‘ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కాదు, ఓ సర్కస్ కంపెనీ’ – ఇది మేం అంటున్న మాట కాదు, యావత్ తెలంగాణ ప్రజలు తమ మనస్సుల్లో గూడుకట్టుకున్న బాధను దిగమింగుకొని అంటున్న మాటలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పాలకులు ఎవరినీ వదలలేదు. రైతుల పరిస్థితి చూస్తే.. ఎరువులుండవు, విత్తనాలుండవు, రైతుబంధు రాదు, రైతు బీమా దక్కదు. కాంగ్రెస్ నాయకుల
మాయమాటలు నమ్మి ఓటేసిన పాపానికి ఇంకో మూడేండ్లు ఈ బాధ అనుభవించక తప్పదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
మహిళల పరిస్థితి చూస్తే… మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2500 రూపాయలిస్తమని, ఆడపిల్లలకు స్కూటీలిస్తమని ఓట్లేయించుకొని గద్దెనెక్కి, ఇప్పుడు అన్నీ ఎగ్గొట్టిండ్రు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తమని పత్తా లేకుండా పారిపోయిండ్రు. చివరికి బతుకమ్మ చీరెలను కూడా బంద్ చేసి తన చేతగానితనాన్ని నిరూపించుకున్నరు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వరు. స్కాలర్షిప్లు, మెస్ చార్జీలు ఇవ్వకుండా పస్తులుంచుతున్నరు. గురుకులాలను నిర్వీర్యం చేసిన్రు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలను ఎగ్గొట్టిన్రు. ఆఖరికి అవ్వాతాతలకు పింఛన్లు పెంచకుండా నట్టేట ముంచిండ్రు రేవంత్.
సంక్షేమ పాలనను సాగిస్తూ బీఆర్ఎస్ సర్కార్ అప్రతిహతంగా ముందుకుసాగింది. గంగా జమునా తహజీబ్‌లాగా మత సామరస్యాన్ని కేసీఆర్ కాపాడిండ్రు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, బతుకమ్మ చీరెలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్‌లు.. ఇట్లా ఒకటేమిటి అన్నీ చేసిండ్రు. తెలంగాణ ఏర్పాటుకు ముందు మైనారిటీ గురుకులాలు పన్నెండే ఉండేవి. వాటిలో 5 వేల మంది మాత్రమే చదువుకునేవారు. కానీ,కేసీఆర్ వాటి సంఖ్యను 192కి పెంచిండ్రు. ఇవ్వాళ ఆ స్కూళ్లలో సుమారు లక్ష మంది చదువుకుంటున్నరు. బీఆర్ఎస్ ప్రభు త్వం మైనారిటీలకు రూ.10 వేల కోట్లు ఖర్చుపెడితే… ఇవాళ కాంగ్రెస్ ఏం చేసింది? రెం డేండ్ల నుంచి ఓవర్సీస్ స్కాలర్షిప్లను ఎగ్గొట్టింది. రంజాన్ తోఫాను రద్దు చేసింది. క్యాబినెట్లో రెండేండ్లుగా ముస్లిం మంత్రి లేరు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎట్లున్న జూబ్లీహిల్స్, ఎట్ల అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలి. ఆ నియోజకవర్గ పరిసరాల్లో బీఆర్ఎస్ హయాంలో స్థాపించిన ఐటీ కంపెనీలతో ఇవాళ లండన్, న్యూయార్క్, పారిస్ తదితర విదేశీ నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆదాయం అనూహ్యంగా పెరిగింది.
ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్లే… ఢిల్లీలో తిరిగే కాంగ్రెస్ మంత్రులు నేడు గల్లీల్లో పరుగులు పెడుతున్నారు. “నాకు మోసం చేసుడు అలవాటే – ఈ ప్రజలకు మోసపోవుడు అలవాటే” అని నిస్సిగ్గుగా బహిరంగంగా మీడియా ముందు తన ఫిలాసఫీని వెకిలిగా వెల్లడించిన ఈ దుర్మార్గ పాలకుల మెడలు వంచాలంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలవాలి.
సంపద పెంచి, ప్రజలకు పంచాం.. ఇదీ బీఆర్ఎస్ మార్క్ పాలన. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గొప్పగా సచివాలయాన్ని కట్టినం. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించినం. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించినం, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టినం. ఇదంతా వట్టిగనే అయిం దా? బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాత్రింబవళ్లూ సేవ చేస్తేనే జరిగింది. కానీ, ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండ్రు? పచ్చగ నడిచే సంసారాన్ని బజార్ల పెట్టిండ్రు. దివాళా రాష్ట్రమని ప్రచారం చేసిండ్రు. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. దాని మీద ఆధారపడిన 18 అనుబంధ రంగాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నయి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఆయన అనుచరగణం దగ్గర తప్ప ప్రజలెవరి చేతిలో పైసలుంటలేవు.
సంపద సృష్టించడం, ప్రజలకు పంచడం తెలియని ఈ ముఖ్యమంత్రికి చార్జీలు పెంచడం, పేద ప్రజల ముక్కుపిండి వసూలు చేయడం ఒక్కటే తెలుసు. ఇవాళ బస్సు చార్జీ లు పెంచిండ్రు. కరంటు చార్జీలు పెంచిండ్రు. నల్లా బిల్లులు పెంచిండ్రు. పన్నులతో పేద ప్రజల నడ్డి విరిచిండ్రు. ఈ పన్నుల బాదుడు ఆగాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలె. అందుకోసం జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ విజయ ప్రస్థానం ఆరంభం కావాలి.
ఇప్పటికే అన్ని సర్వేలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని స్పష్టం చేస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల కుట్రలకు తెరలేపింది. బీఆర్ఎస్ నేతల ఇండ్లపై దాడులకు దిగింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేసేందుకు పోలీసులు, అధికారులను ఉసిగొల్పింది. ఎన్నికల కోడ్ అమలులో లేని ప్రాంతాల్లో కూడా అనుమతి లేకుండా రైడింగ్ చేయించి, పోలీసులతో భయానక వాతావరణంసృష్టించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విచ్ఛలవిడిగా మద్యం పంచారు. ఇంతకాలం అక్రమంగా సంపాదించిన ప్రజల సొమ్మును ఓటుకు రూ.5 వేల పైనే పంచుతున్నరు. మహిళలకు చీరెలు, మహిళా సంఘాలకు డబ్బు సంచులు, ఇంటింటికీ మద్యం బాటిళ్లు ఇస్తున్నారు. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తున్నా, అటు ఎన్నికల సంఘం అధికారులు గాని, ఇటు పోలీసులు గాని చేసిందేమీ లేదు.
ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్లే… ఢిల్లీలో తిరిగే కాంగ్రెస్ మంత్రులు నేడు గల్లీల్లో పరుగులు పెడుతున్నారు. “నాకు మోసం చేసుడు అలవాటే – ఈ ప్రజలకు మోసపోవుడు అలవాటే” అని నిస్సిగ్గుగా బహిరంగంగా మీడియా ముందు తన ఫిలాసఫీని వెకిలిగా వెల్లడించిన ఈ దుర్మార్గ పాలకుల మెడలు వంచాలంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలవాలి. ప్రజలు ఎన్నటికీ మోసపోరని నిరూపించాలి. యావత్ తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజానీకమంతా… జూబ్లీహిల్స్‌లోని నాలుగు లక్షల మంది ఓటర్ల వైపు చూస్తున్నరు. జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు.. మన తలరాతల మార్పు కావాలి. తెలంగాణ ప్రజల కన్నీటికి జూబ్లీహిల్స్‌లో జవాబు దొరకాలి.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు)
తక్కెళ్లపల్లి రవీందర్ రావు 95058 06666