‘కుక్కతోక పట్టుకొని గోదారి ఈదలేరన్న’ సామెతను రేవంత్‌రెడ్డి సర్కారు మళ్లీ అనుభవంలోకి తెచ్చింది. గమ్యం చేర్చాలన్న సదుద్దేశం రథసారథికి ఉంటే సరైన దారిలో రథాన్ని నడుపుతాడు, ప్రమాదంలో పడేయాలనుకుంటే పెడదారిలో తీసుకెళ్లి కాటగలుపుతాడు. అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులోనూ రేవంత్ చేతిలో పగ్గాలున్నాయి. ఇక, బడుగుల నడకను ఏవైపునకు మళ్లిస్తారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ కాంగ్రెస్ కుప్పిగంతులు వేయడం ఇదే తొలిసారి కాదు, కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీ పాలనలో నిర్విరామంగా ఇది సాగుతూనే ఉన్నది.
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే దుర్గుణం కాంగ్రెస్ పార్టీకి పుట్టుకతోనే వచ్చింది. ఆ కారణంగానే ఒక్క బీసీలకే కాదు, న్యాయం కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న వర్గాలన్నింటి హక్కులకూ సమాధి కట్టింది. కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి మన రాష్ట్రంలో బూసాని కమిషన్ దాకా, దేన్నయినా బీసీల ఆశలను కూల్చే బుల్డోజర్లా వాడుకున్నదే కానీ వారి ముందడుగుకు మాత్రం వినియోగించలేదు. కుదిరితే తెగనరకడం, లేకపోతే దారి మళ్లించడం అనే ఎత్తుగడనే బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్నది. అదే ధోరణిని గాంధీల కంటే రెండాకులు ఎక్కువే ఒంటబట్టించుకున్న రేవంత్‌రెడ్డి రిజర్వేషన్లపై రాజకీయ డ్రామా నడిపిస్తున్నారు.
అసలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ రేవంత్ సర్కార్ ప్రదర్శిస్తున్న విన్యాసాలు రాజకీయ నటసమ్రాట్ను కళ్లెదుట సాక్షాత్కారింపజేస్తున్నాయి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల కాలపరిమితి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు హామీ కుర్చీ ఎక్కిననాడే ముఖ్యమంత్రికి తెలుసు. కానీ, అన్నీ తెలిసినా అపసవ్యంగా పావులు కదపడమే శకుని నైజం కదా! ఆ నైజానికి నవీన పొలిటికల్ వెర్షన్ అయిన రేవంత్‌రెడ్డి సర్కార్ దాదాపు ఏడాదిన్నరగా ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా చూపిస్తున్నది.
తన రాజకీయ ప్రయోజనాల కోసం, బీఆర్ఎస్ను నిందించేందుకు ఆగమేఘాల మీద కాళేశ్వరంపైనా, విద్యుత్తు ఒప్పందాలపైనా విచారణ కమిషన్లను నియమించింది. కానీ, ఏడాదిగా రెండు కోట్ల జనాభా కలిగిన బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాత్రం ఏ చర్యలూ చేపట్టలేదు. బీసీ రిజర్వేషన్లకు పంగనామం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కాలుదువ్వింది. మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ రాజ్యాంగం, కులగణన ప్రచారానికి రేవంత్‌రెడ్డి చర్యలు కళంకంగా మారుతాయని సొంత పార్టీ పెద్దలే ఢిల్లీకి ఉప్పందించారు. దీంతో, మనసొప్పని పనికి ఒళ్లొంచక తప్పని పరిస్థితి రేవంత్ సర్కార్‌కు ఎదురైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం అలాగే పనిచేసింది. మొదలుపెట్టిందే మళ్లీ లేవకుండా కొట్టడానికి అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా తెలిసి తెలిసి, మేధావుల మాటలను పెడచెవిన పెట్టి రెగ్యులర్ బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్‌గా గుర్తిస్తూ, బీసీ గణన బాధ్యత అప్పగిస్తూ ప్రభుత్వం నియామక జీవో ఇచ్చింది.
‘డాక్టర్ కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’, ‘వికాస్ కిషన్‌రావు గవళి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ కేసుల్లో సుప్రీం ధర్మాసనం తీర్పు మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల అమలుకు డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలి. కానీ, కావాలనే రెగ్యులర్ బీసీ కమిషన్ ద్వారా కసరత్తు జరిపించే కుట్రలు చేస్తున్నారని ఎండగట్టడంతో, అనివార్య పరిస్థితుల్లో డెడికేటెడ్ కమిషన్‌ను నియమించారు. విస్తృత అధ్యయనం జరపాల్సిన డెడికేటెడ్ కమిషన్‌ను కేవలం ఏక సభ్యుడితో నియమించారు. సరిపడా నిధులు, సిబ్బందిని ఇవ్వకుండా సంక్షేమ భవన్‌లోని ఒక మూలన కూర్చోబెట్టారు. చివరికి బీసీ సంక్షేమ శాఖపై ఆధారపడే డిపెండెంట్ కమిషన్ లాగా డెడికేటెడ్ కమిషన్‌ను దిగజార్చారు.
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కల్యాణలక్ష్మి, బీసీబంధు మొదలుకొని 450 సంక్షేమ పథకాల్లో బీసీల అభ్యున్నతికి పునాదులు వేశారు. బీసీల సంక్షేమానికి రూ. 60 వేల కోట్లకుపైగా వెచ్చించింది. నూతనంగా 350 బీసీ గురుకులాలు ప్రారంభించి, విద్యార్థులకు ఫూలే విదేశీ విద్యానిధిని అందించింది. రాజకీయాల్లో 58 కార్పొరేషన్ చైర్మన్లు, 8 ఎమ్మెల్సీలు, 5 రాజ్యసభ స్థానాలతోపాటు తొలి శాసనసభ స్పీకర్‌గా, మండలి చైర్మన్‌గా, తొలి ఆర్థికమంత్రిగా ఎన్నో ఉన్నత పదవుల్లో బీసీలకు అవకాశాలు కల్పించింది.
స్వతంత్ర, నిష్పాక్షిక పద్ధతిలో కమిషన్ పనిచేయకుండాప్రభుత్వమే విపత్కర పరిస్థితులను సృష్టించింది. డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, సర్వే బాధ్యతలు సైతం దానికే అప్పగిస్తూ చట్టంలోనే అధికారాలను దఖలు పరిచి ఉంటే, నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ లేదా మరేదో డిపార్ట్మెంట్ను నియమించుకొని శాస్త్రీయ పద్ధతిలో సర్వే జరిపించి ఉండేది. ఆ వాస్తవ గణాంకాలపై ఆధారపడి రూపొందించిన కమిషన్ నివేదికను క్యాబినెట్ ఆమోదించి, అసెంబ్లీలో చట్టం చేసి, కేంద్రానికి పంపి, ఒత్తిడి ద్వారా తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టించగలిగి ఉంటే 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమమయ్యేది. కానీ, కపట తలారికి ఉరితాళ్లపై మమకారమే కానీ జీవితాలపై ప్రేమ ఉంటుందా? అందుకే అశాస్త్రీయ విధానంలో సర్వే జరిపించి, అచేతన డెడికేటెడ్ కమిషన్‌తో నివేదిక రూపొందించి బీసీలనే కాదు, మొత్తం రాష్ర్టాన్నే లెక్క తప్పించారు.
ఎన్యుమరేటర్‌గా రేవంత్‌రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్‌గా జానారెడ్డి పనిచేసి రూపొందించిన రాజకీయ కూడికలు, తీసివేతల పట్టికలా మారిన కులగణన రిపోర్ట్‌తో ఒక్క బీసీలకే కాదు మొత్తం రాష్ర్టానికి ఎనలేని నష్టం. అందుకే బీఆర్ఎస్ పార్టీ రీసర్వేకు డిమాండ్ చేస్తున్నది. కానీ, కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అతి తెలివితేటలతో రీసర్వే డిమాండ్‌ను ఒక దెబ్బకు రెండు పిట్టలు లక్ష్యంగా బీసీ రిజర్వేషన్లు ఎగ్గొట్టి, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకు వాడుకుంటున్నది. అందుకే కుట్రల ఎక్కాల పుస్తకానికి మరో రెండు పేజీలు జోడించేందుకు అన్నట్టుగా మిగిలిపోయిన వారికి అవకాశం కోసం రీసర్వే పేరిట కొత్త నాటకమాడుతున్నది. పైన చెప్పినట్టు డెడికేటెడ్ కమిషన్ ద్వారా రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల తీర్పుల వెలుగులో సర్వే, అధ్యయనం జరిపి ఉంటే కొంత పారదర్శక ప్రక్రియ అనిపించుకునేది.
రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అనుకుంటే, తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థల నుంచి చట్టసభల్లో, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ ఆమోదంతో చట్ట రూపం దాల్చడం చిటికెలో పని. కానీ, ఒకపార్టీ నోటితో చెప్పి నొసటితో వెక్కిరిస్తూ, మరో పార్టీ ఒక నయా బీసీని ముందేసి మందినంతా మోసం చేస్తూనే ఉన్నది.
బీసీలకు వెన్నుపోటు వెనక కాంగ్రెస్‌కు చారిత్రక నేపథ్యమే ఉన్నది. హస్తం పార్టీ పిడికిట్లో ఎన్నో బీసీ తరాలు మోసపోయాయి. పెరియార్, అంబేద్కర్ ఒత్తిడి కారణంగా వేసిన కాకా సాహెబ్ కాలేల్కర్ కమిషన్ 1953లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఆ తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు పిలిపించుకుని, మందలించి, కాలేల్కర్తోనే డిసెంట్ నోట్ రాయించారు.
1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నియమించిన మండల్ కమిషన్ 1980లో నివేదిక సమర్పించినా, 1990లో వీపీ సింగ్ సర్కార్ అమలు ఉత్తర్వులు ఇచ్చేదాకా, సుప్రీంకోర్టు అనుమతితో 1993లో కేవలం నియామకాల్లో అమలులోకి వచ్చేదాకా ఏనాడూ కాంగ్రెస్ పార్టీ బీసీలను పట్టించుకోలేదు. పైగా నిండు పార్లమెంట్లో 1990 ఆగస్ట్ 7న బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ గంటపాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. క్రీమీలేయర్‌ను అడ్డం పెట్టుకుని మరి కొంతకాలం జాప్యం చేయాలని కుట్రలు చేశారు. అయితే, రెండు వారాల్లోనే క్రీమీలేయర్ గుర్తింపు కమిటీ నివేదిక అందజేయడంతో మింగలేక, కక్కలేక 1993 సెప్టెంబర్ 8 నుంచి కేంద్ర సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలుచేయక తప్పలేదు.
ప్రభుత్వ ఉద్దేశాన్ని పట్టించుకోకుండా త్వరితగతిన క్రీమీలేయర్ నివేదికను అందించినందుకు నాటి క్యాబినెట్ సెక్రటరీ చీవాట్లు పెట్టాడని కమిటీకి నాయకత్వం వహించిన సీనియర్ ఐఏఎస్ పీఎస్ కృష్ణన్ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఇక, దశాబ్దాల పోరాటం వల్ల 2008 నుంచి మాత్రం కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఇలా అడుగడుగునా బీసీలకు తీరని ద్రోహం చేసిన చరిత్ర అఖిల భారత కాంగ్రెస్ పార్టీది.
‘ఆవు పొలంలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?’ అన్నట్టుగా ఉమ్మడి రాష్ట్రంలోనూ బీసీ రిజర్వేషన్లకు 1972 దాకా రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పెద్దలు మోకాలడ్డారు. శివశంకర్ ఆత్మకథ ‘అదొక్కటే ముగింపు’లో రెండుసార్లు కష్టపడి తయారుచేసిన బీసీ కులాల జాబితాను నీలం సంజీవరెడ్డి ఎలా రద్దు చేసిందీ, పాలకులు ఏ విధంగా అడ్డంకులు సృష్టించిందీ విఫులంగా వివరించారు. నాడు కమండల్ ఉద్యమం నుంచి నేటి జనగణనలో కులగణన డిమాండ్‌ను అణచివేయడం దాకా కమలం పార్టీ బీసీల హక్కుల హననానికి పాల్పడుతూనే ఉన్నది. పైగా కేంద్ర సిబ్బంది సంఖ్యను 41.76 లక్షల నుంచి 34.5 లక్షలకు తగ్గించి, కేంద్ర కొలువుల్లో రిజర్వేషన్ల వాటాకే ఎసరు పెట్టింది. అంతిమంగా అశాస్త్రీయ కోటాతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లు తెచ్చి, రాష్ర్టాల మెడలపై కత్తిపెట్టి అమలు చేయించింది. ఈ విధంగా దశాబ్దాలుగా బడుగులు ముందడుగు వేయకుండా, బీసీల ఇరు పాదాలపై జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ రాచపుండ్లుగా మారిపోయాయి.
బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్ననాటి నుంచే బీసీల వైపు నిలబడి కొట్లాడింది. తొలినాట రూపొందించుకున్న మ్యానిఫెస్టోలోనే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల సాధన లక్ష్యాన్ని స్పష్టంగా పొందుపరిచింది. ఆర్.కృష్ణయ్య సహా బీసీల హక్కుల కోసం ఎవరు పోరాడినా గులాబీ దళం భుజం కలిపి పోరాడింది. రాష్ట్ర సాధన లక్ష్యాన్ని ఎత్తుకొని నడుస్తూనే, బీసీల పోరాటంలోనూ ముందు నడిచింది. ఆర్.కృష్ణయ్య ఆమరణ దీక్షకు దిగితే కేసీఆర్ స్వయంగా విద్యానగర్‌లోని దీక్షా శిబిరానికి వెళ్లి మద్దతు తెలపడమే కాదు, రాష్ట్ర బంద్ పిలుపును విజయవంతం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం శ్రేణులను క్రియాశీలకంగా ఉద్యమింపజేశారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సుదీర్ఘంగా సమావేశమై బీసీల సమస్యలపై చర్చించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కల్యాణలక్ష్మి, బీసీబంధు మొదలుకొని 450 సంక్షేమ పథకాల్లో బీసీల అభ్యున్నతికి పునాదులు వేశారు.
బీసీల సంక్షేమానికే రూ. 60 వేల కోట్లకుపైగా బీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించింది. నూతనంగా 350 బీసీ గురుకులాలు ప్రారంభించింది. విద్యార్థులకు ఫూలే విదేశీ విద్యానిధిని అందించింది. రాజకీయాల్లో 58 కార్పొరేషన్ చైర్మన్లు, 8 ఎమ్మెల్సీలు, 5 రాజ్యసభ స్థానాలతోపాటు తొలి శాసనసభ స్పీకర్‌గా, మండలి చైర్మన్‌గా, తొలి ఆర్థికమంత్రిగా ఎన్నో ఉన్నత పదవుల్లో బీసీలకు అవకాశాలు కల్పించింది. అడ్వకేట్ జనరల్‌గా, ఉస్మానియాతో సహా పలు వర్సిటీలకు వీసీలుగా, గ్రేటర్ మేయర్, ఉప మేయర్లుగా కీలక స్థానాల్లో బీసీ వర్గాలను నిలబెట్టింది. పార్టీలో సైతం సెక్రటరీ జనరల్ లాంటి కీలకమైన పదవితో పాటు అన్ని స్థాయుల్లో బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించింది. బీసీల జనాభా తగ్గిందని నిలదీసేందుకు ఆధారంగా ‘సకలజనుల సర్వే’ నివేదికను అందుబాటులో ఉంచింది.
విభజన సమస్యలు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీల రిజర్వేషన్లు తగ్గించి స్థానిక ఎన్నికలకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏర్పడింది. అయినా, తమిళనాడు తరహా రిజర్వేషన్లు, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. 2021లో కేంద్ర జనగణనలో బీసీల వివరాలు సేకరిస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన దరిమిలా, ఆ అధికారిక గణాంకాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నట్టే కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఒక్క రైతాంగ హక్కుల విషయంలోనే కాదు, దేశ సామాజిక న్యాయ పోరాటంలోనూ అద్భుతాలు ఆవిష్కృతమయ్యేవి.
ఏదేమైనా బీఆర్ఎస్ ప్రాధాన్య మౌలిక లక్ష్యాలైన వ్యవసాయం, సాగునీరు, నిధులు తదితర వాటిపై ఎంత మనసుపెట్టి పోరాడుతున్నదో, అంతే సమానంగా న్యాయమైన వాటా కోసం ఆందోళన పడుతున్న వర్గాలను కూడా గుండెలపై మోస్తూనే ఉంటుంది. తెలంగాణ నేలపై జన్మించిన ప్రతి బిడ్డ చేతిలో భవితవ్యపు రగల్ జెండా బీఆర్ఎస్. అందుకే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీర్చాల్సిందేనని వెంటపడుతున్నది. ఒకవేళ కేసీఆర్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మిగతా ముఖ్య నేతలతో సహా బీఆర్ఎస్ పార్టీ మొత్తం అసెంబ్లీ లోపల, వెలుపల ఉద్యమించకపోయి ఉంటే బీసీ రిజర్వేషన్ల పెంపు ఊసు లేకుండానే రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ముగించేది. అయితే, మండల్ చెప్పినట్టు వెనుకబాటుతనంపై పోరాటం ముందుగా బీసీల మెదళ్లలో మొదలుకానంత కాలం జాతీయ పార్టీలు నినాదాలతో మభ్యపెడుతూనే ఉంటాయి. కాంగ్రెస్, బీజేపీల ద్రోహపూరిత చరిత్రను బీసీలు మరిస్తే, ముందు తరాలకు మరింత గడ్డుకాలం మిగిల్చినవారమైపోతాం.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయగౌడ్