ఈ వ్యాసంలోని ఫొటోలో కనిపిస్తున్నది మునిగె ఎల్లవ్వ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం. ఆనాటి పరాయి పాలనలోని కాంగ్రెస్ పార్టీ ఈమె భర్త ఎల్లయ్యను బలిగొన్నది. నిజానికి ఐదెకరాల ఆసామి ఎల్లయ్య. నాటి కరువు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మూడెకరాలు అమ్ముకొని బిడ్డల పెళ్లిండ్లు చేశారు. మిగిలిన రెండెకరాల భూమిలో పంట పండించేందుకు కావాల్సిన ఎరువుల కోసం వరుసగా మూడురోజులు ఉదయం వెళ్లి క్యూలో నిలబడటం, సాయంత్రం ఉట్టి చేతులతో తిరిగిరావటం. ఇదే క్రమంలో 2012, సెప్టెంబర్ 3న ఎప్పట్లాగే ఎరువుల కోసం ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడిన ఎల్లయ్య మధ్యాహ్నం 12.30 గంటలకు నీరసించి కుప్పకూలిపోయాడు.
భర్త మరణంతో కుంగిపోయిన ఎల్లవ్వ కుటుంబ భారాన్ని ఎత్తుకున్నది. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగింది. కనిపించినవారికల్లా దరఖాస్తు ఇచ్చింది. అయినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదు. రైతు అకాల మరణాన్ని చూసి చలించిపోయిన ఇప్పటి మంత్రి, నాటి సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే రూ.2.50 లక్షలు కుటుంబానికి సాయంగా అందించారు. అలాగే నాడు కూతురు పెండ్లి కోసం మూడెకరాల భూమి అమ్మిన ఎల్లవ్వకు మనవరాలి పెండ్లి సమయంలో మాత్రం మేనమామ కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి చేతికందింది. ఇదే పెద్ద కొడుకు కేసీఆర్ ఎల్లవ్వకు పింఛన్ ఇస్తున్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత కర్కశత్వంగా వ్యవహరించిందో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. నెర్రెలు బారిన నేలలు, అడుగంటిన భూగర్భజలాలు, అర్ధరాత్రి కరెంటు పెట్టేందుకు వెళ్లి చనిపోయిన రైతులు… ఇవీ నాటి కాంగ్రెస్ పాలనలోని దుర్భర పరిస్థితులు.
58 ఏండ్ల సమైక్య పాలనలో 42 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ పాలిచింది. 16 ఏండ్లు టీడీపీ పాలించింది. దశాబ్దాల పాటు పాలించినా, ఏ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించలేదు. మరోవైపు కలసిరాని కాలం, అనుకూలించని పరిస్థితులు, రిక్తహస్తం చూపిన బ్యాంకులు, చిత్తశుద్ధిలోపించిన పాలకులు, విద్యుత్తు లోపాలు, ప్రైవేటు అప్పులన్నీ కలిసి అన్నదాతను మృత్యు ఒడికి చేర్చాయి.
పాలకుల నిర్లక్ష్యం వల్ల పురుగుల మందునే పెరుగన్నంగా భావించి రైతులు తనువు చాలించారు. కన్నవారికి, కట్టుకున్న భార్యకు, రక్తం పంచుక పుట్టిన బిడ్డలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన రైతులు అర్ధంతరంగా ఆయువు చాలించారు. బలవన్మరణం పొందిన రైతుల్లో అత్యధికం తెలంగాణ వాళ్లే. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబును గద్దె దించి అధికారంలోకి రావడానికి రైతు ఆత్మహత్యలనే ప్రచారాస్త్రంగా వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ. దివంగత సీఎం వైఎస్ 2004లో చేసిన ప్రతి ప్రచారంలో రైతుల ఆత్మహత్యలను వాడుకున్నాడు. తాము అధికారంలోకి వస్తే… బాధిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటామన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తామన్నారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఆ మేరకు.. 2004 జూన్ 1న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 421 జీవోను అమల్లోకి తీసుకుచ్చింది. ఈ జీవో ప్రకారం అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పింది.
ఇదే సమయంలో ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ఇచ్చిన జీవోలో సవాలక్ష కొర్రీలు పెట్టింది. సాగుచేసి అప్పులతో చనిపోయినవాళ్లకు, అదికూడా అధికారులు ధృవీకరించినవారికే వర్తింపజేసింది. ఈ మొత్తంలో రూ.లక్ష కుటుంబసభ్యులపై డిపాజిట్ చేయడం, మిగతా రూ.50 వేలు అప్పులు చెల్లించాలనే విధంగా షరతులు పెట్టింది. జీవో అయితే ఇచ్చారు కానీ, దాని అమలుకోసం మాత్రం నానా తిప్పలు పెట్టారు. బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగడం లేదని ఎన్నోమార్లు ఎంతో మంది ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. చనిపోయిన రైతు కుటుంబాలపై నాటి ప్రభుత్వాలకు ఉన్న నిర్లక్ష్యానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. 42 ఏండ్లు ఈ రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి రైతులపై చూపిన వివక్షకు ఆ జీవో ఒక తార్కాణం. అంతేకాదు, బాధిత రైతు కుటుంబాలకు ఎంతో కొంత సాయం అందించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చి దాన్ని జీవో రూపంలో తేవడానికి కాంగ్రెస్ పాలకులకు నాలుగు దశాబ్దాల కాలం పట్టింది. ఇదీ కాంగ్రెస్ చరిత్ర. ఇప్పుడు రైతుల ఓట్లు కొల్లగొట్టేందుకు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతున్నది.
స్వరాష్ట్ర తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికార పగ్గాలు చేపట్టగానే కాంగ్రెస్ ఇచ్చిన జీవోను మార్చి రైతు కుటుంబాలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014 జూన్ 2 నుంచి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా వర్తింపజేయడానికి జీవో నంబర్ 173ను విడుదల చేసింది. అక్కడితో ఆగకుండా గుంట భూమి ఉన్న రైతు సైతం ఏ కారణంగా చనిపోయినా అతనికి పది రోజుల్లో రూ.5 లక్షల బీమా పరిహారం అందిస్తున్నది. దేశంలోనే రైతుకు రూ. 5 లక్షల బీమా కవరేజీ అందించిన తొలి రాష్ట్రం తెలంగాణే. ఉదాత్త ఆశయంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం బాధిత రైతు కుటుంబాలకు కొండంత భరోసాను అందిస్తున్నది.
రైతుబీమాను పొందడానికి బాధిత రైతు కుటుంబం ఇప్పుడు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా నామినీ ఖాతాల్లోనే డబ్బులు జమవుతాయి. రైతులకు ఇది చేస్తం, అది చేస్తం అనే చెప్పే పార్టీలు కాకుండా ఇప్పటివరకు రైతులకు ఏయే పార్టీలు ఏమేం చేశాయో రైతులు తెలుసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటు అందిస్తున్నది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించి సాగు విస్తీర్ణం పెరిగేలా కృషిచేసింది. మొత్తంగా రైతును తలెత్తుకొని తిరిగేలా చేసింది ఒక్క కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రతినిధి, కరీంనగర్)
కడపత్రి ప్రకాశ్‌రావు
80966 77022