాటలతో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణ పుడమి ఒడిలో పురుడోసుకున్న పూలను పూజించుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలను గౌరవించుకునే సంప్రదాయం తెలంగాణలో తరతరాలుగా కొనసాతున్నది. బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు చీరలు పంపిణీ చేసి ఆ సంప్రదాయాన్ని కేసీఆర్ ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. కానీ, రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ మాత్రం బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసి మహిళల పట్ల చిన్నచూపును ప్రదర్శించడం హేయనీయం.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసింది. అందులో భాగంగానే బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రభుత్వం తరపున ఏటా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించింది. ఊరూరా ఉత్సవాలను నిర్వహించేందుకు నిధులు మంజూరు చేసింది. గ్రామాల్లో వీధి లైట్లు, నిమజ్జనం చేసే ప్రాంతాల్లో విద్యుత్తు దీపాలను ఏర్పాటుచేసింది. దీంతో ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూవాడ సందడిగా మారేది. అంతేకాకుండా కేసీఆర్ సర్కార్ బతుక మ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కారణంగా మహిళలు బతుకమ్మ సంబురాలు ఏటా ఘనంగా నిర్వహించుకునేవారు. కానీ, ఈ యేడు పరిస్థితి భిన్నంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసి మహిళల పట్ల వ్యతిరేకతను చెప్పకనే చెప్పింది. అంతేకాదు, బతుకమ్మ పండుగ ప్రారంభమైన నాటినుంచే సందడిగా ఉండాల్సిన పల్లెలు వెలవెలబోయాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తుందని ఆశపడ్డ మహిళలకు నిరాశే మిగిలింది. కనీసం గ్రామాల్లో బతుకమ్మ ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే అందుకు కారణం.
కుల, మతాలకతీతంగా తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ సందర్భంగా కానుకను అందించాలన్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పుట్టింది. మొద ట్లో 30 డిజైన్లతో ప్రారంభమై, ఆ తర్వాత 225 డిజైన్లకు చేరుకున్నది. మొత్తంగా 21 రంగులు, 500 వెరైటీలతో చీరలు ఉత్పత్తి అయ్యాయి. చీరల రూపకల్పనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి చెందిన నిపుణులను నియమించడం మహిళల పట్ల నాటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలిపింది.
ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా రేషన్‌కార్డు లో పేరున్న ప్రతి మహిళకు కేసీఆర్ ప్రభుత్వం చీరను పంపిణీ చేసింది. కానీ, ఇప్పుడు బతుకమ్మ పండుగ ముగిసినా చీరల పంపిణీ ఊసే లేదు. బీఆర్ఎస్ ఒక్క చీరే ఇచ్చింది, తాము అధికారంలోకి వస్తే రెండు చీర లిస్తామని ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి చీరల పంపిణీ కార్యక్రమానికి మంగళం పాడారు. అంతేకాదు, చీరలకు బదులు నగదు ఇస్తామని ప్రభుత్వ వర్గాల నుం చి లీకులు కూడా ఇచ్చారు. అటు చీరలు, ఇటు నగదు ఏవీ అందలేదని రాష్ట్ర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం బాధాకరం.
ఆడబిడ్డలకు కానుకగా చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలైన ఈ కార్యక్రమం మూలంగా తెలంగాణలో ఆత్మహత్యలు, ఆకలిచావులతో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల చేనేత కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. సిరిసిల్లలో మూలకుపడ్డ 16 వేల మరమగ్గాలు మళ్లీ ఊపందుకున్నాయి. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే 15 వేల మందికి ఉపాధి దొరికింది. అయితే, ఇప్పుడు రేవంత్ సర్కార్ చీరల పంపిణీ కార్యక్రమం నిలిపివేయడంతో నేతన్నల కుటుంబాలు మళ్లీ రోడ్డున పడ్డాయి. ఉపాధి కోల్పోయిన నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఇదిలా ఉంటే… ఆరు గ్యారెంటీల్లో భాగంగా మొదటి గ్యారెంటీగా మహాలక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఊరూరా ప్రచారం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాడు వంద రోజుల్లోనే ఈ గ్యారంటీలన్నీ అమలు చేస్తానని ఊదరగొట్టారు. ఆరు గ్యారెంటీలమో కానీ, మొదటి గ్యారెంటీకే మోక్షం లేదు. కాంగ్రెస్ సర్కార్ నెలకు రూ.2,500 చొప్పున రాష్ట్రంలోని ఒక్కో మహిళకు మొత్తం రూ.25,000 ఇప్పటికే బకాయి పడింది. ఈ రూ.25 వేలను వెంటనే ప్రతి మహిళ ఖాతాలో వేసి కాంగ్రెస్ పార్టీ పాప ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.